ఏసీబీ కస్టడీకి ఎమ్మెల్యే సండ్ర
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు గురువారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. సండ్రను ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. దాంతో చర్లపల్లి జైలు నుంచి సండ్రను అధికారులు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆయనను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. కస్టడీ అనంతరం సండ్రను అధికారులు కోర్టులో హాజరు పరచనున్నారు. మరోవైపు ఎమ్మెల్యే సండ్ర బెయిల్ పిటిషన్తో పాటు, ఏసీబీ కౌంటర్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది.
ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. సండ్రను రెండురోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అప్పగించడంతో అధికారులు తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసినా .. వాటిని భేఖాతరు చేసి తప్పించుకుని తిరుగుతున్న తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబుపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు స్పెషల్ టీంను రంగంలోకి దింపారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా జిమ్మిబాబను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు రాబట్టవచ్చని ఏసీబీ భావిస్తోంది. కేసులో A-4 నిందితుడు మత్తయ్య మాదిరిగా జిమ్మిబాబు కూడా ఏపీలో ఆశ్రయం పొందుతున్నట్లు ఏసీబీ అనుమానిస్తుంది.