న్యూఢిల్లీ: టెక్నాలజీ తోడ్పాటుతో భారత్‌లో భారీ స్థాయిలో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దీంతో ప్రపంచంలోనే ఫైనాన్షియల్ టెక్నాలజీకి (ఫిన్‌టెక్) సంబంధించి దిగ్గజ దేశాల్లో ఒకటిగా భారత్ ఎదిగిందన్నారు. స్టార్టప్ సంస్థలకు హబ్‌గా నిలుస్తున్న భారత్.. పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారిందని కూడా చెప్పారాయన. సింగపూర్‌లో జరుగుతున్న 3వ ఫిన్‌టెక్ సదస్సులో కీలకోపన్యాసం చేసిన మోదీ... ‘‘భారత్‌లో పాలనా స్వరూపాన్ని, ప్రజలకు అందించే సేవలను టెక్నాలజీ సమూలంగా మార్చేసింది. కొంగొత్త ఆవిష్కరణలు, ఆకాంక్షలను సాధించుకునేందుకు అపార అవకాశాలు కల్పిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ ఎకానమీ స్వరూపం మారింది. పోటీని, అధికారాన్ని టెక్నాలజీయే నిర్దేశిస్తోంది. ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు అపార అవకాశాలు కల్పిస్తోంది. బలహీనులకు సాధికారత కల్పించి, వారిని ప్రధాన స్రవంతిలోకి తెచ్చేందుకు తోడ్పడుతోంది. ఆర్థిక ప్రయోజనాలు మరింత మందికి చేరువయ్యేలా ఉపయోగపడుతోంది‘ అని వివరించారు. భవిష్యత్‌లో నాలుగో తరం ఫైనాన్షియల్ టెక్నాలజీలు, పరిశ్రమలు భారత్ నుంచే వస్తాయని చెప్పారాయన. 2016 నుంచి ఏటా నిర్వహిస్తున్న ఫిన్‌టెక్ సదస్సులో ప్రసంగించిన తొలి దేశాధినేత ప్రధాని మోదీయే. గతేడాది జరిగిన ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో 100 దేశాల నుంచి 30,000 మంది పైగా పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా మూడు రోజుల పాటు సదస్సులు, ఫిన్‌టెక్ సంస్థల ఎగ్జిబిషన్, పోటీలు మొదలైనవి నిర్వహిస్తారు.
వైవిధ్యమైన సవాళ్లు.. పరిష్కార మార్గాలు
భారత్‌లో వైవిధ్యమైన పరిస్థితులు, సవాళ్లు ఉంటా యని, వాటికి అనుగుణంగా పరిష్కార మార్గాలూ వైవిధ్యంగానే ఉండాలని మోదీ తెలిపారు. ప్రతి ఒక్కరి అవసరాలకు అనుగుణంగా చెల్లింపు సాధనాలను అందుబాటులోకి తేవడం వల్ల డిజిటైజేషన్ ప్రక్రియ విజయవంతమైందన్నారు. సులభంగా అందుబాటులో ఉండటం, అవకాశాలు కల్పించడం, జీవనాన్ని సులభతరం చేయడం, జవాబుదారీతనాన్ని పెంచడం వంటి ప్రయోజనాలు ఫిన్‌టెక్‌తో ఉన్నాయని, భారత్‌లో చేసిన ప్రయోగాలే దీనికి నిదర్శనమని ప్రధాని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీతో పారదర్శకత పెరుగుతోందని, గవర్నమెంట్ ఈ–మార్కెటర్ వంటి నూతన ఆవిష్కరణలతో అవినీతిని అంతమొందించే అవకాశాలు ఉంటున్నా యని ఆయన పేర్కొన్నారు. ‘130 కోట్ల మంది భారతీయులను ఆర్థిక సేవల పరిధిలోకి తేవాలన్న ఆకాంక్ష .. సాంకేతికత తోడ్పాటుతో వాస్తవరూపం దాల్చింది. కేవలం కొన్నేళ్ల వ్యవధిలోనే 120 కోట్లకు పైగా బయోమెట్రిక్ ధృవీకరణలను(ఆధార్) రూ పొందించగలిగాం‘ అని ఆయన చెప్పారు. ‘టెక్నాల జీ ఊతంతో చారిత్రక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనతికాలంలోనే డెస్క్ టాప్ నుంచి క్లౌడ్ దాకా, ఇంటర్నెట్ నుంచి సోషల్ మీడియా దాకా, ఐటీ సర్వీసుల నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ దాకా ఎంతో పురోగతి సాధించాం‘ అని మోదీ చెప్పారు.
ఎపిక్స్ టెక్నాలజీ ఆవిష్కరణ..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వందల కోట్ల మందికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఎపిక్స్ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ ఎక్సే్చంజ్) బ్యాంకింగ్ టెక్నాలజీ ప్లాట్‌ఫాంను సింగపూర్ డిప్యూటీ ప్రధాని టి.షణ్ముగరత్నంతో కలిసి మోదీ ఆవిష్కరించారు. బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న 170 కోట్ల మందిని సంఘటిత ఫైనాన్షియల్ మార్కెట్ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ప్రపంచవ్యాప్తంగా అసంఘటిత రంగంలోని వంద కోట్ల మంది పైగా వర్కర్లకు బీమా, పింఛను భద్రత కల్పించాల్సి ఉందని మోదీ చెప్పారు. అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలతో దేశీ కంపెనీలను అనుసంధానించేందుకు ఎపిక్స్ తోడ్పడగలదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. హైదరాబాద్, కొలంబో, లండన్‌లోని సాఫ్ట్‌వేర్ నిపుణులు డిజైన్ చేసిన ఈ అత్యాధునిక టెక్నాలజీని అమెరికాలోని బోస్టన్ కేంద్రంగా పనిచేసే వర్చుసా సంస్థ అభివృద్ధి చేసింది. భారత్ వంటి పెద్ద మార్కెట్‌తో పాటు ఫిజి వంటి మొత్తం 23 దేశాల్లో ఖాతాల్లేని ప్రజలకు చేరువయ్యే క్రమంలో చిన్న బ్యాంకులకు ఎపిక్స్ ఉపయోగపడుతుందని వర్చుసా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ మీనన్ చెప్పారు. సదస్సులో ఏర్పాటు చేసిన ఇండియన్ పెవిలియన్‌లో 18 కంపెనీలను మోదీ సం దర్శించారు. మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఈ పెవిలియన్‌లో ముంబైకి చెందిన 8 కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి.
ఫిన్‌టెక్ దిగ్గజంగా భారత్..
Published Thu, Nov 15 2018 12:03 AM | Last Updated on Thu, Nov 15 2018 9:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment