అయ్యన్నకు శాఖా చలనం
►గంటా సీటు పదిలం
►లోకేష్ కోసం పంచాయతీరాజ్‌ను త్యాగం చేసిన అయ్యన్న
►ఆయనకు తాజాగా రోడ్లు, భవనాల అప్పగింత
►ఆరోపణలను అడ్డుకున్న సమీకరణలు అందువల్లే మార్పు నుంచి తప్పించుకున్న విద్యామంత్రి
విశాఖపట్నం :రాష్ట్ర మంత్రివర్గ పునరవ్యవస్థీకరణలో తమ పదవులను కాపాడుకోగలిగిన జిల్లా మంత్రులిద్దరిలో ఒకరికి మాత్రమే శాఖామార్పు జరిగింది. ముఖ్యంగా మంత్రి గంటా శ్రీనివాసరావును వేరే శాఖకు మార్చవచ్చని విస్తృత ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా ఆయన్ను శాఖలో కొనసాగనిస్తూ.. మరో సీనియర్ మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడుకు మాత్రం శాఖ మార్చారు. తాజా శాఖల కేటాయింపులో అయ్యన్నకు రోడ్డు, భవనాల శాఖ లభించింది. అయ్యన్న ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖను చిన్నబాబు లోకేష్‌కు కేటాయిస్తారని ముందునుంచీ ప్రచారం జరగడంతో అయ్యన్నకు స్థాన చలనం తప్పదని అందరూ భావించారు. చివరికి అదే జరిగింది. అయ్యన్న చేతిలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను లోకేష్‌కు కేటాయించారు.
గతంలో అయ్యన్న ప్రాతినిధ్యం వహించిన అటవీ, ఆర్ అండ్ బీ శాఖల్లో ఏదో ఒకటి కేటాయిస్తారని భావించగా.. ఊహించినట్టుగానే ఆర్ అండ్ బీ శాఖను కట్టబెట్టారు. ఇక శాఖమార్పు తథ్యమని భావించిన గంటా శ్రీనివాసరావుకు మాత్రం ఎలాంటి మార్పు చేయకుండానే పాత శాఖలోనే కొనసాగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం అందర్ని ఆశ్చర్యపర్చింది. టెన్త్, ఇంటర్ ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు వివిధ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గంటాను రాజకీయ సమీకరణల నేపథ్యంలో కేబినెట్ నుంచి తప్పించే సాహసం చేయలేని చంద్రబాబు కనీసం శాఖనైనా మారుస్తారంటూ బలంగా ప్రచారం జరిగింది. విద్యాశాఖలో తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ శాఖ నుంచి తప్పించి గతంలో తాను నిర్వహించిన ఓడ రేవులు, షిప్పింగ్‌ల శాఖ కేటాయించాలని గంటా సైతం ముఖ్యమంత్రిని కోరారు.
మరో వైపు మానవవనరుల శాఖలో భాగమైన ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలను తప్పించి ప్రాధమిక, మాధ్యమిక శాఖలకు పరిమితం చేస్తారని భావించారు. కానీ ఉహాగానాలకు తెర దించుతూ గంటాను ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలతో కూడిన మానవవనరుల శాఖలోనే కొనసాగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తమ నాయకుడికి శాఖ మార్చిన సీఎం.. గంటా శాఖను మార్చకపోవడంపై అయ్యన్న వర్గీయులు కొంత అసంతృప్తికి గురైనట్టు సమాచారం.