కింకర్తవ్యం
కింకర్తవ్యం
Published Mon, Mar 6 2017 11:31 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
ఎమ్మెల్సీ ఆశావహులకు భంగపాటు
అసంతృప్తితో రగులుతున్న టీడీపీ సీనియర్ నేతలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
ఎమ్మెల్సీ పదవులు ఆశించిన టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రిక్తహస్తం చూపించారు. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలతోపాటు స్థానిక సంస్థల్లోనూ మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ విజయం కోసం అహరహం శ్రమించిన నాయకులకు చంద్రబాబు విలువ ఇవ్వకపోవడంతో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. బెదిరించిన అనంతపురం, ప్రకాశం జిల్లా నేతలకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించిన పార్టీ అధినేత అన్ని సీట్లూ కట్టబెట్టి అభిమానాన్ని, స్వామి భక్తిని చాటుకున్న పశ్చిమ గోదావరి జిల్లా నేతలను చిన్నచూపు చూడటంతో కార్యకర్తల్లో సైతం వ్యతిరేకత వ్యక్తమఽవుతోంది. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కనీసం నిలబెట్టుకోలేకపోవడంపై పార్టీ నేతలు మదనపడుతున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి రెండు ఎమ్మెల్సీ స్థానాలలో ఒకటి పాత వారికే ఇవ్వగా, రెండో సీటును క్షత్రియ సామాజిక వర్గానికి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ సీటు కోసం చాలామంది ఆశలు పెట్టుకున్నారు. అదనంగా తమకు ఎమ్మెల్యేల కోటాలో ఒక సీటు కేటాయిస్తారని ఆశావహులు భావించారు. అయితే చంద్రబాబు ఈ జిల్లాను పట్టించుకోలేదు. మహిళల కోటాలో తనకు సీటు లభిస్తుందని చివరివరకూ ఎదురుచూసిన ముళ్లపూడి రేణుకకు నిరాశే మిగిలింది. 2014లో ఇచ్చిన హామీ మేరకు తనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని భావించిన ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ పేరును అసలు పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు అవమానించారు. వైశ్య సామాజిక వర్గం అంతా సమావేశమై గట్టిగా డిమాండ్ చేసినా చంద్రబాబు ఖాతరు చేయకపోవడంపై ఆ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని వదులుకుని టీడీపీలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుకు, పొత్తు ధర్మంలో సీటును కోల్పోయిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, భీమవరానికి చెందిన సీనియర్ నేత మెంటే పార్థసారథికి నిరాశే మిగిలింది. ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చి తణుకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ దొమ్మేటి సుధాకర్‌ను ఆ పార్టీ మోసం చేయడంతో శెట్టి బలిజ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. వీరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. స్థానిక సంస్థల కోటాలో కాకపోయినా కనీసం ఎమ్మెల్యేల కోటాలో అయినా తమకు న్యాయం జరుగుతుందని ఎదురుచూసిన వారందరికి నిరాశే మిగలటంతో టీడీపీలో అసమ్మతి పెరుగుతోంది. ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
Advertisement