అనుబంధాన్ని కలిపిన ‘తెలుగు’బంధం | miryalaguda village mentally handicapped woman find in goa vasco da gama | Sakshi
Sakshi News home page

అనుబంధాన్ని కలిపిన ‘తెలుగు’బంధం

Published Wed, Sep 14 2016 2:44 AM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM

అనుబంధాన్ని కలిపిన ‘తెలుగు’బంధం - Sakshi

అనుబంధాన్ని కలిపిన ‘తెలుగు’బంధం

మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన సుబ్బాయమ్మ
గోవాలోని వాస్కోడిగామాకు చేరిన మిర్యాలగూడ మహిళ

మిర్యాలగూడ: తెలుగు భాషా బంధం ఓ కుటుంబ అనుబంధాన్ని కలిపింది. మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ మహిళ.. 24 రోజుల తర్వాత ‘సాక్షి’ చొరవతో తమ కుటుంబాన్ని కలవబోతోంది. తమ తల్లి గోవాలో ఉందని తెలిసిన వెంటనే పిల్లలు ఆనందంలో మునిగిపోయారు.  మిర్యాలగూడ సంతోష్‌నగర్‌కు చెందిన యనమల శ్రీనివాస్, సుబ్బాయమ్మ దంపతులు. వీరి పిల్లలు నందిని, జ్యోతి, మణికంఠ. మతిస్థిమితం లేక సుబ్బాయమ్మ గత నెల 20న ఇంటి నుంచి వెళ్లిపోయింది. సమీపంలోని మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కి గోవా రాష్ట్రంలోని వాస్కోడిగామాలో దిగింది. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో స్థానికులు ఆమెను వాస్కోడిగామా పట్టణ మానసిక రోగుల ఆస్పత్రిలో చేర్చారు.

ఆస్పత్రిలో ఉన్న సుబ్బాయమ్మకు తెలివి వచ్చి పది రోజులు అవుతోంది. తన విషయం చెప్పడానికి ఈ ఆస్పత్రిలో ఉన్న వారితో మాట్లాడేందుకు భాష తెలియడం లేదు. తమ బిడ్డలు గుర్తుకు వచ్చిన సుబ్బాయమ్మ కంటనీరు పెడు తోంది. ఆస్పత్రి సర్వెంట్  తెలుగు మహిళ ధనమ్మ  గోవాలో పని చేస్తున్న తెలుగువారైన డిఫెన్స్ సిబ్బంది వెంకటాద్రి, నాగరాజులకు విషయాన్ని తెలిపింది. సుబ్బాయమ్మను మిర్యాలగూడకు చేర్చాలని భావించిన వెంకటాద్రి ఖమ్మం జిల్లా మణుగూరులోని తన బంధువు కె.వి. నారాయణకు సమాచారం ఇచ్చారు. దాంతో నారాయణ ‘సాక్షి’కి సమాచారం ఇచ్చారు. కాగా సాక్షి విలేకరి మిర్యాలగూడలోని సుబ్బాయమ్మ ఇంటికి వెళ్లి ఆమె భర్త శ్రీనివాస్‌కు, పిల్లలకు సమాచారం ఇవ్వడంతో కథ సుఖాంతమైంది.

సొంతింటికి చేర్చాలనుకున్నాం
సుబ్బాయమ్మ వాస్కోడిగామలోని మానసిక ఆస్పత్రిలో ఉంది. తెలివి రావడం వల్ల ధనమ్మకు ఇచ్చిన సమాచారం మేరకు ఆమెను మిర్యాలగూడకు పంపాలని తీవ్ర ప్రయత్నం చేశాము. ఆమె బిడ్డల కోసం పడుతున్న వేదన చూసి చలించిపోయాము. చివరికి ఆమెను సొంత గ్రామానికి పంపుతున్నామని సంతృప్తిగా ఉంది.  - వెంకటాద్రి, డిఫెన్స్ సిబ్బంది, గోవా

‘సాక్షి’ కి సమాచారం ఇచ్చాను
మిర్యాలగూడ మహిళ సుబ్బాయమ్మ మతి స్థిమితం లేక గోవాకు చేరిందని తెలిసింది. దాంతో ‘సాక్షి’కి విషయం చెప్పాను. సుబ్బాయమ్మ సమాచారం తెలిపి ఒక కుటుంబాన్ని కలపడం ఆనందంగా ఉంది.      - కేవీ. నారాయణ, ఖమ్మం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement