రూ.4,500 కోట్లు నీటిపాలు?
‘ప్రాణహిత’ డిజైన్ మార్పుతో ఇప్పటివరకైన వ్యయం వృథా?
సర్వే నేపథ్యంలో పనులన్నీ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశం!
తుమ్మిడిహెట్టి నుంచి మిడ్‌మానేరు వరకు ఇప్పటికే పూర్తై పనులు
కాళేశ్వరం దిగువన ప్రాజెక్టు నిర్మిస్తే కొత్తగా కాలువలు, భూసేకరణ
చేపట్టాలి.. విద్యుత్ అవసరాలు, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే అవకాశం
డిజైన్ మార్పుతో ఇబ్బంది తప్పదంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలన్న సర్కారు నిర్ణయం వివాదాస్పదం కానుందా? ప్రస్తుత స్వరూపాన్ని మారిస్తే వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులన్నీ వృథా అయినట్లేనా..? దీనికితో డు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, విద్యుత్ అవసరాలు భారీగా పెరగనున్నాయా? కేసీఆర్ ప్రకటించినట్లు ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరం దిగువన చేపడితే.. మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకానున్నాయా?.. ఈ ప్రశ్నలన్నింటికీ నీటి పారుదల రంగ నిపుణులు, అవుననే సమాధానమిస్తున్నారు. డిజైన్ మారిస్తే ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి గుదిబండగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టు డిజైన్ మార్పుకు సంబంధించి సమగ్ర సర్వే చేపట్టినందున.. పనులన్నింటినీ నిలిపివేయాలని కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
ఘనమైన లక్ష్యం..
రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు 2008లో అప్పటి సర్కారు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది. గోదావరి నదిలోని 160 టీఎంసీల నీటిని వినియోగించుకుని.. సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు మెజార్టీ ప్రజల దాహార్తిని తీర్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు పూర్తికి రూ. 38,500 కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు. మొత్తం ప్రాజెక్టు పనులను 7 లింక్‌లు, 28 ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో లింక్-1 కింద ప్రాణహిత నది నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు 1 నుంచి 5 ప్యాకేజీలు ఉండగా... లింక్-2లో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు రిజర్వాయర్ వరకు 6 నుంచి 8వ ప్యాకేజీ వరకు ఉన్నాయి. ఇందులో మొదటి 5 ప్యాకేజీల కింద కాలువల తవ్వకం, భూసేకరణ, ఇతర అవసరాలకు రూ. 6,385.24 కోట్లు, 6 నుంచి 8వ ప్యాకేజీ పనులకు రూ. 9,249.39 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ 8 ప్యాకేజీల్లో పనులకు ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం రూ. 4,489 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
చేసిన పనులన్నీ వృథాయేనా?
పాత డిజైన్ ప్రకారం తుమ్మిడిహెట్టి బ్యారేజీ నుంచి 116 కిలోమీటర్ల దూరాన ఉన్న ఎల్లంపల్లికి నీటిని తరలించి, అక్కడినుంచి మిడ్‌మానేరుకు మళ్లించాలి. కానీ కొత్త ప్రతిపాదనల మేరకు తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా... అక్కడికి 110 కిలోమీటర్ల దిగువన కాళేశ్వరం సమీపంలో మేటిగడ్డ వద్ద నుంచి నీటిని తరలించాలని భావిస్తున్నారు. అంటే దీనివల్ల తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత 152 మీటర్ల ఎత్తు బ్యారేజీని పరిగణనలోకి తీసుకుంటూ.. అక్కడి నుంచి మిడ్‌మానేరు వరకు జరిగిన కాలువల పనులన్నీ వృథా అయినట్లే. ఎందుకంటే కొత్త ప్రతిపాదన మేరకు కాళేశ్వరం నుంచి నీటిని తరలించాలని నిర్ణయిస్తే.. కొత్తగా కాలువల నిర్మాణం, భూమిని సేకరించాల్సి రావడం తప్పదు. అదే జరిగితే ఇప్పటివరకు జరిగిన రూ. 4 వేల కోట్ల విలువైన పనులు వృథా కానుండగా, కొత్త డిజైన్‌తో నిర్మాణ వ్యయం భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
మరింత విద్యుత్ అవసరం..
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పుతో విద్యుత్ అవసరాల రూపేణా మరో సమస్య పొంచి ఉండనుంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 142 మీటర్లతో పోలిస్తే... కాళేశ్వరం దిగువన ప్రతిపాదిస్తున్న ప్రాంతం వద్ద 50 మీటర్ల మేర ఎత్తు తక్కువగా ఉండటంతో... నీటిని 200 మీటర్లకు ఎత్తిపోయాల్సి వస్తుంది. దీనివల్ల విద్యుత్ అవసరం గణనీయంగా పెరుగుతుంది. ప్రాజెక్టుకు మొత్తంగా 3,159 మెగావాట్ల విద్యుత్ అవసరమని ఇదివరకు అంచనా వేయగా... డిజైన్ మారిస్తే మరో 400 మెగావాట్లు ఎక్కువగా అవసరమవుతుందని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే యూనిట్‌కు రూ. 5.75 మేర లెక్కించినా... ఏటా రూ. 3,800 కోట్ల వరకు వ్యయం చేయాల్సి ఉంటుంది. అసలే విద్యుత్ సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో ఇంత విద్యుత్‌ను ఎక్కడి నుంచి తెస్తారని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ప్రశ్నలు వస్తున్న తరుణంలో... ఇప్పుడు మళ్లీ అదనపు విద్యుత్‌ను ఎక్కడి నుంచి తెస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలు..
ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకునే జలాలు.. 160 టీఎంసీలు
ఏడు జిల్లాల్లోని 16.40 ఎకరాల
ఆయకట్టుకు సాగునీరు అందివ్వడం
ప్రాజెక్టు మార్గాల్లోని గ్రామాలకు
తాగునీటి కోసం 10 టీఎంసీలు
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల సరఫరాకు 30 టీఎంసీలు
16 టీఎంసీల నీటిని పరిశ్రమలకు అందించడం
ప్రాజెక్టు అంచనాలు..
పరిపాలనా ఆమోదం (17-12-2008).. రూ. 38,500 కోట్లు
డీపీఆర్ ప్రకారం అంచనా.. రూ. 40,300 కోట్లు
లిఫ్ట్‌ల(ఎత్తిపోతల) సంఖ్య.. 22
అవసరమైన విద్యుత్.. 3,159 మెగావాట్లు
అవసరమైన మొత్తం భూమి.. 84,873 ఎకరాలు
ఇందులో అటవీ భూమి.. 7,673 ఎకరాలు
ఇప్పటివరకు జరిగిన వ్యయం.. (రూ. కోట్లలో)
మొత్తం ఖర్చు 8,166.21
2014-15లో జరిగిన ఖర్చు 1,983.47
1 నుంచి 5వ ప్యాకేజీ వరకు అంచనా విలువ 6,385.24
ఇందులో ఇప్పటివరకు ఖర్చు 916
6 నుంచి 8 ప్యాకేజీ వరకు అంచనా 9,249.39
ఇందులో ఇప్పటికి వ్యయం 3,573
ప్రాజెక్టులోని ఇతర ప్యాకేజీల్లో ఖర్చు 3,677.21
పనులన్నీ నిలిపివేయండి..
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్‌పై కొత్తగా సమగ్ర సర్వే చేపట్టినందున ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న పనులన్నింటినీ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం. ప్రాజెక్టు కొత్త స్వరూపానికి, ప్రస్తుత స్వరూపానికి తారతమ్యాలు ఉండడం, కొత్త ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే పలు పనుల వ్యయం వృధా అయ్యే అవకాశమున్న నేపథ్యంలో... ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్కారు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయానికే ప్యాకేజీ 1 నుంచి 8 వరకు పనులన్నీ నిలిచిపోయాయని, మిగతా పనులపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు తెలుస్తోంది.