‘సీపీఎస్’ను రద్దు చేయాలి
సెప్టెంబర్ ఒకటిన విజయవాడలో సభ
ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు గిరీష్ డిమాండ్
విజయవాడ(గాంధీనగర్) :
రాజ్యాంగ వ్యతిరేకమైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, పాత విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్‌ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.గిరీష్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 57 శాఖల్లో 1.64 లక్షల మంది ఉద్యోగులు సీపీఎస్ విధానంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీపీఎస్ విధానంపై పోరాటం చేయడం సరికాదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీసీపీఎస్‌ఈఏ మీడియా కమిటీ కన్వీనర్ సీహెచ్ కష్ణారావు మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటిన విజయవాడ జింఖానా మైదానంలో సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉద్యోగ– ఉపాధ్యాయుల సమస్యలపై అశోక్‌బాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సభకు హాజరుకావాలని కోరారు. సభకు ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సీఎం దాసు పాల్గొన్నారు.