
84 ఏటీఎంలు.. పనిచేస్తున్నవి 19
56 రోజులుగా నగదు కోసం తిప్పలు
రూ.10 వేలకు కుదించిన విత్‌డ్రాలు
అందుబాటులోకి రాని రూ.500 నోట్లు
రూ. 2000 వేల నోటుతో చిల్లరకు కష్టాలు
మంచిర్యాల అగ్రికల్చర్ : ప్రజలకు నోట్ల కష్టాలు తీరడం లేదు. జనవరి నెల వచ్చి నాలుగు రోజులు గడిచినా బ్యాంకుల నుంచి అరకొరగానే సేవలు అందుతున్నాయి. మంగళవారం కూడా నగదు కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సింగరేణి కార్మికులు, రైతులు, వ్యాపారులు, పింఛన్‌దారులు బ్యాంకులకు తరలివచ్చారు. అయినా.. ఎవరికీ పూర్తి స్థాయి లో నగదు అందలేదు. ఏటీఎంల్లో కూడా నగదు లేక జనం అవస్థలు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు కొరతతో అల్లాడుతున్న వేతన జీవులకు జనవరి నెల ఒకటో తేదీ మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది.
కానరాని రూ.500 నోట్లు
నోట్లు రద్దయినప్పటి నుంచి జిల్లాకు ఇప్పటికి వరకు రూ.600 కోట్ల మేరకు పైగా డిమాండ్ ఉండగా ఆర్బీఐ నుంచి వివిధ బ్యాంకులకు రూ.340 కోట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇందులో 80 శాతం రెండు వేలు నోట్లే మిగితా 20 శాతం చిల్లర నోట్లు. గంటల తరబడి క్యూల్లో నిలబడి తీసుకున్న నగదు రూ.2 వేల నోట్ల రూపంలో అందడంతో చిల్లర కోసం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాటిని మార్చేందేకు నానా అవస్థలు పడుతున్నారు. చిల్లర సమస్యల లేకుండా చేసేందుకు రూ.500 నోట్లు పంపుతున్నామని ఆర్‌బీఐ ప్రకటించినా క్షేత్రస్థాయిలో వాటి జాడ ఎక్కడా కనిపించడం లేదు. ఏ బ్యాంకుకు, ఏ ఏటీఎంకు వెళ్లినా రూ.2 వేల నోట్లే వస్తున్నాయి. రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లు జిల్లాకు వచ్చినట్లు తెలుస్తున్నా బయట కనిపించడం లేదు. మరోపక్క జిల్లాకు వచ్చిన రూ.500 నోట్లు ఎక్కడున్నాయనే చర్చ జోరుగానే సాగుతోంది. రూ.500 నోట్లు తగినన్ని విడుదల చేసి ఉంటే చిల్లర కష్టాలు కొంతమేరకు తగ్గేవని ప్రజలు పేర్కొంటున్నారు.
రూ.10 వేలకే పరిమితం..
ప్రతినెలా ఒకటి నుంచి వారం రోజులపాటు ఉద్యోగులకు మాత్రమే కాదు.. అన్ని వర్గాల వారికి డబ్బుల అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో రెండు రోజులుగా ఉద్యోగులు పెన్షనర్లు ఇతర అన్ని వర్గాల వారు బ్యాంకులకు పోటెత్తారు. ఈ క్రమంలో బ్యాంకులకు వస్తున్న నగదు ఏ మూలకు సరిపోవడంలేదు. జిల్లా కేంద్రంలోని ప్రధాన బ్యాంకులన్నీ ఉద్యోగస్తులకు రూ.10 వేలు విత్‌డ్రాకే పరిమితం అవుతున్నాయి. ఒక్కో ఉద్యోగికి రూ.20 నుంచి రూ.60 వేల వరకు వేతనం ఉంటున్నా.. పది వేలతోనే సరిపెడుతున్నారు. మిగితా వారికి రెండు నుంచి నాలుగు వేలకు మించి ఇవ్వడం లేదు. సామాన్య ప్రజానికానికి వారానికి ఒక్కో ఖాతాదారుడికి రూ.24 వేల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉన్నా.. ఎక్కడా ఆ పరిస్థితి లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంత బ్యాంకుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కేవలం రూ.2 వేలు నుంచి నాలుగు వేల రూపాయల వరకు మాత్రమే విత్‌డ్రా ఇస్తున్నారు.
తీరని కష్టాలు
రోజులు గడుస్తున్నా నగదు కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల వద్ద సామాన్య ప్రజనీకానితోపాటు వేతనాల కోసం క్యూలు పెరిగిపోతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు 98 ఉండగా వీటి ద్వారా వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులు రోజుకు రూ.10 నుంచి రూ.20 లక్షలు ఖాతాదారులకు చెల్లించేందుకు అందుబాటులో ఉండేవి. కానీ.. ఇప్పుడు రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకే పరిమితం అవుతున్నాయి. జిల్లాలో గ్రామీణ బ్యాంకులకు స్టేట్‌బ్యాంకు నుంచి నగదు సరఫరా అవుతుంది. స్టేట్‌బ్యాంకుల ఆర్బీఐ నుంచి అనకొర నగదు వస్తుండటంతో గతంలో ఇచ్చిన పెద్ద మొత్తంలో సగం కూడా ఇవ్వడం లేదు. దీంతో రెండు వేలు, నాలుగు వేలు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. వారంలో రూ.24 వేలు కూడా చేసుకోలేని పరిస్థితి ఉంది.
రూ.600 కోట్లు డిపాజిట్..
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి వివిధ బ్యాంకుల్లో రూ.600 కోట్ల వరకు డిపాజిట్ చేశారు. నోట్లు రద్దయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్‌బీఐ నుంచి జిల్లాకు రూ.340 కోట్ల వరకు వచ్చాయి. ఇందులో కొత్తగా వచ్చిన రెండు వేల నోట్లు రూ.310 కోట్లు. దీంతోపాటు ఇటీవల చెలామణికి వచ్చిన కొత్త రూ.500 నోట్లు పదికోట్లు కాగా.. మిగితా రూ.20 కోట్లు వంద, యాబై, ఇరవై, పది నోట్లతోపాటు పది రూపాయల కాయిన్స్ ఖాతాదారులకు అందించారు. రద్దయిన వాటి స్థానంలో సగం కూడా కొత్త నోట్లు అందుబాటులోకి రాలేదు. జిల్లాలో 65 వేల మంది ప్రభుత్వ, ప్రైవేటు, సింగరేణి కార్మికులు ఉంటారు. వీరందరికీ ఒకటో తారీఖు నుంచి వారం రోజులపాటు వంద కోట్ల వరకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమయంలో సరిపడా నగదు జిల్లాలో వివిధ బ్యాంకులకు చేరాల్సి ఉన్నా.. ఆర్బీఐ నుంచి ఈ నెల 2వ తేదీ నుంచి ప్రధాన బ్యాంకులకు రూ.10 కోట్ల లోపే వచ్చినట్లు తెలుస్తోంది.
ఏటీఎంలలో నో క్యాష్..
ఏటీఎంల అర్థం మారిపోయింది. ఎనీటైం మనీ బదులు, నో క్యాష్ ఏటీఎంలుగా మారిపోతున్నాయి. ఏటీఎంల్లో 90 శాతం నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. మిగితా పదిశాతంలో ఉదయం పూట పెట్టిన నగదు మధ్యాహ్నం వరకు ఖాళీ అవుతోంది. జిల్లాలో ఉన్న 84 ఏటీఎం కేంద్రాలకు గాను 21 ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఉదయం డబ్బులు పెడుతారని ఏటీఎం వద్ద క్యూ కడుతున్నా.. పెట్టకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.
రావడం లేదు..
ఖాతాదారులు బ్యాంకు నుంచి నగదు తీసుకెళ్లడమే తప్ప నెలన్నర రోజులుగా రావడమే లేదు. గతంలో వస్తూపోతుంటే రొటేషన్ అవుతుండేది. కానీ.. నోట్లు రద్దయినప్పటి నుంచి తీసుకెళ్లడమే తప్ప డిపాజిట్ లేకుండాపోయింది. ఆర్‌బీఐ నుంచి బ్యాంకులకు సరిపడా నోట్లు అందుబాటులో ఉంచడం లేదు. దీంతో ఖాతాదారులకు తక్కువగా ఇవ్వడం జరుగుతోంది. సర్దిచెబుతూ పంపిస్తున్నాం. నగదు రహిత లావాదేవీలు చేసుకోవాలని సూచిస్తున్నాం.
– శ్రీనివాస్‌రావు, ఎస్‌బీహెచ్ బ్యాంకు చీఫ్ మేనేజర్