జలయజ్ఞంలో భాగంగా తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు సాకారంలో ముఖ్యపాత్ర పోషించే భూసేకరణ విభాగం సర్కార్ నిర్వీర్యం చేస్తోంది. ఈ ప్రాజెక్టు పనుల నిమిత్తం సిద్దిపేటలో 2012 జూన్‌లో మూడో యూనిట్ ఆఫీసును అధికారులు అందుబాటులోకి తెచ్చారు. పట్టణంలోని కరీంనగర్ రోడ్డుకు సమీపంలోని ఓ ప్రైవేటు బిల్డింగ్‌లో దీనిని నెలకొల్పారు. ఈ ప్రాంతంలో అలైన్‌మెంట్ ప్రకారం భూమిని సేకరించడం ఈ కార్యాలయం ముఖ్యవిధి. అలాగే నిర్వాసితులైన భూ యజమానులకు డబ్బుల చెల్లింపుల వ్యవహారం కూడా ఈ కార్యాలయమే చూస్తుంది. ఇందుకు స్థానిక కార్యాలయం నుంచే కార్యకలాపాలు సాగాలి. క్షేత్రస్థాయిలో ఎంతో అవసరమైన ఇక్కడి భూసేకరణ యూనిట్‌పట్ల ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఈ కార్యాలయంలో ప్రస్తుతం మున్న పోస్టుల ఖాళీలే నిదర్శనం.
ఖాళీల చిట్టా ఇది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు విభాగం-3లో ముగ్గురు డిప్యూటీ తహశీల్దార్లకుగాను ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ముగ్గురు ఆర్‌ఐలు ఉండాల్సి ఉంటే..ఒక్కరికే పరిమితం చేశారు. సీనియర్ అసిస్టెంట్లు ఐదుగురికి గాను ఒక్కరూ లేరు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఐదుకు ఐదూ ఖాళీగానే ఉన్నాయి. నలుగురు సర్వేయర్లకు ఒక్కరూ లేరు. ఎనిమిది మంది చైన్‌మెన్లకు ఒక్క పోస్టయినా భర్తీ కాలేదు. ల్యాండ్ రికార్డు, డ్రాఫ్ట్‌మెన్ లేరు. ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లను ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్నారు. అందులోనూ ఇద్దరిని హైదరాబాద్ తార్నాక స్పెషల్ కలెక్టర్ కార్యాలయానికి డిప్యూటేషన్ మీద పంపించారు. ప్రస్తుతం మిగిలిన ముగ్గురితోనే పని నడిపిస్తున్నారు.
మూలిగే నక్కపై...
అసలే అధికారులు, సిబ్బంది కొరతతో సతమతమవుతున్న ఈ కార్యాలయానికి అధిపతి అయిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్‌డీసీ) జి.నర్సింహులు గత జులై 31న రిటైరయ్యారు. సిద్దిపేటలో ఆఫీసు స్థాపనతోనే ఇక్కడికి వచ్చిన ఆయన ఏడాదిపాటు విధులు నిర్వర్తించారు. నర్సింహులు ఉద్యోగ విరమణ నేపథ్యంలో కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యాం(ఎల్‌ఎండీ) ప్రత్యేక ఉప కలెక్టరు ఐలయ్యకు పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) ఇస్తూ తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. ప్రస్తుతం సిద్దిపేటలో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల భూసేకరణ కార్యాలయలానికి బాసుతోపాటు ఇతర అధికారులు, సిబ్బంది కావాలి.
‘ప్రాణహిత-చేవెళ్ల’పై సర్కార్ నిర్లక్ష్యం
Published Tue, Aug 6 2013 12:24 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement