ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు
జిల్లా దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారుల సంఘం
రాజమహేంద్రవరం కల్చరల్ : పెద్ద నోట్ల రద్దు తరువాత, జిల్లాలోని దేవాలయ హుండీల ద్వారా, కోట్లాది రూపాయల నల్లధనం మార్పిడి జరిగినట్లు కొన్ని పత్రికలలో (సాక్షి కాదు) వచ్చిన వార్తలలో వాస్తవం లేదని జిల్లా దేవాలయ కార్యనిర్వహణాధికారుల సంఘం అధ్యక్షుడు బొక్కా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం మెయిన్ రోడ్డులోని నాగవరపు బుచ్చబ్బాయి సత్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దనోట్లు రద్దయ్యాక, జిల్లా వ్యాప్తంగా గల 48 దేవాలయాల్లో హుండీలు తెరచి లెక్కించగా వచ్చిన సొమ్ము రూ3,43,72,913/ కాగా, కోట్లాది రూపాయల నల్లధనం మార్పిడి జరిగినట్టు కొన్ని పత్రికలు నిరాధార అరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఈ ఆరోపణలు హిందూ మత విశ్వాసాలను కించపరిచేటట్టు అసత్య కథనాలు వెలువరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నోట్ల లెక్కింపు ధర్మకర్తల మండలి సభ్యులు, బ్యాంకు ప్రతినిధులు, పోలీసులు, స్థానికుల సమక్షంలో, సీసీ కెమేరాల పర్యవేక్షణలో జరుగుతుందని, లెక్కించిన సొమ్మును బ్యాంకులలో జమ చేస్తారన్నారు. మంగళవారం జాయింట్ కలెక్టర్–2 సమక్షంలో జరిగిన విచారణలో ఏ ఒక్క ఈవో ఉన్నతాధికారుల ఒత్తిడికి తాము గురయ్యామని పేర్కొనలేదన్నారు. ఈ విషయంలో ఒక ప్రముఖ ఆలయ ఈవో ఫిర్యాదు చేసినట్టు వచ్చిన వార్తలు నిరాధారమన్నారు. పెద్దనోట్ల మార్పిడి జరిగిన తరువాత నెలరోజులలో వచ్చిన సొమ్ము రూ.3,43,72,913 కాగా, రోజుకు రెండు కోట్ల మార్పిడి జరిగిందనడం శోచనీయమన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా కార్యనిర్వహణాధికారుల సంఘం కార్యదర్శి బి.కృష్ణ చైతన్య, ప్రతినిధులు తారకేశ్వరరావు, వీరవెంకటేశ్వరరావు, ఆకెళ్ల భాస్కర్, రాష్ట్ర సంఘం సంయుక్త కార్యదర్శి వి.పళ్లంరాజు, అర్చక సమాఖ్య ప్రతినిధులు ఖండవిల్లి కిరణకుమారాచార్యులు, ఎస్.వి.జనార్దనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.