పావని మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు
– శోకసముద్రంలో గల్లావారిపల్లి
కలికిరి :పాలవ్యాను దూసుకెళ్లడంతో బాలిక మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని అద్దవారిపల్లి పంచాయతీ గల్లావారిపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. గ్రామానికిచెందిన జి.రెడ్డెప్ప, రెడ్డిరమణ మ్మ దంపతుల కుమార్తె జి.పావని(12) మహల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. పాఠశాలకు ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి గ్రామ శివారులో రోడ్డు పక్కన ఆడుకునేందుకు వెళ్లింది. ప్రతిరోజూ గ్రామం నుంచి కలకడ మండలంలోని పోతువారిపల్లి సమీపంలోని ఓప్రైవేట్ డెయిరీకి పాలు తీసుకెల్తున్న పాలవ్యాను రివర్స్ తీసుకునే క్రమంలో బాలికపై దూసుకెళ్లింది. బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. స్నేహితుల కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకునేలోపు డ్రైవర్ పరారయ్యాడు.
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
అంతవరకూ ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరిగిన కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రెడ్డెప్ప, రెడ్డిరమణమ్మ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఎన్నో వ్రతాలు, పూజలు చేసిన తర్వాత పావని పుట్టింది. ఈ క్రమంలో వ్యానురూపంలో వచ్చిన మృత్యువు కబళించడంతో వారు బోరున విలపించారు. హెడ్‌కానిస్టేబుల్ రాజారాంరెడ్డి అక్కడికి చేరుకుని బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పాలవ్యాన్ డ్రైవర్ కలకడ మండలం కోన పంచాయతీ గొల్లపల్లికి చెందిన శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.