
బీజేపీ vs టీడీపీ...ఓ మొక్క కేసు
తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో ఇరుగు పొరుగు వారిమధ్య చోటుచేసుకున్న వివాదంలో ....
► కేసు విషయంలో మంత్రి పైడికొండల జోక్యం !
► ఆయన మాట వినొద్దంటున్న టీడీపీ నేతలు
► ఇరకాటంలో ‘గూడెం’ ఖాకీలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో ఇరుగు పొరుగు వారిమధ్య చోటుచేసుకున్న వివాదంలో నిందితుల తరఫున దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వకాల్తా పుచ్చుకోవడం వివాదాస్పదమవుతోంది. నిందితులపై కేసు కట్టకుండా వదిలేయాలంటూ ఆయన ఒత్తిడి తేవడం, పదేపదే ఆ కేసులో జోక్యం చేసుకోవడం పోలీసు అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. ఇదే సందర్భంలో మంత్రి మాణిక్యాలరావుతో పొసగని తెలుగుదేశం పార్టీ నేతలు రంగంలోకి దిగి.. ‘ఏం ఫరవాలేదు. ఆయన చెప్పినట్టు వినకున్నా మేం చూసుకుంటాం’ అంటూ పోలీసులకు భరోసా ఇవ్వడం ఖాకీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన పుల్లా శ్రీనివాస్ భార్య వెంకట సత్యవతి, ముగ్గురు కుమారులతో కలిసి వ్యవ సాయం చేసుకుంటున్నారు. ఈనెల 7న అదే గ్రామానికి చెందిన తమ్మాబత్తుల ధనరాజు, తమ్మాబత్తుల నాగేశ్వరరావు ఎవరూ లేని సమయం చూసి శ్రీనివాస్ ఇంటి ముందున్న ఓ మొక్కను పీకివేశారు. సాయంత్రం పొలం నుంచి తిరిగి వచ్చిన వెంకట సత్యవతి ఈ విషయం తెలుసుకుని ధనరాజు, నాగేశ్వరరావులను ప్రశ్నించింది.
ఇందుకు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆ మొక్కను పీకేశాం. నీ దిక్కున్న చోట చెప్పుకో’ అని దుర్భాషలాడారు. ఆమెపై దౌర్జన్యానికి దిగారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ భార్య ద్వారా విషయం తెలుసుకుని వాళ్లను అడిగేందుకు వెళ్లగా, అతనిపైనా దాడి చేశారు. శ్రీనివాస్‌కు గాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకుని గూడెం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వి.చంద్రశేఖర్ ఐపీసీ 324, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడి నుంచి పోలీసులపై మంత్రి మాణిక్యాలరావు ఒత్తిళ్లు మొదలయ్యాయి. తమ్మాబత్తుల ధనరాజు, నాగేశ్వరరావుపై కేసుల్లేకుండా చూడాలని ఆదేశించారు. అదే సందర్భంలో ధనరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుల్లా శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని సమాచారం.
ఆధారాలున్నాయని చెబుతున్నా...
ఆ కేసులో ధనరాజు, నాగేశ్వరరావు దౌర్జన్యం చేసినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, పుల్లా శ్రీనివాస్ దాడి చేసినట్టు ఆధారాల్లేవని పోలీసులు మొత్తుకుంటున్నా మంత్రి మాత్రం వారిద్దరిపై కేసులు తొలగించాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. పుల్లా శ్రీనివాస్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఓ దశలో ‘నేను చెప్పింది చేస్తావా.. చెయ్యవా.. లేదంటే చెప్పండి. ఎస్పీ, డీఐజీలతో మాట్లాడతా’ అని మంత్రి హెచ్చరించడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక ఖాకీలు తల్లడిల్లిపోతున్నారట. ఇటీవల కాల్‌మనీ కేసులో నిందితుడిగా వార్తల్లోకి ఎక్కిన చేడూరి విశ్వేశ్వరరావు బావమరిది ధనరాజుపై కేసుల్లేకుండా చూడటం కోసం స్వయంగా మంత్రి రంగంలోకి దిగడం చర్చనీయాంశమవుతోంది.
మంత్రికి వ్యతిరేకంగా రంగంలోకి టీడీపీ నేతలు
‘మంత్రి మాణిక్యాలరావు చెప్పినట్టు వినకండి. మీరేం చేయాలో అదే చేయండి. మీకేం కాకుండా మేం చేసుకుంటాం’ అంటూ టీడీపీ నేతలు పోలీసుల తరఫున మాట్లాడుతున్నట్టు సమాచారం. పోలీసులపై ప్రేమ కంటే మాణిక్యాలరావుతో ఉన్న వర్గపోరు నేపథ్యంలో టీడీపీ నేతలు ఖాకీలకు మద్దతు ప్రకటిస్తున్నారనేది బహిరంగ ర హస్యం. ఈ విషయమై టీడీపీ నేతలు తమతో మాట్లాడుతున్నారని తెలిస్తే మాణిక్యాలరావుకు కోపం తారస్థాయికి చేరుతుందని పోలీసు వర్గాలు భయపడిపోతున్నాయి. మొత్తంగా అటు మాణిక్యాలరావు ఒత్తిళ్లు.. ఇటు టీడీపీ నేతల ‘కోరుకోని’ మద్దతు మధ్య నలిగిపోతున్న పోలీసులు చివరకు ఆ కేసు విచారణలో ఎలా వ్యవహరిస్తారో చూడాల్సిందే.