ఎమ్మెల్సీ ఎన్నికకు నేడే నోటిఫికేషన్
టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాధవ్
మేయర్ పీఠంపై కుదిరిన ఒప్పందం
ఇతరులు గెలిస్తే వారికి గాలం వేసేలా టీడీపీ ప్రణాళిక
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. ఎమ్మెల్సీ స్థానం బీజేపీకి, త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ స్థానం టీడీపీకి ఇచ్చిపుచ్చుకునేందుకు ఇరు పార్టీల అగ్రనేతల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.వి.చలపతిరావు తనయుడు మాధవ్‌ను ఉమ్మడి అభ్యర్థిగా ఆదివారం ప్రకటించారు. సీపీఎం బలపర్చిన అభ్యర్థిగా ఎ.అజశర్మ (సీఐటీయూ రాష్ట్ర నాయకుడు), కాంగ్రెస్ అభ్యర్థిగా యడ్ల ఆదిరాజు, స్వతంత్ర అభ్యర్థిగా సీనియర్ పాత్రికేయుడు వి.వి.రమణమూర్తి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రెండు విడతల ప్రచారాన్ని పూర్తి చేశారు. మరికొంతమంది స్వతంత్రులు తమ పరిధిలో ఓటర్లను కలిసి మద్దతు కోరుతున్నారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. వచ్చే నెల 9న ఎన్నిక జరగనుంది. ఇంత తక్కువ సమయంలో టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి మాధవ్ మూడు జిల్లాల్లో పర్యటించి ఓటర్లను కలిసి ఎంతవరకు మద్దతు కూడగడతారో ఫలితాలు తరువాత తెలుస్తోంది.
తర్జనభర్జనల మధ్య..
బీజేపీకి ఎమ్మెల్సీ స్థానాన్ని అప్పగించాలని నిర్ణయించినప్పటి నుంచీ అభ్యర్థిగా ఎవరు ఉండాలనేదానిపై తర్జన భర్జనలు మొదలయ్యాయి. పోటీకి తాను సిద్ధమని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పీవీ చలపతిరావు తనయుడు మాధవ్ ముందుకు వచ్చారు. ఆయనతో పాటే ఆ పార్టీ నాయకులు రామకోటయ్య, పృధ్వీరాజ్‌లు బరిలోకి దిగారు. ఈ ముగ్గురిలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే దానిపై బీజేపీ, టీడీపీ నేతలు తీవ్రంగా చర్చించారు. నిజానికి మాధవ్‌ను బీజేపీ ఎంపీతో పాటు ఎమ్మెల్యే కూడా వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరిగింది. వారు రామకోటయ్య వైపే మొగ్గుచూపుతున్నారని, విషయం తెలుసుకున్న మాధవ్ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నుంచి టీడీపీపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు వార్తలు వినిపించాయి. స్వయంగా ఎంపీ వ్యతిరేకిస్తుంటే కేంద్ర మంత్రి, అందునా తెలంగాణకు చెందిన నాయకుడి సిఫారసును టీడీపీ ఎంతవరకూ పరిగణలోకి తీసుకుంటుందనేది ప్రశ్నార్ధకంగా మారినప్పటికీ చివరికి మాధవ్‌కే టిక్కెట్ లభించింది.
ఎవరు గెలిచినా లాగేద్దాం ?
ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ వెలువడుతోంది. వారం రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులు ప్రచార రంగంలోకి దిగేశారు. సంబంధిత వర్గాలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి ఇప్పటి నుంచి ప్రచారం ప్రారంభించాలి. సమయం తక్కువగా ఉన్నందున అన్ని వర్గాలను కలిసే అవకాశం కూడా తక్కువే. ఇదిలా ఉండగా ఎన్నికల్లో తమ అభ్యర్థి కాకుండా ఇంకెవరైనా గెలిస్తే వారిని తమవైపు తిప్పుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఓ జాతీయ పార్టీ అభ్యర్థితో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
గత రెండుసార్లు సీపీఎం మద్దతుదారుడిదే గెలుపు
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీకి గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో సీపీఎం బలపరిచిన ఎం.వి.ఎస్.శర్శ గెలుపొందారు. మూడో సారి కూడా మళ్లీ గెలుపొంది ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని అందరిని కలుపుకొని ప్రచారం సాగిస్తోంది. పట్టభద్రులను కలిసి మద్దతు కోరుతోంది. అన్ని వర్గాలతో పరిచయాలు ఉండడంతో గెలుపుపై దీమాతో ఉంది.