పీహెచ్‌సీ సిబ్బంది పనితీరు మెరుగు పర్చుకోవాలి | collector orders PHC staff to work sincerely | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీ సిబ్బంది పనితీరు మెరుగు పర్చుకోవాలి

Published Fri, Nov 8 2013 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM

collector orders PHC staff to work sincerely

టేక్మాల్: స్థానిక పీహెచ్‌సీ సిబ్బంది తమ పనితీరును మెరుగు పర్చుకోవాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ హెచ్చరించారు. గురువారం టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లిలోని పీహెచ్‌సీ సబ్‌సెంటర్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆమె సబ్‌సెంటర్ బోర్డును, చార్ట్‌లను పరిశీలించి వాటిని మార్చాలని డాక్టర్ ఇర్షద్‌కు సూచించారు. గ్రామసర్పంచ్ కంకర బీరప్పను అడిగి సబ్‌సెంటర్ పనితీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గ్రామంలో ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికారులు స్థానికులను ప్రోత్సహించాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి వెంటనే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు.అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. పంచాయతీ కావాల్సిన ఫర్నిచర్‌ను, సామగ్రిని దాతలు, గ్రామస్తుల సహకారంతో సమకూర్చుకోవాలన్నారు. గ్రామంలో వీఆర్‌ఓ కార్యలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తేవాలన్నారు.
 
 పదిహేను రోజుల్లోనీటి సౌకర్యం కల్పించండి
 నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లకు పదిహేను రోజుల్లో నీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ స్మితాసబర్వాల్  సంబంధిత ఏఈలను ఆదేశించారు. గురువారం మండల కేంద్రమైన టేక్మాల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ అకస్మికంగా సందర్శించారు. మరుగుదొడ్లకు నీటి సౌకర్యంలేక నిరుపయోగంగా ఉంటే బాలికలు మూత్ర విసర్జనకు బహిర్భూమిని ఆశ్రయిస్తే సమస్యలు ఉత్పన్నం కావా అని  మండిపడ్డారు.  త్వరలో నీటి సౌకర్యం కల్పించి వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. పక్కన నిర్మిస్తున్న మోడల్ స్కూల్ భవన నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా పూర్తి చేసి అందించాలని ఆదేశించారు. లేని పక్షంలో సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అంతకు ముందు పాఠశాల తరగతి గదుల్లో తిరుగుతూ విద్యార్థులతో ముచ్చటించారు. వారి నుంచి వచ్చే సమధాలతో సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు చిన్నప్పటినుంచే ఇంగ్లిషులో మాట్లాడడం, రాయడం నేర్చుకోవాలని సూచించారు. తోటి విద్యార్థులతో సంభాషణలు ఇంగ్లిష్‌లోనే చేయాలన్నారు.


 ఉపాధ్యాయులు వారికి అర్థమయ్యే రీతిలో బోధిస్తూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఆమె వెంట ఆర్‌డీఓ వనజాదేవి, తహశీల్దార్ నాగేశ్వర్‌రావు, ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఎంఈఓ వీర్‌సంగప్ప, ప్రిన్సిపాల్ అరుణ, ఆర్‌ఐ తారాబాయి. వీఆర్వో  సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement