
మైనర్ బాబులూ జాగ్రత్త..!
డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలే.. ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్
గన్‌ఫౌండ్రీ: మైనర్లు వాహన డ్రైవింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నగర ట్రాఫిక్ డీసీపీ ఎ.వి. రంగనాథ్ హెచ్చరించారు. తాను అధికారిగా కాకుండా ఒక తండ్రిగా తన మైనర్ కుమారుడికి వాహనం ఇవ్వనని వాగ్దానం తీసుకున్నానన్నారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులకు శనివారం గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (టీటీఐ)లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీసీపీ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండని బాలలు వాహనం నడిపితే తల్లిదండ్రులదే బాధ్యత అని హెచ్చరించారు. డ్రైవింగ్ లెసైన్స్ లేని వ్యక్తికి వాహనం అప్పగించడం, వయసు నిండని పిల్లలకు వాహనం ఇచ్చినా తల్లిదండ్రులపై సైతం కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే చలాన్ రాసే సమయంలో సదరు వ్యక్తి ఆధార్ నెంబర్, తాను తాగిన బార్ అండ్ రెస్టారెంట్ పేరును సైతం నమోదు చేస్తామని తెలిపారు.
ఎక్కువసార్లు డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి ఏ బార్‌లో తాగాడో విచారించి ఎక్కువసార్లు ఆ బార్ పేరు నమోదైతే ఆ బార్ లెసైన్స్‌ను సైతం రద్దు చేసేలా ఎక్సైజ్ శాఖకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. అనంతరం నేటి నుంచి తమ మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వబోమని ఈ కౌన్సిలింగ్‌కు హాజరైన తల్లిదండ్రులతో వాగ్దానం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీలు జైపాల్, భద్రేశ్వర్, టీటీఐ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు హరీష్, నరహరి, కె. శ్రీనివాస్, రవి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.