♦ వంద కేంద్రాల్లో నిండుకున్న బియ్యం నిల్వలు
♦ గుడ్డుతో సరిపెడుతున్న టీచర్లు
♦ కొన్ని కేంద్రాల్లో గుడ్లూ లేవు అర్ధాకలితో అంగన్‌వాడీ పిల్లలు
రామాయంపేట: అంగన్‌వాడి కేంద్రాల్లో బియ్యం నిల్వలు నిండుకున్నాయి. దీంతో పిల్లలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. స్థానిక ఐసీడీఎస్ పరిధిలో రామాయపేట, చేగుంట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి మండలాలుండగా, వీటి పరిధిలో 280 అంగన్‌వాడి కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటికి ప్రతి నెలా చివరి వారానికల్లా బియ్యం బస్తాలు రావాల్సి ఉండగా, ఈసారి ఆర్వోలు రాకపోవడంతో ఇంకా బియ్యం మంజూరు కాలేదు. దీనితో 4 మండలాల పరిధిలోని వంద కేంద్రాల్లో భోజనం బందయ్యింది.
ఈ కేంద్రాల్లో గుడ్లు మాత్రమే ఇచ్చి పిల్లలను ఇళ్లకు పంపారు. గ్రామాల్లో నమోదైన గ ర్భిణిలు, బాలింతలకు సైతం గుడ్లు, పాలు మాత్రమే ఇస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో మాత్రం టీచర్లు తమ ఇళ్ల నుంచి బియ్యం తెచ్చి పిల్లలకు వండి పెట్టారు. ఇటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో ఎదురు కాలేదని టీచర్లు అంటున్నారు. కాగా ఈ మండలాల పరిధిలోని కొన్ని కేంద్రాల్లో గుడ్ల స్టాకు కూడా లేకుండాపోయింది.
పరిస్థితి చక్కదిద్దుతాం
ప్రాజెక్టు పరిధిలోని 4 మండలాల్లోని 70 అంగన్‌వాడి కేంద్రాల్లో బియ్యం నిల్వలు లేవు. బియ్యం మంజూరుకు సంబంధించి ఈసారి ఆర్వో రిలీజ్ కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది.