కాళేశ్వరానికి తుదిరూపు!
♦ మారిన డిజైన్ల మేరకు వ్యయ అంచనాలు సిద్ధం
♦ గత అంచనాల కంటే 18 వేల కోట్ల మేర పెరిగిన వ్యయం
♦ తుది నివేదిక సమర్పించిన వ్యాప్కోస్.. అంచనా రూ.4,231 కోట్లు
♦ అన్నిఅంశాలు కేబినెట్‌కు, మహారాష్ట్రతో చర్చల అనంతరం పనుల్లో వేగం
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం’ ఎత్తిపోతలకు తుదిరూపునిచ్చే కార్యాచరణ వేగం పుంజు కుంది. మారిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌కు అనుగుణంగా వ్యయ అంచనాలు సిద్ధమవుతున్నాయి. 8 ప్యాకేజీల అంచనాలు ఇప్పటికే సిద్ధంకాగా ఆదిలాబాద్ జిల్లాకే పరి మితం చేసిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా 2 లక్షల ఎకరాలకు నీరందించే ప్రతిపాదనలను సర్వే సంస్థ వ్యాప్కోస్ సిద్ధం చేసింది.
మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గం మధ్య నిర్మించనున్న 3 బ్యారేజీలకు ఈ నెల 7న టెండర్లు పిలిచేలా కసరత్తు సాగుతోంది. ఈ నెల 6న జరిగే కేబినెట్ సమావేశంలో మారిన డిజైన్లు, పెరిగిన అంచనాలకు ఆమోదం తెలపనున్నారు. 8న మహా రాష్ట్రతో కుదుర్చుకునే ఒప్పందంపై నీటి పారుదలశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గోదావరి నీటిని మేడిగడ్డ దిగువన ఉన్న కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి, అక్కడి నుంచి పాతమార్గంలో మెదక్, నిజామాబాద్‌లకు తరలిం చేలా ప్రణాళిక ఇప్పటికే ఖారారైంది. ప్యాకేజీ 1 నుంచి 5 వరకు తుమ్మిడిహెట్టి ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించగా, జిల్లాలో మరో 1.44 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు నివేదికను గురువారం వ్యాప్కోస్ ప్రభుత్వానికి అందజేసింది. 2 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు అంచనా వ్యయం రూ. 4,231 కోట్లుగా తేల్చినట్లు సమాచారం.
మరో 4 ప్యాకేజీల అంచనాలు సిద్ధం
ఎల్లంపల్లి దిగువన ఉన్న 6, 8, 11, 12 ప్యాకేజీల అంచనాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. మొత్తంగా ఇక్కడ 4 ప్యాకేజీల వాస్తవ వ్యయం రూ.11,098 కోట్లు ఉండగా అది సవరించిన అంచనాలతో రూ.21,537.49 కోట్లకు చేరింది. గురువారం ప్యాకేజీ 13,14,15, 16 అంచనాల వ్యయాలను సిద్ధం చేశారు. ప్యాకేజీ14లో ఉన్న పాములపర్తి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచడంతో వ్యయం రూ. 659 కోట్ల నుంచి రూ. 4,990 కోట్లకు చేరింది.
7న మేడిగడ్డ టెండర్లు: మేడిగడ్డ-ఎల్లంపల్లిల మధ్య బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలకు ఇప్పటికే రూ.5,813 కోట్లతో అనుమతులిచ్చారు. వీటికి ఈ నెల 6న కేబినెట్‌లో చర్చించి 7న టెండర్లు పిలిచే అవకాశం ఉంది. 22కి టెక్నికల్ టెండర్లు తెరిచి, నెలాఖరుకు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. టెండర్లు, మహారాష్ట్రతో ఒప్పందాలపై గురువారం అధికారులు తీవ్ర కసరత్తు చేశారు.