PHC employees
-
ఇదే లాస్ట్ వార్నింగ్.. పనితీరు మార్చుకోండి
సాక్షి, ఎస్.రాయవరం(విశాఖపట్నం): సర్వసిద్ధి పీహెచ్సీ సిబ్బంది పనితీరు మార్చుకోవాలని, విధులకు సక్రమంగా హాజరుకాకుంటే సహించేది లేదని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హెచ్చరించారు. సర్వసిద్ధి గ్రామంలోని ప్రైవేటు కార్యక్రమానికి ఆదివారం వచ్చిన ఆయన ఆకస్మికంగా స్థానిక పీహెచ్‌సీని సందర్శించారు. పీహెచ్సీలో డాక్టర్ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది ఎక్కడ ఉంటున్నారని ఆరా తీశారు. అటెండర్‌తో సహా ఎవరూ స్థానికంగా ఉండడం లేదని గ్రామస్తులు చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా అందుబాటులోకి వచ్చిన స్టాఫ్ నర్సు, అటెండర్‌తో మాట్లాడుతూ ఇదే లాస్ట్ వార్నింగ్ అని, ఇకపై పీహెచ్సీ ఇబ్బంది ఇలా చేస్తే క్షమించేది లేదన్నారు. రోడ్ల నిర్మాణానికి నిధులు గ్రామంలో ఎస్సీపేట వీధి రోడ్ల నిర్మాణానికి త్వరలో నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తెలిపారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పంచాయతీకి మంజూరయ్యే నిధులను ఈ వీధిలోని రోడ్ల అభివృద్ధికి కేటాయించాలని స్థానిక సర్పంచ్ గణేశ్వరరావుకు సూచించారు. ఎమ్మెల్యే వెంట పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి చంటి, వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు తదితరులున్నారు. -
వారికి వేళా పాళా లేదు!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ సమయపాలన కచ్చితంగా అమలవుతున్నా... పీహెచ్‌సీల్లో మాత్రం అమలు కావడం లేదన్నది సుస్పష్టం. వైద్యుల నుంచి ఉద్యోగుల వరకూ అంతా కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందేనని నిర్ణయిస్తూ ఆయా కార్యాలయాల్లో పరికరాలు ఏర్పాటు చేసినా కొన్ని పీహెచ్‌సీల్లో అవి మూలకు చేరాయి. దీనిని అవకాశంగా తీసుకుంటున్న ఉద్యోగులు, వైద్యులు ఇష్టానుసారం వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక బయోమెట్రిక్ పరికరాలు పనిచేస్తున్న చోటయినా వేళకు వస్తున్నారా... అంటే అదీ లేదు. వారు ఎప్పుడు వస్తే అప్పుడే బయోమెట్రిక్ వేసి మమ అనిపిస్తున్నారు. పనిచేస్తున్నవి 38 మాత్రమే... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 68 పీహెచ్‌సీలు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 11 సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. జిల్లాలో 68 పీహెచ్సీలలో పరికరాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 38 పీహెచ్‌సీల్లో మాత్రమే పనిచేస్తున్నాయి. 30 ఆస్పత్రుల్లో పరికరాలు పనిచేయడం లేదు. వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో పరికరాలన్నీ పనిచేస్తున్నాయి. కాని విధులకు ఎప్పుడు హాజరు అయితే అప్పుడే బయోమెట్రిక్ వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటలకు బమోమెట్రిక్ వేయాలి. కాని 10 గంటలకు, 10.30 గంటలకు, 11 గంటలకు కూడా వేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడన్న విమర్శలున్నాయి. వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోవడం వల్ల రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. పీహెచ్‌సీల్లో రోగులు పలు ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలు కఠినంగా లేకే... బయోమెట్రిక్ అధారంగా జీతాలు ఇస్తామని అప్పట్లో వైద్య శాఖ ఉన్నత అధికారులు ప్రకటించారు. బయోమెట్రిక్ హాజరు అధారంగా జీతాలు ఇచ్చినట్టయితే ఆలస్యంగా వచ్చేవారికి కచ్చితంగా వేతనంలో కోత పడుతుంది. ఈ ఉద్దేశం ఇప్పుడు నెరవేరకపోవడంతో పరికరాలు ఉన్నా... ప్రయోజనం లేకపోతోంది. పరికరాలు బాగు చేయిస్తాం 68 పీహెచ్‌సీలకు 38 చోట్ల బయోమెట్రిక్ పరికరాలు పనిచేస్తున్నాయి. 30 పీహెచ్‌సీల్లో పనిచేయడం లేదు. వీటిని బాగు చేయించడానికి ఇచ్చాం. పాతవి తరచూ మొరాయిస్తుండడంతో వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. వైద్య సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకుంటాం. ఎస్.వి.రమణకుమారి, డీఎంహెచ్ఓ -
గర్భిణుల్లో అపోహలను తొలగించాలి
సాక్షి, భట్టిప్రోలు: గర్భిణుల్లో నెలకొన్న అపోహలను వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తొలగించాలని భట్టిప్రోలు పీహెచ్సీ డాక్టర్ ఎ.సీతాకుమారి సూచించారు. పీహెచ్సీలో మంగళవారం ఆశాడే నిర్వహించారు. ఈ సందర్భంగా సీతాకుమారి మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి గర్భిణుల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని, వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని సూచించారు. కాన్పులు ప్రభుత్వ వైద్యశాలల్లోనే జరిగేలా చూడాలని కోరారు. బాలింతలు ఈ సేవలు పొందేందుకు 102 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. పల్స్ పోలియోను విజయవంతం చేయాలి వెల్లటూరు పీహెచ్సీలో నిర్వహించిన ఆశాడే సమావేశంలో డాక్టర్ సీహెచ్ రామలక్ష్మి మాట్లాడుతూ వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను వివరించారు. ఈ నెల 10వ తేదీన నిర్విహించనున్న సామూహిక పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఐదేళ్లలోపు పిల్లలకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. -
సాక్షి కెమెరాకు ఆస్పత్రి సిబ్బంది బాగోతం
సాక్షి, కూకట్పల్లి : అది పేదలే కాదు మధ్యతరగతి పౌరుల అవసరాలు తీర్చే ఆస్పత్రి. ప్రధాన రహదారి వెంటే ఉండటంతో ఆ ఆస్పత్రిలోకి వచ్చేవారి సంఖ్య కూడా ఎక్కువే. సాధారణంగా ఆస్పత్రిని వైద్యాలయం అంటారు. ఎందుకంటే పవిత్రమైనది. కానీ, కొంతమంది ప్రబుద్ధులు ఆ ఆస్పత్రిని తాగుబోతుల అడ్డాగా మార్చారు. ఇది మరెక్కడో కాదు.. నగరంలో నడిబొడ్డులోని కూకట్‌పల్లిలోగల ప్రభుత్వ వైద్యశాల. చుట్టుపక్కల వారు ఆస్పత్రిలో పరిస్థితులు వివరించడంతో అక్కడికి వెళ్లిన సాక్షి కెమెరాకు అక్కడ షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆస్పత్రి సిబ్బందే తాగుబోతులైన దృశ్యాలు స్పష్టంగా చిక్కాయి. మందేసి నిషాలో తేలుతున్న సిబ్బంది దర్శనం ఇచ్చారు. ఏం చక్కా వారు ఆస్పత్రి పడకలనే మందేసే టేబుళ్లుగా మార్చుకొని అడ్డగోలుగా వ్యవహరిస్తూ దొరికిపోయారు. వైద్యం కోసం వచ్చిన వారికి వారు మందేసి సేవలు అందించడం కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. అంతేకాదు ఆస్పత్రిలోని పలు పరికరాలు కూడా వారు విచ్చలవిడిగా వాడుకుంటున్నట్లు తెలిసింది. -
సాక్షి కెమెరాకు ఆస్పత్రి సిబ్బంది బాగోతం
-
పట్టుతప్పిన పర్యవేక్షణ
పీహెచ్సీలలో తనిఖీలు కరువు నిర్లక్ష్యం వీడని ఎస్పీహెచ్ఓలు వాహనాల సొమ్ములు సొంతానికి.. ఆరోగ్యశాఖలో అద్దెల అవినీతి వర్షకాలంలోనూ మారని తీరు విష జర్వాలు, రోగాలతో పల్లెలు మంచం పట్టిన తరుణంలోనూ వైద్య ఆరోగ్యశాఖలో పర్యవేక్షణ పట్టు తప్పుతోంది. ప్రాథమిక ఆర్యోగ కేంద్రాల పనితీరును నిత్యం పర్యవేక్షించాల్సిన సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ యూనిట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ’ సాక్షి, హన్మకొండ : వైద్య సేవలు సక్రమంగా, సమర్థంగా అందేందుకు వీలుగా ప్రభుత్వం సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ యూనిట్లను ప్రారంభించింది. జిల్లాలో జనగామ, ములుగు, తొర్రూరు, వర్థన్నపేట, మహబూబూబాద్, పరకాలల్లో మెుత్తం 16 సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ యూనిట్లు ఉన్నాయి. ప్రతీ ఎస్పీహెచ్ఓ యూనిట్లో సీనియర్ వైద్యాధికారి, ఆప్థమాలజిస్ట్, సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, హెల్త్ ఎడ్యుకేటర్లు ఉంటారు. వీరి పరిధిలో కనీసం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలోని సబ్ సెంటర్లు ఉంటాయి. ఎస్పీహెచ్ఓ సిబ్బంది నిత్యం తమ పరిధిలో వైద్య సేవలు సక్రమంగా అందేలా పర్యవేక్షణ చేయాలి. అవసరాన్ని బట్టి అవగాహన సదస్సులు, శిక్షణ శిబిరాలు నిర్వహించాలి. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే 104 సర్వీసులు పర్యవేక్షించాలి. ఈ పనులు చేసేందుకు వీరికి ప్రభుత్వం వాహనం కూడా సమకూరుస్తుంది. తనిఖీల పేరుతో గైర్హాజరు.. తమ పరిధిలో ప్రాథమిక ఆర్యోగ కేంద్రాలను తనిఖీ చేయడానికి వెళ్తున్నామనే నెపంతో జిల్లాలో సగానికిపైగా ఎస్పీహెచ్ఓ యూనిట్ల సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత పనులు చూసుకుంటూ తనిఖీకి వెళ్లామని చెబుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్థన్నపేట ఎస్పీహెచ్ఓగా పని చేస్తున్న సాంబశివరావు పదోన్నతిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఈ ఎస్పీహెచ్ఓ పనితీరు గాడి తప్పింది. నెలలో ఎక్కువ రోజులు తాళం వేసే ఉంటోంది. సగం సొంత వాహనాలే.. ఎస్పీహెచ్ఓలు నిత్యం తనిఖీ చేయాల్సి ఉండటంతో ప్రతీ సెంటర్‌కు ఒక వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ వాహనాల అద్దెకు నెలకు రూ.25000 విడుదల చేసింది. సగం ఎస్పీహెచ్ఓలలో ఈ వాహనాల అద్దె అవినీతికి ఆస్కారం ఇస్తోంది. చాలా మంది సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు సొంత వాహనాలు వినియోగిస్తూ అద్దె వాహనాలుగా రికార్డుల్లో చూపుతూ ప్రభుత్వం చెల్లించే అద్దె డబ్బు జేబుల్లో వేసుకుంటున్నారు. ఇందుకు గాను జిల్లా కేంద్రంలో ఉండే పెద్దలకు ప్రతీ వాహనానికి రూ. 5000 చొప్పున ముడుపులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బడ్జెట్ లేదు ప్రభుత్వం ఎయిర్ వెహికిల్ కేటాయించింది. దీనికి బడ్జెట్ కేటాయించకపోవడంతో పది నెలలుగా ఆ వాహనం రాలేదు. దీంతో నా కారును ఉపయోగించుకోవాల్సి వస్తోంది. గతంలో మహబూబాబాద్‌లో తిరిగిన వాహనం ప్రస్తుతం తొర్రూరులో ఉంది. పి.వెంకటరమణ, మహబూబాబాద్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ సకాలంలో బడ్జెట్ రాకపోవడమే కారణం గత ఎనిమిది నెలల నుంచి అధికారుల వాహనాలకు ప్రభుత్వం నుంచి బడ్జెట్ మంజూరు కాకపోవడంతో ట్రావెల్స్ యజమానులు వాహనాలు అద్దెకు పెట్టడం లేదు. సకాలంలో బడ్జెట్ రాకపోవడం వల్ల కొంత మంది వైద్యాధికారులు సొంత వాహనాలు వాడుకుంటున్నారు ఏదేమైనా సొంత వాహనాలు వాడరాదని స్పష్టమైన అదేశాలు జారీ చేశాం. – డీఎంహెచ్ఓ సాంబశివరావు -
పీహెచ్సీ సిబ్బంది పనితీరు మెరుగు పర్చుకోవాలి
టేక్మాల్: స్థానిక పీహెచ్సీ సిబ్బంది తమ పనితీరును మెరుగు పర్చుకోవాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ హెచ్చరించారు. గురువారం టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లిలోని పీహెచ్సీ సబ్‌సెంటర్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆమె సబ్‌సెంటర్ బోర్డును, చార్ట్‌లను పరిశీలించి వాటిని మార్చాలని డాక్టర్ ఇర్షద్‌కు సూచించారు. గ్రామసర్పంచ్ కంకర బీరప్పను అడిగి సబ్‌సెంటర్ పనితీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గ్రామంలో ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికారులు స్థానికులను ప్రోత్సహించాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి వెంటనే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు.అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. పంచాయతీ కావాల్సిన ఫర్నిచర్‌ను, సామగ్రిని దాతలు, గ్రామస్తుల సహకారంతో సమకూర్చుకోవాలన్నారు. గ్రామంలో వీఆర్ఓ కార్యలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తేవాలన్నారు. పదిహేను రోజుల్లోనీటి సౌకర్యం కల్పించండి నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లకు పదిహేను రోజుల్లో నీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ స్మితాసబర్వాల్ సంబంధిత ఏఈలను ఆదేశించారు. గురువారం మండల కేంద్రమైన టేక్మాల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ అకస్మికంగా సందర్శించారు. మరుగుదొడ్లకు నీటి సౌకర్యంలేక నిరుపయోగంగా ఉంటే బాలికలు మూత్ర విసర్జనకు బహిర్భూమిని ఆశ్రయిస్తే సమస్యలు ఉత్పన్నం కావా అని మండిపడ్డారు. త్వరలో నీటి సౌకర్యం కల్పించి వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. పక్కన నిర్మిస్తున్న మోడల్ స్కూల్ భవన నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా పూర్తి చేసి అందించాలని ఆదేశించారు. లేని పక్షంలో సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకు ముందు పాఠశాల తరగతి గదుల్లో తిరుగుతూ విద్యార్థులతో ముచ్చటించారు. వారి నుంచి వచ్చే సమధాలతో సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు చిన్నప్పటినుంచే ఇంగ్లిషులో మాట్లాడడం, రాయడం నేర్చుకోవాలని సూచించారు. తోటి విద్యార్థులతో సంభాషణలు ఇంగ్లిష్‌లోనే చేయాలన్నారు. ఉపాధ్యాయులు వారికి అర్థమయ్యే రీతిలో బోధిస్తూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఆమె వెంట ఆర్డీఓ వనజాదేవి, తహశీల్దార్ నాగేశ్వర్రావు, ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఎంఈఓ వీర్సంగప్ప, ప్రిన్సిపాల్ అరుణ, ఆర్ఐ తారాబాయి. వీఆర్వో సత్యనారాయణ తదితరులు ఉన్నారు.