వివరాలు వెల్లడిస్తున్న తాడిపత్రి డీఎస్పీ చైతన్య
సాక్షి, అనంతపురం: విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న అశోక్ హత్యకేసులో మిస్టరీని గుత్తి పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యనే హతమార్చినట్లుగా తేల్చారు. వివరాలను గుత్తి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాడిపత్రి డీఎస్పీ చైతన్య, గుత్తి ఇన్‌చార్జ్ సీఐ రామకృష్ణ వెల్లడించారు. పెద్దవడుగూరులో అసిస్టెంట్ లైన్‌మన్‌గా పనిచేస్తున్న చెట్నేపల్లికి చెందిన అశోక్ ఈ ఏడాది ఏప్రిల్ 12న చెట్నేపల్లి సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద నీటి కుంటలో పడి మృతి చెందాడు.
తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత హత్యగా నిర్ధారణ కావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగింది. ఈ క్రమంలోనే అశోక్ భార్య కవిత ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. బసినేపల్లి నివాసి హరికృష్ణతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న కవిత.. తమ అనుబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చేందుకు ప్రియుడితో కలిసి పథకం రచించింది.
చదవండి: (పెళ్లి చేసుకుందామని అడిగితే.. కడుపు మీద తన్నడంతో..)
ఏప్రిల్ 12న చెట్నేపల్లి సమీపంలోని రైల్వే బ్రిడ్జి కుంట వద్ద ఒంటరిగా అశోక్ మద్యం సేవిస్తున్నట్లుగా తెలుసుకుని కవిత, హరికృష్ణ అక్కడకు చేరుకున్నారు. మాటల్లో అశోక్ చేత ఫుల్‌గా మద్యం తాగించి అనంతరం కుంటలోకి వేసి తొక్కి హతమార్చారు. అనంతరం మద్యం మత్తులో కుంటలో పడి తన భర్త మృతి చెందాడంటూ పోలీసులకు కవిత ఫిర్యాదు చేసింది. లోతైన దర్యాప్తుతో ఈ కేసులోని మిస్టరీని ఛేదించి, నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సిబ్బందిని డీఎస్పీ చైతన్య అభినందించారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment