ఇదేంది పల్లె సారూ! | minister palle speech in voter awareness programme | Sakshi
Sakshi News home page

ఇదేంది పల్లె సారూ!

Published Sun, Oct 23 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

ఇదేంది పల్లె సారూ!

ఇదేంది పల్లె సారూ!

– ఎమ్మెల్సీ ఓటు నమోదుపై జూనియర్‌ కళాశాలలో అవగాహన సదస్సు
– ముఖ్య అతిథిగా హాజరై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పల్లె
– తాము సూచించే అభ్యర్థికి సహకరించాలని హుకుం!


ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతాయి. అభ్యర్థులకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు మాత్రమే ఇస్తాయి. ఇందులో పార్టీ గుర్తులేమీ ఉండవు. ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి ఎవరికి ఓటు వేయాలని చెప్పకూడదు. ఈ విషయాలన్నీ మన మంత్రి పల్లె రఘునాథరెడ్డికి తెలియనివి కావు. కానీ అధికారంలో ఉన్నాం.. ఏమైనా చేస్తాం అన్న ధోరణిలో ఆయన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఆదివారం అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై నిర్వహించిన అవగాహన సదస్సు ఇందుకు వేదికైంది.

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదుపై ఉపాధ్యాయులకు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ‘నవంబర్‌ 5 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అందరూ ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకోవాలి. ప్రభుత్వం కూడా మంచి అభ్యర్థిని పెడుతుంది. సహకరించండి’ అని చెప్పడంతో బిత్తెరపోవడం ఉపాధ్యాయుల వంతైంది. ఈయన ప్రభుత్వంలోని మంత్రి హోదాలో వచ్చారా.. లేక పార్టీలో నాయకుడిగా వచ్చారా అని గుసగుసలాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం కూడా అభ్యర్థిని బరిలోకి దించవచ్చా? అని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు.

మంత్రి అంతటితో ఆగకుండా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని, వాటన్నింటినీ దష్టిలో పెట్టుకుని తాము సూచించిన వారికి.. ప్రభుత్వానికి సహకరించాలని హుకుం జారీ చేశారు. ఎంఈఓలు కీలకంగా వ్యవహరించి ఓటరు నమోదుకు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పనితీరుపై విసుగు తెప్పించే ప్రసంగం చేశారు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓటు నమోదుపై అవగాహన కోసం వస్తే ‘ఇదేంది పల్లె సారూ’ అంటూ చర్చించుకున్నారు. అంతకుముందు∙ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ నేతలు మంత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్ల రెగ్యులరైజ్‌ కోసం రెండేళ్ల క్రితం సబ్‌ కమిటీ వేసినా ఇంత వరకు అతీగతీ లేదంటూ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు యర్రప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, జోనల్‌ అధ్యక్షుడు అల్తాఫ్‌ తదితరులు మంత్రిని నిలదీశారు.

తక్షణం పీఆర్సీ అమలు చేయాలని, ఐదు నెలల జీతాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.  సమస్య పరిష్కరించేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి ప్రసంగానికి ముందు డీఈఓ అంజయ్య, ఎస్‌ఎస్‌ఏ పీఓ దశరథనామయ్య, ఆర్‌ఐఓ వెంకటేశ్వర్లు, డీవీఈఓ వెంకటరమణ తదితరులు ఓటు నమోదు ప్రక్రియ ఎలా చేపట్టాలో వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓలు లక్ష్మీనారాయణ, సుబ్బారావు, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement