
పీఆర్సీ కోసం దశలవారీ ఆందోళనలు
అనంతపురం అర్బన్ : మోడల్ స్కూల్ టీచర్లకు తక్షణమే పీఆర్సీని వర్తింపజేయాలని, లేకుంటే దశలవారీ కార్యక్రమాలతో ఆందోళనను ఉధృతం చేస్తామని ఆ పాఠశాలల జేఏసీ చైర్మన్ యనమల విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మోడల్ స్కూల్ టీచర్లు, ప్రిన్సిపాళ్లు జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా విజయలక్షి, చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించి మూడేళ్లు పూర్తయినా వారి సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ అమలు చేసి రెండేళ్లు దాటినా తమకు వర్తింపజేయలేదన్నారు. ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. అంతే కాకుండా సర్వీస్ రూల్స్, హెల్త్ కార్డులు, పీఎఫ్, ఏపీజీఎల్‌ఐసీ అమలు చేయడం లేదన్నారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో మల్లీశ్వరిదేవికి వినతిపత్రం ఇచ్చారు. ఈ ధర్నాకు ఎమ్మెల్సీ గేయానంద్, ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌నాథ్‌రెడ్డి, ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానందరెడ్డి, ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఓబుళరావు, ఇతర సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో ఆదర్శ పాఠశాలల జేఏసీ నాయకులు వై.భాస్కర్‌రెడ్డి, విజయనరసింహ, పద్మశ్రీ, స్వర్ణలత, ప్రకాశ్‌నాయుడు, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.