ప్రాణం తీసిన మొబైల్ చాటింగ్
ఫోన్‌లో చాటింగ్ చేస్తూ రైలు నుంచి జారిపడిన యువకుడు
యలమంచిలి: ఫోన్ చాటింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. రైలు ద్వారం వద్ద కూర్చోని మొబైల్‌లో చాటింగ్ చేస్తూ జారిపడిన హరీష్(21) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. తుని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ డి.రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తాండవ గ్రామానికి చెందిన వేగి హరీష్ కుమార్ విశాఖలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
స్వగ్రామానికి వెళ్లేందుకు సోమవారం రాత్రి విశాఖ నుంచి రైలులో బయలుదేరాడు. రాత్రి 7 గంటల తర్వాత ఇంటికి ఫోన్‌చేసి తాను వస్తున్నట్లు తల్లిదండ్రులకు తెలిపాడు. ఆ తర్వాత ఫోనులో చాటింగ్ చేస్తూ యలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో కొక్కిరాపల్లి రైల్వేగేటు వద్ద జారిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం పక్కనే యువకుడి మొబైల్ ఫోన్ తుని రైల్వే పోలీసులకు లభించింది. అతని వద్ద రైలు టిక్కెట్ దొరకకపోవడంతో ఏ రైలు నుంచి జారి పడ్డాడో తెలియలేదు.
ఘటనా స్థలానికి తుని జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ డి.రామకృష్ణ, సిబ్బంది చేరుకొని మృతదేహం వద్ద పడి ఉన్న సెల్‌ఫోన్‌లోని నెంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. మృతుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి యలమంచిలి చేరుకుని మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు.