fintech hub
-
పాలసీబజార్ ఐపీవో.. సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఆన్లైన్ బీమా ప్లాట్‌ఫామ్ పాలసీబజార్ మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా రూ. 3,750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. దీనికి జతగా మరో రూ. 2,268 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 6,018 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. క్రెడిట్ ప్రొడక్టులను పోల్చి చూపే పోర్టల్ పైసాబజార్‌ను సైతం కంపెనీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీవో చేపట్టేందుకు పాలసీబజార్ ఆగస్ట్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. ఐపీవో చేపట్టే ముందు ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 750 కోట్లను సమకూర్చుకోనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. తాజా ఈక్విటీ జారీ నిధులను కంపెనీ బ్రాండ్ల ప్రాచుర్యం, బిజినెస్ విస్తరణ తదితరాలకు వినియోగించనున్నట్లు తెలియజేసింది. చదవండి: ఐపీవో.. ఓయోకి భారీ ఝలక్! -
డబ్బే డబ్బు.. భారత్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫిన్‌టెక్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద సాగుతోంది. 2021 జనవరి–జూన్ కాలంలో రూ.14,900 కోట్లకుపైగా నిధులు వెల్లువెత్తాయని కేపీఎంజీ తన నివేదికలో వెల్లడించింది. 2020 సంవత్సరంలో వచ్చిన ఫండింగ్‌తో ఇది దాదాపు సమానం కావడం గమనార్హం. పైన్‌ల్యాబ్స్ రూ.2,860 కోట్లు, క్రెడ్ రూ.1,597 కోట్లు, రేజర్‌పే రూ.1,189 కోట్లు, క్రెడిట్‌బీ రూ.1,137 కోట్లు, ఆఫ్‌బిజినెస్ రూ.817 కోట్లు, భారత్‌పే రూ.802 కోట్లు అందుకున్నాయి. కంపెనీలు డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేజిక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఇన్సూరెన్స్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. టర్టిల్‌మింట్ రూ.342 కోట్లు, రెన్యూబీ రూ.334 కోట్లు, డిజిట్ ఇన్సూరెన్స్ రూ.134 కోట్లు స్వీకరించాయి. చిన్న స్థాయి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఈ స్టార్టప్స్‌లో పెట్టుబడులు చేశాయి. టాప్–10లో నాలుగు.. ఆసియాలో టాప్–10 డీల్స్‌లో పైన్‌ల్యాబ్స్ మూడవ స్థానంలో, క్రెడ్ నాల్గవ, రేజర్‌పే ఎనమిదవ, క్రెడిట్‌బీ 10వ స్థానంలో నిలిచింది. ఇక ఐపీవోలు కొనసాగుతాయని కేపీఎంజీ నివేదిక తెలిపిం ది. పాలసీ బజార్ రూ.6,500 కోట్లు, పేటీఎం రూ.16,500 కోట్ల ఐపీవో ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనం, కొనుగోళ్ల విషయంలో ఫిన్‌టెక్ కంపెనీలను బ్యాంకులు, ఈ రంగంలోని పెద్ద సంస్థలు, సర్వీసులు అందిస్తున్న దిగ్గజాలు లక్ష్యంగా చేసుకున్నాయి. రానున్న ఏడాదిలో ముందు వరుసలో ఉన్న ఫిన్‌టెక్ యూనికార్న్ కంపెనీలు క్యాపిటల్ మార్కెట్‌పై దృష్టిసారిస్తాయి. బ్యాంకులు సైతం ఫిన్‌టెక్ కంపెనీలు, కొత్త బ్యాంకులు, వెల్త్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా సైతం.. తొలి ఆరు నెలల్లో అంతర్జాతీయంగా నిధులు వెల్లువెత్తాయి. రూ.7,28,140 కోట్లు ఫిన్‌టెక్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. 2020లో ఈ మొత్తం రూ.9,02,745 కోట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి–జూన్‌లో యూఎస్ కంపెనీల్లోకి రూ.3,78,930 కోట్లు, యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా రూ.2,90,513 కోట్లు, ఆసియా పసిఫిక్ సంస్థల్లోకి రూ.55,725 కోట్లు వచ్చి చేరాయి. విలీనాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ.3,02,400 కోట్ల విలువైన 353 డీల్స్ జరిగాయి. 2020లో 502 డీల్స్ నమోదయ్యాయి. వీటి విలువ రూ.5,49,820 కోట్లు. జూలై–డిసెంబరు కాలంలోనూ అన్ని ప్రాంతాల్లో ఇదే స్థాయిలో పెట్టుబడులు, డీల్స్ ఉండొచ్చని కేపీఎంజీ అంచనా వేస్తోంది. పేమెంట్స్, ఫైనాన్షియల్ సొల్యూషన్స్, బ్యాంకింగ్ యాజ్ ఏ సర్వీస్, బీ2బీ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు ఉంటాయని వివరించింది. చదవండి: భారత్ ఎగుమతులు ట్రిలియన్ డాలర్లకు చేరడం ఖాయం -
ఫిన్‌టెక్ దిగ్గజంగా భారత్..
న్యూఢిల్లీ: టెక్నాలజీ తోడ్పాటుతో భారత్‌లో భారీ స్థాయిలో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దీంతో ప్రపంచంలోనే ఫైనాన్షియల్ టెక్నాలజీకి (ఫిన్‌టెక్) సంబంధించి దిగ్గజ దేశాల్లో ఒకటిగా భారత్ ఎదిగిందన్నారు. స్టార్టప్ సంస్థలకు హబ్‌గా నిలుస్తున్న భారత్.. పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారిందని కూడా చెప్పారాయన. సింగపూర్‌లో జరుగుతున్న 3వ ఫిన్‌టెక్ సదస్సులో కీలకోపన్యాసం చేసిన మోదీ... ‘‘భారత్‌లో పాలనా స్వరూపాన్ని, ప్రజలకు అందించే సేవలను టెక్నాలజీ సమూలంగా మార్చేసింది. కొంగొత్త ఆవిష్కరణలు, ఆకాంక్షలను సాధించుకునేందుకు అపార అవకాశాలు కల్పిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ ఎకానమీ స్వరూపం మారింది. పోటీని, అధికారాన్ని టెక్నాలజీయే నిర్దేశిస్తోంది. ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు అపార అవకాశాలు కల్పిస్తోంది. బలహీనులకు సాధికారత కల్పించి, వారిని ప్రధాన స్రవంతిలోకి తెచ్చేందుకు తోడ్పడుతోంది. ఆర్థిక ప్రయోజనాలు మరింత మందికి చేరువయ్యేలా ఉపయోగపడుతోంది‘ అని వివరించారు. భవిష్యత్‌లో నాలుగో తరం ఫైనాన్షియల్ టెక్నాలజీలు, పరిశ్రమలు భారత్ నుంచే వస్తాయని చెప్పారాయన. 2016 నుంచి ఏటా నిర్వహిస్తున్న ఫిన్‌టెక్ సదస్సులో ప్రసంగించిన తొలి దేశాధినేత ప్రధాని మోదీయే. గతేడాది జరిగిన ఫిన్‌టెక్ ఫెస్టివల్లో 100 దేశాల నుంచి 30,000 మంది పైగా పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్లో భాగంగా మూడు రోజుల పాటు సదస్సులు, ఫిన్‌టెక్ సంస్థల ఎగ్జిబిషన్, పోటీలు మొదలైనవి నిర్వహిస్తారు. వైవిధ్యమైన సవాళ్లు.. పరిష్కార మార్గాలు భారత్‌లో వైవిధ్యమైన పరిస్థితులు, సవాళ్లు ఉంటా యని, వాటికి అనుగుణంగా పరిష్కార మార్గాలూ వైవిధ్యంగానే ఉండాలని మోదీ తెలిపారు. ప్రతి ఒక్కరి అవసరాలకు అనుగుణంగా చెల్లింపు సాధనాలను అందుబాటులోకి తేవడం వల్ల డిజిటైజేషన్ ప్రక్రియ విజయవంతమైందన్నారు. సులభంగా అందుబాటులో ఉండటం, అవకాశాలు కల్పించడం, జీవనాన్ని సులభతరం చేయడం, జవాబుదారీతనాన్ని పెంచడం వంటి ప్రయోజనాలు ఫిన్‌టెక్‌తో ఉన్నాయని, భారత్‌లో చేసిన ప్రయోగాలే దీనికి నిదర్శనమని ప్రధాని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీతో పారదర్శకత పెరుగుతోందని, గవర్నమెంట్ ఈ–మార్కెటర్ వంటి నూతన ఆవిష్కరణలతో అవినీతిని అంతమొందించే అవకాశాలు ఉంటున్నా యని ఆయన పేర్కొన్నారు. ‘130 కోట్ల మంది భారతీయులను ఆర్థిక సేవల పరిధిలోకి తేవాలన్న ఆకాంక్ష .. సాంకేతికత తోడ్పాటుతో వాస్తవరూపం దాల్చింది. కేవలం కొన్నేళ్ల వ్యవధిలోనే 120 కోట్లకు పైగా బయోమెట్రిక్ ధృవీకరణలను(ఆధార్) రూ పొందించగలిగాం‘ అని ఆయన చెప్పారు. ‘టెక్నాల జీ ఊతంతో చారిత్రక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనతికాలంలోనే డెస్క్ టాప్ నుంచి క్లౌడ్ దాకా, ఇంటర్నెట్ నుంచి సోషల్ మీడియా దాకా, ఐటీ సర్వీసుల నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ దాకా ఎంతో పురోగతి సాధించాం‘ అని మోదీ చెప్పారు. ఎపిక్స్ టెక్నాలజీ ఆవిష్కరణ.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల కోట్ల మందికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఎపిక్స్ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఎక్సే్చంజ్) బ్యాంకింగ్ టెక్నాలజీ ప్లాట్‌ఫాంను సింగపూర్ డిప్యూటీ ప్రధాని టి.షణ్ముగరత్నంతో కలిసి మోదీ ఆవిష్కరించారు. బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న 170 కోట్ల మందిని సంఘటిత ఫైనాన్షియల్ మార్కెట్ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ప్రపంచవ్యాప్తంగా అసంఘటిత రంగంలోని వంద కోట్ల మంది పైగా వర్కర్లకు బీమా, పింఛను భద్రత కల్పించాల్సి ఉందని మోదీ చెప్పారు. అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలతో దేశీ కంపెనీలను అనుసంధానించేందుకు ఎపిక్స్ తోడ్పడగలదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. హైదరాబాద్, కొలంబో, లండన్‌లోని సాఫ్ట్వేర్ నిపుణులు డిజైన్ చేసిన ఈ అత్యాధునిక టెక్నాలజీని అమెరికాలోని బోస్టన్ కేంద్రంగా పనిచేసే వర్చుసా సంస్థ అభివృద్ధి చేసింది. భారత్ వంటి పెద్ద మార్కెట్‌తో పాటు ఫిజి వంటి మొత్తం 23 దేశాల్లో ఖాతాల్లేని ప్రజలకు చేరువయ్యే క్రమంలో చిన్న బ్యాంకులకు ఎపిక్స్ ఉపయోగపడుతుందని వర్చుసా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ మీనన్ చెప్పారు. సదస్సులో ఏర్పాటు చేసిన ఇండియన్ పెవిలియన్‌లో 18 కంపెనీలను మోదీ సం దర్శించారు. మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఈ పెవిలియన్‌లో ముంబైకి చెందిన 8 కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. -
ఫిన్‌టెక్ హబ్‌గా విశాఖ: సీఎం
సాక్షి, అమరావతి: ఫిన్‌టెక్ కంపెనీలకు తానే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఫిన్‌టెక్ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆర్థిక సాంకేతికరంగ (ఫిన్‌టెక్) కంపెనీల సీఈవోలతో ఆయన గురువారం సచివాలయంలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖలో హాజరైన పదిహేను దేశాల ప్రతినిధులనుద్దేశించి మాట్లాడారు. విశాఖ, ముంబై మధ్య మరిన్ని విమాన సర్వీసులు నడపాలని సీఈవోలు కోరారు. కాగా, పట్టిసీమ ఎత్తిపోతల స్ఫూర్తితో గోదావరి–పెన్నా నదుల అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం చెప్పారు. సచివాలయంలో జలవనరులపై సమీక్ష సందర్భంగా ‘వ్యాప్కోస్’ రూపొందించిన నాలుగు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై చర్చించి, నాలుగో దానికి ఆమోదముద్ర వేశారు. నాలుగో ప్రతిపాదనలో ‘పోలవరం జలాశయం ఎగువన 85 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలను ఎత్తిపోసి 292 కిలోమీటర్లు కాలువ ద్వారా తరలించి కృష్ణాజిల్లా చెరుకుపాలెం వద్ద నిర్మించే అక్విడెక్టు ద్వారా కృష్ణా నదిని దాటించాలి. గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద 360 టీఎంసీల సామర్థ్యంగల రిజర్వాయర్‌లో నీటిని నిల్వచేసి.. అక్కడి నుంచి సోమశిల, వెలిగొండ ఆయకట్టుకు తరలించాలి. సోమశిల, కండలేరు మీదుగా చిత్తూరు జిల్లాలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించవచ్చు’ అని వ్యాప్కోస్ ప్రతినిధులు వివరించారు. ఇందుకు రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. 13వ తేదీ ఉదయం 8 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ ప్రత్యేక సమావేశం జరగనుంది. బడ్జెట్‌ను ఈ భేటీలో ఆమోదించనున్నారు.