- మధ్యాహ్న భోజన కుకింగ్ చార్జీలు స్వల్పంగా పెంపు
- పెరిగిన ధరలు రూపాయల్లో.. పెంపు పైసల్లో
- ప్రాథమిక స్థాయిలో 27 పైసలు..
- ఆపై తరగతులకు 40 పైసలు పెంపు
అరకొర వడ్డింపు
Published Fri, Oct 21 2016 11:02 PM | Last Updated on Thu, May 24 2018 1:29 PM
రాయవరం:
మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో నంబరు 260 ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన చెల్లింపులు ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి అమల్లోనికి రానున్నాయి. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరగడం, వారానికి మూడు గుడ్లు వేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏజెన్సీలకు ఈ పెంపు ఏపాటి అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు పౌష్టికాహారం సమగ్రంగా, సమర్ధవంతంగా అందించాలంటే ఈ పెంపు చాలదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.
పెరిగిన ధరలు రూపాయల్లో..
ఇటీవల కాలంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏ కాయగూర కొందామన్నా కేజీ రూ.20ల పైబడి ఉంది. మధ్యాహ్న భోజన పథకంలో గత నెల వరకు వారానికి రెండు కోడి గుడ్లను విద్యార్థులకు అందించాల్సి ఉం ది. ఈ నెల నుంచి వా రానికి మూడు గుడ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. రిటైల్ మార్కెట్‌లో కోడిగుడ్డు ధర ప్రస్తుతం రూ.4.50 నుంచి రూ.5గా ఉంది. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు రూపాయల్లో పెరుగుతుంటే పెంపు పైసల్లో చేయడంపై మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
జిల్లాలో పరిస్థితి ఇదీ...
జిల్లాలో 4,309 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది. ఈ పాఠశాలల్లో 4,064 ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు జిల్లాలో పని చేస్తున్నాయి. కుక్ కమ్ హెల్పర్స్ 8,717 మంది ఉన్నారు. 3,316 ప్రాథమిక, 404 ప్రాథమికోన్నత, 589 ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది. ప్రాథమిక పాఠశాలల్లో ఒక లక్ష 89 వేల 463 మంది విద్యార్థులుండగా, ఒక లక్ష 50 వేల 849 మంది విద్యార్థులు గత నెల మధ్యాహ్న భోజనం తీసుకున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,34,174 మంది విద్యార్థులుండగా గత నెల 88,746 మంది (66 శాతం) మధ్యాహ్న భోజనం చేశారు. ఉన్నత పాఠశాలల్లో 87,177 మంది ఉండగా గత నెలలో 52,487(60శాతం) మంది మధ్యాహ్న భోజనం గత నెలలో తీసుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 100గ్రాములు, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 150 గ్రాముల బియాన్ని అందజేస్తారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి ఇప్పటి వరకు రూ.4.86లు చెల్లిస్తుండగా కేవలం 27 పైసలు పెంచారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల స్థాయిలో ఇప్పటి వరకు రూ. 6.78 చెల్లిస్తుండగా తాజాగా కేవలం 40 పైసలు మాత్రమే పెంచారు. జిల్లాలో అత్యధిక పాఠశాలల్లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వండి వడ్డిస్తుండగా, కొన్ని మండలాల్లో ట్రస్ట్‌లు తయారు చేసి సరఫరా చేస్తున్నాయి. అనపర్తి మండలం పొలమూరులో బుద్దవరపు ఛారిటబుల్ ట్రస్ట్, రాజమండ్రిలో ఇస్కాన్, పెద్దాపురంలో గ్రాస్ సంస్థ, తునిలో అల్లూరి సీతారామరాజు ఎడ్యుకేషనల్ సొసైటీలు విద్యార్థులకు ఆహారాన్ని అందజేస్తున్నాయి.
మధ్యాహ్న భోజన పథకంలో మెనూ వివరాలు..
సోమవారం – సాంబారు
మంగళవారం – కూర, రసం
బుధవారం – పప్పు, ఆకుకూర, గుడ్డు
గురువారం – సాంబారు
శుక్రవారం – కూర, రసం
శనివారం – పప్పు, కాయగూర, స్వీటు
నాలుగేళ్లుగా చెల్లింపుల వివరాలు..
విద్యా సంవత్సరం ప్రాథమిక ప్రాథమికోన్నత/స్థాయి ఉన్నత స్థాయి
2011–12లో రూ.3–84 రూ.4–40
2012–13లో రూ.4–00 రూ.4–65
2013–14లో రూ.4–35 రూ.6.00
2014–15లో రూ.4–60 రూ.6.38
2015–16లో రూ.4–86 రూ.6.78
2016–17లో రూ.5.13 రూ.7.18
Advertisement