మంత్రి పీతల సుజాత పరిస్థితి ఇది
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తనదైన ముద్ర లేదు.. జిల్లా అధికారులపై పట్టులేదు.. అభివృద్ధి పనులను ముందుకు ఉరికించింది లేదు.. పార్టీని ఏకతాటి పైకి తెచ్చిందీ లేదు. జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఏకైక మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పీతల సుజాత పరిస్థితి ఇది. స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా జిల్లాపై ఆమె తనదైన ముద్ర వేయలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జిల్లా నుంచి కేబినెట్‌లో అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక మంత్రిగా పీతల సుజాత రికార్డు సృష్టించారు.
అయితే, అటు పార్టీలోను, ఇటు జిల్లా యంత్రాంగంలోనూ అమెకు సరైన పట్టు దక్కడం లేదు. ఈ కారణంగా.. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దిక్కు లేకుండాపోయింది. ఎమ్మెల్యేల మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఎవరి దందా వారిదే అన్నట్టుగా సాగుతోంది. కీలక ప్రాజెక్ట్‌లు సాధించే విషయమై ప్రజాప్రతినిధులంతా రెండేళ్లలో ఒక్కసారి కూడా ఐక్యంగా ముఖ్యమంత్రిని కలిసిన పాపాన పోలేదు.
అన్ని సీట్లూ కట్టబెట్టిన జిల్లానుంచి..
2014 ఎన్నికల్లో జిల్లాలోని 15 అసెంబ్లీ, మూడు పార్లమెం టరీ నియోజకవర్గాల్లో టీడీపీ, దాని మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థులే గెలుపొందారు. ఇంత ముఖ్యమైన జిల్లా నుంచి కేబినెట్‌లో స్థానం దక్కించుకున్న పీతల సుజాతకు స్త్రీ, శిశు సంక్షేమంతోపాటు కీలకమైన గనుల శాఖ కూడా దక్కింది. ఎస్సీ కోటాలో అమాత్య పదవి పొంది రెండేళ్లవుతున్నా జిల్లా అభివృద్ధిపై ఆమె కనీస దృష్టి కూడా పెట్టలేకపోయారు. దేశంలోనే అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు డెల్టా ఆధునికీకరణ, చింతల పూడి ఎత్తిపోతల పథకం, కొల్లేరు కాంటూర్ కుదింపు వంటి ఏన్నో కీలక సమస్యలు ఉన్నాయి.
ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసేందుకు పీతల సుజాత జిల్లా అధికారులతో ఒక్కసారైనా సమీక్షించింది లేదు. మరోవైపు గనుల శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నా జిల్లాలో ఇసుక దోపిడీని నిలువరించలేకపోయారు. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలే ఇసుక దందాకు పాల్పడుతూ రూ.కోట్లు కొల్లగొట్టడం వంటి పరిస్థితులో సొంత జిల్లాలో అమెకు గనుల శాఖపై పట్టులేకుండా చేశాయి. చివరకు ఈ ఇసుక విధానమే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది.
నియోజకవర్గంలోనూ పట్టులేదు
ఉపాధ్యాయినిగా పనిచేసిన పీతల సుజాత 2004లో ఆచంట సీటు దక్కించుకుని మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2009లో టిక్కెట్ దక్కకపోయినా నిరాశ చెందకుండా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. 2014 ఎన్నికల్లో ఆచంట సిట్టింగ్ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి సీటు దక్కించుకోవడంతో అమెకు చింతలపూడి (ఎస్సీ రిజర్వుడ్) స్థానం కేటాయించారు.
దీంతో ఎన్నికల ముందు ఆమె స్థానికతపై చింతలపూడిలో వ్యతిరేకత వ్యక్తమైనా అనూహ్యంగా గెలుపొంది మంత్రి కాగలిగారు. చివరకు నియోజకవర్గంలోనూ సుజాతకు పట్టు లేకుండా పోయింది. చింతలపూడిలో గ్రూపు రాజకీయాలు ఆమెకు శిరోభారంగా మారాయి. గతంలో మండల టీడీపీ అధ్యక్ష పదవి కోసం అక్కడి నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి రోడ్డెక్కి ధర్నాలు చేశారు. గత ఏడాది పలు వివాదాలు అమెను చుట్టుముట్టాయి.
మంత్రి ఇంటి ఆవరణలో బ్యాగ్‌లో నోట్ల కట్టలు దొరకడం దుమారం రేపింది. పోలీసుల దర్యాప్తులో క్లీన్‌చిట్ రావడంతో ఆ వివాదం నుంచి బయటపడినా.. వెంటనే విజయవాడలో ఏసీబీకి దొరికిన ఒక అధికారిణి మంత్రి సుజాత ఖర్చుల కోసం తాను ముడుపులు తీసుకున్నానంటూ ఇచ్చిన స్టేట్‌మెంట్ మరో వివాదాన్ని రగిల్చింది. మొత్తానికి వివాదాల నుంచి బయటపడినా ఒక ఎంపీ, ఎమ్మెల్యేతో ఏర్పడిన వివాదం జిల్లాలో టీడీపీని ఏకతాటిపై నడపటంలో సుజాతను విఫల మయ్యేలా చేసింది. ఇటీవల పలు ప్రారంభోత్సవాల్లో సైతం అమెకు ప్రొటోకాల్ ఇవ్వకపోవడం జిల్లాలో అమె పరిస్థితిని తెలియజేస్తోంది.
ఈ వ్యవహారాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినా అటు అధికార యంత్రాంగంలోనూ, కొందరి నేతల తీరులోనూ మార్పు రాలేదు. మరోవైపు జిల్లా ఎమ్మెల్యేలంతా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. వారందరినీ కలుపుకుని వెళ్లలేకపోవడం, అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహించకపోవడం అమెకు మైనస్‌గా మారాయి. అయితే అంతర్గతంగా నిర్వహించిన పార్టీ సర్వేలో మంత్రిగా పనితీరులో పీతల సుజాత మొదటి స్థానం దక్కించుకున్నారు. ఇందుకు ప్రామాణికాలు ఏమిటనే విషయాన్ని పక్కన పెడితే.. రాష్ట్రంలో నంబర్-1 మంత్రి అనేది ఒక్కటే అమెకు ఊరటనిచ్చే అంశం.