సాంకేతిక మార్పులతో రూ.20 వేల కోట్ల ఆదా!
ప్రాణహితపై మాజీ ఈఎన్‌సీ హనుమంతరావు సూచన
నిర్మాణంలో పారదర్శకత అవసరం
సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో కొన్ని సాంకేతిక విషయాలకు మెరుగులు దిద్ది తగిన మార్పులు చేస్తే దాదాపు రూ.20 వేల కోట్ల వ్యయం తగ్గించడానికి వీలుకలుగుతుందని మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) టి.హనుమంతరావు సూచించారు. ప్రభుత్వం ప్రాజెక్టుల గురించి ఒక్కోసారి ఒక్కో విధమైన లెక్కలు చెబుతుండడంతో ప్రాజెక్టుల నిర్మాణంలో పారదర్శకత లోపిస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై పాల కులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శనివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ రైతు సంక్షేమ సమితి, తెలంగాణ రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ తనతో భేటీ సమయంలో మంత్రి హరీశ్‌రావు, ప్రాజెక్టుల నిర్మాణంలో మేలైన సాంకేతిక పద్ధతులు పాటించాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారని, అది హర్షణీయమన్నారు.
తమ్మిడిహెట్టి వద్ద లభ్యం కానీ 160 టీఎంసీల నీటిని మేడిగడ్డ (గోదావరి మీద) బ్యారేజీ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారన్నారు. తమ్మిడిహెట్టి దగ్గర నీటి మట్టం మేడిగడ్డ నీటి మట్టంకంటే దాదాపు 50 మీటర్ల ఎత్తులో ఉంటుందన్నారు. ఈ దృష్ట్యా లభ్యమయ్యే నీటినంతా తమ్మిడిహెట్టి దగ్గర తీసుకుని, తక్కువైన నీటిని మేడిగడ్డ నుంచి తీసుకోవాలన్నారు. దీనివల్ల పంపింగ్ వ్యయం, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయన్నారు. మేడిగడ్డ, అన్నారం మధ్యలో గోదావరి మీద బ్యారేజీ కట్టినట్లయితే కాళేశ్వరం ఎగువన కట్టే పంపింగ్ స్కీమ్ అవసరం ఉండదన్నారు. మేడిగడ్డ వద్ద 120 రోజులు నీటి లభ్యత ఉన్న కారణంగా అక్కడ నీటి నిల్వ అవసరం లేదన్నారు. ఎల్లంపల్లి దిగువన కట్టబోయే నాలుగు బ్యారేజీలలో రివర్సబుల్ పంపులు పెట్టాలన్నారు.
హనుమంతరావు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి
సీపీఐ నేత పశ్య పద్మ మాట్లాడుతూ.. హనుమంతరావు ఇచ్చిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలన్నారు. జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడుతూ మల్లన్నసాగర్ వద్ద ప్రాజెక్టు లేకుండానే రైతాంగానికి నీరు అందించవచ్చన్న హనుమంతరావు సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ గోదావరి పరీవాహక ప్రాంతం లో రైతులకు లాభం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క, బీజేపీ నేత రఘునందన్‌రావు, కాంగ్రెస్ నేత కోదండరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ నేత చంద్రారెడ్డి, హైకోర్టు న్యాయవాది పి.విష్ణు పాల్గొన్నారు.
నౌకాయానానికి పనికొచ్చేలా చూడాలి
నౌకాయానానికి పనికొచ్చేలాగా ప్రతీ బ్యారేజీకి నౌక లాకును ఏర్పాటు చేసి, నది పొడవునా ఎక్కడా 4 మీటర్ల కంటే తక్కువ లోతు కాకుండా నీరుండేలా చూడాలని హనుమంతరావు సూచించారు. తెలంగాణలో ఉన్న 20 ఉపనదులను గొలుసుకట్టు బ్యారేజీల ద్వారా జీవనదులుగా మార్చుకోవచ్చన్నారు.