కాళేశ్వరంతో కష్టాలెన్నో...
► డిజైన్ మార్పుతో శాశ్వత పెనుభారం...
► జేఏసీ అధ్యయనంలో వెల్లడి... నేడు నివేదిక విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత చేవెళ్ల ప్రాజె క్టును తమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం వద్ద మేడిగడ్డకు మార్చడంవల్ల తెలంగాణ ప్రజల పై శాశ్వతంగా పెనుభారం పడుతుందని తెలంగాణ జేఏసీ అధ్యయనంలో తేలింది. ప్రాజెక్టు ద్వారా ఎకరానికి అయ్యే వ్యయాన్ని సాగు నీటిపారుదల శాఖ నిపుణులు అధ్యయ నం చేశారు. తమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం దగ్గరకు ప్రాజెక్టును మారుస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల జరిగే లాభనష్టాలపై నిపుణులు అధ్యయనం చేశారు.తమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం దగ్గరకు ప్రాజెక్టును మారిస్తే నిర్మాణ వ్యయం పెరుగుతుందని, నిర్వహణ వ్యయం శాశ్వతంగా భారం అవుతుందని తేలింది.
కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు, ప్రతి పాదిత రిజర్వాయర్ల సామర్థ్యం, పంపుల సామర్థ్యం, నీటిలభ్యత, ఎత్తిపోతలకు అవకా శం ఉన్న రోజులు, సామర్థ్యం వంటివాటిపై సంపూర్ణంగా జరిపిన అధ్యయనంలో పలు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ చేస్తున్న వాదనలను అంకెలతో సహా కొట్టిపారేశారు. సాగునీటిపారుదల రంగ నిపుణులు గుజ్జా బిక్షం, శివకుమార్, విద్యుత్‌రంగ నిపుణులు కంచర్ల రఘు సంయుక్తంగా అధ్యయనం చేసి, నివేదికను రూపొందించారు.
నీటి నిల్వకు అవకాశమే లేదు...
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎకరానికి నీరందిం చడానికి ఏటా రూ.లక్ష నుంచి రూ.1.80 లక్షల దాకా ఖర్చు అవుతుందని తేలింది. 50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ప్రతిపాదించిన మల్లన్నసాగర్‌లో నీటిని నిల్వచేసే అవకాశమే లేదని ఈ అధ్యయనంలో తేలింది.
తప్పని విద్యుత్ భారం
తమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడం వల్ల కొండపోచమ్మ రిజర్వాయర్ దాకా 525 మీటర్లు ఎత్తిపోసినా ఇంతకన్నా మెరుగైన ఫలితాలు ఉండవని తేల్చారు. దీనివల్ల ఏటా 1,250 కోట్ల విద్యుత్ భారం తప్పదని తేలింది. దీనివల్ల ప్రతీ ఎకరానికి 40 నుంచి 70 వేల ద్వారా కరెంటు చార్జీలే అదనంగా పడనున్నారుు. ఈ నివేదికను తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, ఆస్కి మాజీ డీన్ గౌతమ్ పింగ్లే విడుదల చేయనున్నారు.