గుత్తిలో ఘరానా మోసం | mega fraud in gooty | Sakshi
Sakshi News home page

గుత్తిలో ఘరానా మోసం

Published Mon, Feb 20 2017 1:09 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

mega fraud in gooty

= తప్పుడు రిజిస్ట్రేషన్లతో రూ.కోట్ల విలువైన స్థలం విక్రయం 
= స్థల యజమాని ఫిర్యాదులో వెలుగులోకి.. 
= పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు, 
మరో మరొకరు పరారీ  

గుత్తి: గుత్తిలో ఘరానా మోసం వెలుగు చూసింది. కోట్ల విలువైన స్థలంపై కన్నేసిన కొందరు అక్రమార్కులు దొంగ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్‌ చేయించి, ఆపై ప్లాట్లుగా విభజించి అమ్మేశారు. అయితే ఆలస్యంగా మేల్కొన్న స్థల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. 

ఎక్కడ, ఎలాగంటే... 
గుత్తిలోని అనంతపురం రోడ్డులో గల సర్వే నంబర్‌ 400–ఎఫ్‌లో ఎ.భీమయ్య అనే వ్యక్తికి 1.82 ఎకరాల భూమి ఉంది. అతను 1995లో మరో వ్యక్తి నుంచి ఈ భూమిని కొనుగోలు చేశారు. అనంతరం ఆయన కర్నూలులో స్థిరపడ్డారు. వార్డు మాజీ సభ్యులు వై.పి.బాబు, పెద్ద ఈరన్న, మరో వ్యక్తి ఆ భూమిపై కన్నేశారు.  రెండు వారాల కిందట స్థల యజమాని భీమయ్య పేరుతో గల మరో వ్యక్తితో పరిచయం పెంచుకున్నారు. సర్వే నంబర్‌ 400–ఎఫ్‌లో ఉన్న స్థలం యజమాని పేరుతో ఉన్న మరో వ్యక్తి(ఎ.భీమయ్య)ని రంగంలోకి దింపారు. నకిలీ భీమయ్యకు కొంత డబ్బు ముట్టజెప్పారు. అతని ఆధార్‌ కార్డు సహాయంతో రెండు వారాల కిందట సదరు స్థలాన్ని గుత్తికి చెందిన ఇమ్మానుయేల్‌ రాజుకు ప్లాట్లు వేసి సెంటు రూ.లక్ష ప్రకారం అమ్మేశారు. స్థలం కొనుగోలు చేసిన ఇమ్మానుయేల్‌ రాజు దాన్ని పట్టణానికి చెందిన మరో తొమ్మిది మందికి విక్రయించారు.  

డాక్యుమెంట్‌ రైటర్‌ సమాచారంతో... 
అయితే అసలు యజమాని ఎ.భీమయ్యకు తన స్థలాన్ని ఆక్రమించి దొంగ రిజిస్ట్రేషన్‌ ద్వారా కాజేసిన విషయాన్ని ఒక డాక్యుమెంట్‌ రైటర్‌ ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో డొంకంతా కదిలింది. వెంటనే భీమయ్య హుటాహుటిన గుత్తికి చేరుకున్నారు. 

తాడిపత్రి డీఎస్పీకి ఫిర్యాదు 
స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తారో, లేదోనని భావించిన బాధితుడు తాడిపత్రికి వెళ్లి అక్కడ డీఎస్పీ చిదానందరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు గుత్తి సీఐ మ«ధుసూదన్‌గౌడ్, ఎస్‌ఐ–2 రామాంజనేయులు రంగంలోకి దిగి విచారణ చేశారు. విచారణలో వార్డు మాజీ సభ్యులు వై.పి.బాబు, పెద్ద ఈరన్న, నకిలీ వ్యక్తి ఎ.భీమయ్య స్థలాన్ని కొట్టేసి దొంగ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు తేలింది. దీంతో పోలీసులు ఇమ్మానుయేల్‌ రాజు, పెద్ద ఈరన్నను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతంలో కీలకంగా మారిన వై.పి.బాబు, మరో వ్యక్తి ఊరొదిలి పారిపోయారు. వారి ఆచూకీ  కోసం పోలీసులు వేట ప్రారంభించారు.

ఇక్కడ మరో ట్విస్టు ఏమిటంటే  ఇమ్మానుయేల్‌ రాజు కూడా కుట్రలో భాగమేనని తెలిసింది. వై.పి.బాబు, పెద్ద ఈరన్న, ఇమ్మానుయేల్‌ రాజు సదరు స్థలాన్ని దొంగ రిజిస్ట్రేషన్‌తో కాజేసి ఎవరికి అనుమానం రాకుండా ఆ స్థలాన్ని మొదట ఇమ్మానుయేల్‌ రాజుకు విక్రయించారు. అతని ద్వారా ప్లాట్లుగా వేసి తిరిగి మరో తొమ్మిది మందికి విక్రయించి రిజిస్ట్రేషన్‌ చేయించారు. జరిగిందంతా వాస్తవమేనని ఎస్‌ఐ–2 రామాంజనేయులు అన్నారు. వివరాలన్నీ త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement