ఫిన్‌టెక్ హబ్‌గా విశాఖ: సీఎం
సాక్షి, అమరావతి: ఫిన్‌టెక్ కంపెనీలకు తానే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఫిన్‌టెక్ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆర్థిక సాంకేతికరంగ (ఫిన్‌టెక్) కంపెనీల సీఈవోలతో ఆయన గురువారం సచివాలయంలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖలో హాజరైన పదిహేను దేశాల ప్రతినిధులనుద్దేశించి మాట్లాడారు. విశాఖ, ముంబై మధ్య మరిన్ని విమాన సర్వీసులు నడపాలని సీఈవోలు కోరారు. కాగా, పట్టిసీమ ఎత్తిపోతల స్ఫూర్తితో గోదావరి–పెన్నా నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం చెప్పారు. సచివాలయంలో జలవనరులపై సమీక్ష సందర్భంగా ‘వ్యాప్కోస్’ రూపొందించిన నాలుగు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై చర్చించి, నాలుగో దానికి ఆమోదముద్ర వేశారు.
నాలుగో ప్రతిపాదనలో ‘పోలవరం జలాశయం ఎగువన 85 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలను ఎత్తిపోసి 292 కిలోమీటర్లు కాలువ ద్వారా తరలించి కృష్ణాజిల్లా చెరుకుపాలెం వద్ద నిర్మించే అక్విడెక్టు ద్వారా కృష్ణా నదిని దాటించాలి. గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద 360 టీఎంసీల సామర్థ్యంగల రిజర్వాయర్‌లో నీటిని నిల్వచేసి.. అక్కడి నుంచి సోమశిల, వెలిగొండ ఆయకట్టుకు తరలించాలి. సోమశిల, కండలేరు మీదుగా చిత్తూరు జిల్లాలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించవచ్చు’ అని వ్యాప్కోస్ ప్రతినిధులు వివరించారు. ఇందుకు రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. 13వ తేదీ ఉదయం 8 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ ప్రత్యేక సమావేశం జరగనుంది. బడ్జెట్‌ను ఈ భేటీలో ఆమోదించనున్నారు.