పట్టుతప్పిన పర్యవేక్షణ
-
పీహెచ్‌సీలలో తనిఖీలు కరువు
-
నిర్లక్ష్యం వీడని ఎస్‌పీహెచ్‌ఓలు
-
వాహనాల సొమ్ములు సొంతానికి..
-
ఆరోగ్యశాఖలో అద్దెల అవినీతి
-
వర్షకాలంలోనూ మారని తీరు
విష జర్వాలు, రోగాలతో పల్లెలు మంచం పట్టిన తరుణంలోనూ వైద్య ఆరోగ్యశాఖలో పర్యవేక్షణ పట్టు తప్పుతోంది. ప్రాథమిక ఆర్యోగ కేంద్రాల పనితీరును నిత్యం పర్యవేక్షించాల్సిన సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ యూనిట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ’
సాక్షి, హన్మకొండ : వైద్య సేవలు సక్రమంగా, సమర్థంగా అందేందుకు వీలుగా ప్రభుత్వం సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ యూనిట్‌లను ప్రారంభించింది. జిల్లాలో జనగామ, ములుగు, తొర్రూరు, వర్థన్నపేట, మహబూబూబాద్, పరకాలల్లో మెుత్తం 16 సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ యూనిట్లు ఉన్నాయి. ప్రతీ ఎస్‌పీహెచ్‌ఓ యూనిట్‌లో సీనియర్ వైద్యాధికారి, ఆప్థమాలజిస్ట్, సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, హెల్త్ ఎడ్యుకేటర్‌లు ఉంటారు. వీరి పరిధిలో కనీసం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలోని సబ్ సెంటర్లు ఉంటాయి. ఎస్‌పీహెచ్‌ఓ సిబ్బంది నిత్యం తమ పరిధిలో వైద్య సేవలు సక్రమంగా అందేలా పర్యవేక్షణ చేయాలి. అవసరాన్ని బట్టి అవగాహన సదస్సులు, శిక్షణ శిబిరాలు నిర్వహించాలి. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే 104 సర్వీసులు పర్యవేక్షించాలి. ఈ పనులు చేసేందుకు వీరికి ప్రభుత్వం వాహనం కూడా సమకూరుస్తుంది.
తనిఖీల పేరుతో గైర్హాజరు..
తమ పరిధిలో ప్రాథమిక ఆర్యోగ కేంద్రాలను తనిఖీ చేయడానికి వెళ్తున్నామనే నెపంతో జిల్లాలో సగానికిపైగా ఎస్‌పీహెచ్‌ఓ యూనిట్ల సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత పనులు చూసుకుంటూ తనిఖీకి వెళ్లామని చెబుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్థన్నపేట ఎస్‌పీహెచ్‌ఓగా పని చేస్తున్న సాంబశివరావు పదోన్నతిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఈ ఎస్‌పీహెచ్‌ఓ పనితీరు గాడి తప్పింది. నెలలో ఎక్కువ రోజులు తాళం వేసే ఉంటోంది.
సగం సొంత వాహనాలే..
ఎస్‌పీహెచ్‌ఓలు నిత్యం తనిఖీ చేయాల్సి ఉండటంతో ప్రతీ సెంటర్‌కు ఒక వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ వాహనాల అద్దెకు నెలకు రూ.25000 విడుదల చేసింది. సగం ఎస్‌పీహెచ్‌ఓలలో ఈ వాహనాల అద్దె అవినీతికి ఆస్కారం ఇస్తోంది. చాలా మంది సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు సొంత వాహనాలు వినియోగిస్తూ అద్దె వాహనాలుగా రికార్డుల్లో చూపుతూ ప్రభుత్వం చెల్లించే అద్దె డబ్బు జేబుల్లో వేసుకుంటున్నారు. ఇందుకు గాను జిల్లా కేంద్రంలో ఉండే పెద్దలకు ప్రతీ వాహనానికి రూ. 5000 చొప్పున ముడుపులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
బడ్జెట్ లేదు
ప్రభుత్వం ఎయిర్ వెహికిల్ కేటాయించింది. దీనికి బడ్జెట్ కేటాయించకపోవడంతో పది నెలలుగా ఆ వాహనం రాలేదు. దీంతో నా కారును ఉపయోగించుకోవాల్సి వస్తోంది. గతంలో మహబూబాబాద్‌లో తిరిగిన వాహనం ప్రస్తుతం తొర్రూరులో ఉంది.
పి.వెంకటరమణ, మహబూబాబాద్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్
సకాలంలో బడ్జెట్ రాకపోవడమే కారణం
గత ఎనిమిది నెలల నుంచి అధికారుల వాహనాలకు ప్రభుత్వం నుంచి బడ్జెట్ మంజూరు కాకపోవడంతో ట్రావెల్స్ యజమానులు వాహనాలు అద్దెకు పెట్టడం లేదు. సకాలంలో బడ్జెట్ రాకపోవడం వల్ల కొంత మంది వైద్యాధికారులు సొంత వాహనాలు వాడుకుంటున్నారు ఏదేమైనా సొంత వాహనాలు వాడరాదని స్పష్టమైన అదేశాలు జారీ చేశాం.
– డీఎంహెచ్‌ఓ సాంబశివరావు