సీపీఎస్ రద్దు రాజకీయ ఎజెండా కావాలి
సీపీఎస్ రద్దు రాజకీయ ఎజెండా కావాలి
Published Sun, May 14 2017 11:52 PM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM
– మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ పిలుపు
–యూటీఎఫ్ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు కోరుతూ సమావేశం
భానుగుడి (కాకినాడ) : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు రాజకీయ ఎజెండాగా మారిన రోజునే న్యాయం జరుగుతుందని ప్రముఖ ఎనలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. దీనికి పూర్వపు పెన్షన్ విధానం అమలులో ఉన్న ఉద్యోగులూ మద్దతు తెలపకుంటే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందన్నారు. ఆదివారం కాకినాడ పైండా చలమయ్య కల్యాణ మండపంలో జిల్లా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో íసీపీఎస్ రద్దు కోరుతూ నిర్వహించిన సదస్సుకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కరీంనగర్ జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు మరణించగా వస్తున్న వేతనం రూ.30వేలయితే పాత పెన్షన్ విధానంలో రూ.15వేలు రావాల్సి ఉన్నా.. ప్రస్తుత విధానం కారణంగా కేవలం రూ.800 వస్తోందన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి డీఎస్ నకారా.. పెన్షన్ అనేది ప్రభుత్వం ప్రేమతో ఇచ్చే ఫలంకాదు. ఉద్యోగుల మానవ హక్కు అని స్పష్టం చేశారని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం పెంపుతో చట్టం చేసిన విధానాన్ని తప్పుబట్టానన్నారు. సీపీఎస్‌లో ఉద్యోగుల వేతన సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. ఈ విధానాన్ని తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీస గ్యారంటీ లేకుండా అడ్డగోలుగా బిల్లు ఆమోదించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలైనా దీన్ని సవరించాలన్నారు. అమెరికా, అర్జెంటీనాల్లో ఆర్థిక సంక్షోభం వస్తే కుప్పకూలిపోయింది, రోడ్డున పడ్డది పెన్షనర్లేనని, స్టాక్‌మార్కెట్ ద్వారా నష్టపోయిన వారేగాని లాభపడినవారు చరిత్రలో లేరన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జిల్లా జేఏసీ కన్వీనర్ బూరిగ ఆశీర్వాదం, రాష్ట్ర ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ ఐ.వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డీవీ రాఘవులు, టి.కామేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement