feaver
-
యూరప్ దేశాలను వణికిస్తున్న పారెట్ ఫీవర్
యూరప్‌లోని అనేక దేశాల్లో పారెట్ ఫీవర్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందారు. పారెట్ ఫీవర్‌ను సిటాకోసిస్ అని కూడా అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పారెట్ ఫీవర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించింది. యూరప్ దేశాల్లో నివసించే వారిపై పారెట్ ఫీవర్ తీవ్ర ప్రభావం చూపుతోంది. 2023 ప్రారంభంలో విధ్వంసం సృష్టించిన ఈ వ్యాధి.. ఇప్పుడు 2024 ప్రారంభంలో ఐదుగురి ప్రాణాలను బలిగొంది. గత ఏడాది ఆస్ట్రియాలో 14 పారెట్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 27 నాటికి డెన్మార్క్‌లో ఈ అంటువ్యాధికి సంబంధించిన 23 కేసులు నిర్ధారితమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. డెన్మార్క్‌లో ఒక వ్యక్తిలో ఈ వ్యాధి కనిపించింది. ఈ ఏడాది ఇప్పటికే జర్మనీలో ఐదు కేసులు నమోదయ్యాయి. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం పెంపుడు జంతువులు లేదా అడవి పక్షులతో అనుబంధం కలిగిన వారే అధికంగా ఈ వ్యాధి బారి పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పారెట్ ఫీవర్ అనేది క్లామిడియా ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. ఇది వివిధ రకాల అడవి జంతువులు, పెంపుడు పక్షులు, కోళ్లలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పక్షులు అనారోగ్యంగా కనిపించకపోవచ్చు. కానీ అవి శ్వాస లేదా మలవిసర్జన చేసినప్పుడు బ్యాక్టీరియాను విడుదల చేస్తాయి. ఇదే వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే రెండవ చిన్న ఖండమైన యూరప్‌లో 50 వరకూ సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. -
పెళ్లయిన నెలన్నరకే మృత్యు ఒడిలోకి...
సుజాతనగర్: పెళ్లింట విషాదం నిండుకుంది. పెళ్లయిన నెలన్నర రోజులకే అనారోగ్యంతో అతడు మృతిచెందాడు. సుజాతనగర్ మండలం సుజాతనగర్ గ్రామస్తులు షేక్ ఇబ్రహీం, ఖాదర్‌బీ దంపతుల పెద్ద కుమారుడు షేక్ ఇస్మాయెల్(26), ఎంబీఏ పట్టభద్రుడు. ఎస్బీఐ ఇన్సూరెన్స్‌లో ప్రైవేట్ ఉద్యోగిగా కొత్తగూడెంలో పనిచేస్తున్నాడు. కొత్తగూడేనికి చెందిన షేక్ ఇమాంసాబ్, రజియా దంపతుల కుమార్తె ఇస్మత్‌తో గత నెల (నవంబర్) 12న ఇస్మాయెల్‌కు వివాహమైంది. పెళ్లికి ముందే ఇస్మాయెల్‌కు జ్వరం సోకింది. వైద్యం చేయించుకోవడంతో తగ్గింది. ఆ తర్వాత పెళ్లయింది. ఇటీవల ఒక రోజున, డ్యూటీలో ఉండగానే అతడికి కడుపు నొప్పి వచ్చింది. కళ్లు తిరిగి పడిపోయాడు. వారం రోజులుగా ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి కిడ్నీలు ఫెయిలైనట్టు వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 28న (శుక్రవారం) హైదరాబాద్ తీసుకెళుతుండగా మృతిచెందాడు. అతని భార్య, కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. -
ఈ ‘తూర్పు’నకు ఏమైంది?
పట్టిపీడిస్తున్న డెంగీ, మలేరియా విజృంభిస్తున్న ప్రాణాంతక వ్యాధులు మృత్యువాత పడుతున్న రోగులు ప్రత్యేక దృష్టి సారించని జిల్లా యంత్రాంగం ఒకవైపు డెంగీ.. మరోవైపు మలేరియా.. ఇంకోవైపు విషజ్వరాలు.. ఇలా జిల్లాను ప్రాణాంతక వ్యాధులు కుదిపేస్తున్నాయి. ఏజెన్సీ, మారుమూల గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాలనూ ఈ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. అనేక గ్రామాల్లో పరిస్థితులు చేజారుతున్నప్పటికీ.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో బ్లీచింగ్ చల్లించి చేతులు దులుపుకొంటున్నారు. వందలాది మంది రోజుల తరబడి జ్వరాలతో బాధపడుతున్నా.. అనేక మంది అంతుచిక్కని రోగాలకు బలవుతున్నా.. జిల్లా యంత్రాంగం సరైన స్థాయిలో స్పందించడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అసాధారణ వాతావరణ పరిస్థితులతో నానాటికీ ప్రాణాంతక వ్యాధులు విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ‘హెల్త్ ఎమర్జెన్సీ’ ప్రకటించాల్సిన ఆవశ్యకతపై ప్రభుత్వం దృష్టి సారించాలన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఎం.కొత్తూరు (రౌతులపూడి) : వారం రోజులుగా ఎం.కొత్తూరు ప్రజలు వ్యాధులతో మంచానపడ్డారు. సుమారు 30 మంది మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాల వంటి ప్రాణాంతక వ్యాధులకు గురై, ఆస్పత్రుల బాటపట్టారు. ఆరోగ్య సిబ్బంది ఇస్తున్న కొద్దిపాటి మందుబిళ్లలతో వ్యాధులు తగ్గుముఖం పట్టడంలేదని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో గత ఆరు మాసాలుగా ఎలాంటి పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టకపోవడంతో క్రిమి కీటకాలు వ్యాపించి, ప్రజలు అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు. వారం రోజులుగా గ్రామానికి చెందిన గిరిజనులు యరగడ చక్రమ్మ, యరగడ దేవి, వంతు దాలియ్యదొర, వంతు చినబుల్లి, గంటిమళ్ల దేవుడమ్మ, వంతు మాతయ్యదొర, గంటిమళ్ల గంగరాజు, యరగడ రాంబాబు తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు. కూలీ పనులు చేసుకునే తాము జ్వరాలతో ఆస్పత్రులకు తిరుగుతూ, పూటగడవక నానా అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మలేరియా లక్షణాలతో యువతి మృతి ఇదే గ్రామానికి చెందిన ఎం.ప్రియ(21) అనే యువతి మలేరియా లక్షణాలతో ఆదివారం రాత్రి మరణించింది. రాఖీ పండగ మరుసుటి రోజు తలనొప్పి, జ్వరం, వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను రౌతులపూడిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తుని, అక్కడి నుంచి విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించిందని ఆమె తండ్రి ఎం.రాజు విలపించాడు. వివాహితను బలిగొన్న డెంగీ మలికిపురం : మలికిపురానికి చెందిన పూసి అనిల్‌కుమారి(35) అనే వివాహిత డెంగీ జ్వరంతో బాధపడుతూ ఆదివారం రాత్రి మరణించింది. రెండు రోజులుగా జ్వరంతో ఉన్న ఆమెను బంధువులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఆమెకు డెంగీ జ్వరమని వైద్యులు తేల్చినట్టు బంధువులు సోమవారం తెలిపారు. కాగా రామరాజులంక, దిండి గ్రామాల్లో కూడా అనేక మంది డెంగీ లక్షణాలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది. సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన కొప్పాడి సిరి(7) వారం రోజుల క్రితం ప్లేట్లెట్లు గణనీయంగా తగ్గి మరణించిన సంగతి విదితమే. బాలికను కాటేసిన డెంగీ? ర్యాలి(ఆత్రేయపురం) : డెంగీ లక్షణాలతో బాధపడుతూ విద్యార్థిని మరణించిన ఉదంతమిది. వివరాల్లోకి వెళితే.. ర్యాలి గ్రామానికి చెందిన కత్తుల సుందరరావు మనవరాలు కుసుమే కీర్తి (15) పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులకు దూరంగా ఆమె కొన్నేళ్లుగా ర్యాలి గ్రామంలో తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటోంది. మూడు నెలల క్రితం ఆమెకు జ్వరం సోకడంతో, పలుచోట్ల చికిత్స చేయించారు. జ్వరం తీవ్రం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైద్యం అందించారు. అప్పటీకీ జ్వరం తగ్గకపోవడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె రక్తంలో ప్లేట్లెట్లు పూర్తి స్థాయిలో తగ్గిపోవడంతో సోమవారం చనిపోయింది. తమ పాపకు డెంగీ సోకడంతోనే మరణించిందని ఆమె బంధువులు చెబుతున్నారు. మూడు నెలల నుంచి విపరీతమైన జ్వరం, ఇతరత్రా శారీరక వ్యాధులు తలెత్తడంతో తమకు దక్కకుండా పోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. డెంగీ అని చెప్పలేం.. ఇటీవల కాలంలో వాతావారణంలో మార్పుల కారణంగా అనేక మంది జ్వరాలు బారిన పడుతున్నారు. నిత్యం జ్వర పీడితులు వైద్యశాలకు వస్తున్నారు. ఎవరికీ డెంగీ లక్షణాలు కనిపించలేదు. కొన్ని విషజ్వరాల వల్ల ప్లేట్లెట్లు తగ్గిపోతాయి. అంతమాత్రాన డెంగీగా నిర్ధారించలేం. మా వైద్యశాలకు డెంగీ కేసులు రాలేదు. – ఝాన్సీలక్ష్మి, వైద్యాధికారి, ర్యాలి -
పట్టుతప్పిన పర్యవేక్షణ
పీహెచ్సీలలో తనిఖీలు కరువు నిర్లక్ష్యం వీడని ఎస్పీహెచ్ఓలు వాహనాల సొమ్ములు సొంతానికి.. ఆరోగ్యశాఖలో అద్దెల అవినీతి వర్షకాలంలోనూ మారని తీరు విష జర్వాలు, రోగాలతో పల్లెలు మంచం పట్టిన తరుణంలోనూ వైద్య ఆరోగ్యశాఖలో పర్యవేక్షణ పట్టు తప్పుతోంది. ప్రాథమిక ఆర్యోగ కేంద్రాల పనితీరును నిత్యం పర్యవేక్షించాల్సిన సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ యూనిట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ’ సాక్షి, హన్మకొండ : వైద్య సేవలు సక్రమంగా, సమర్థంగా అందేందుకు వీలుగా ప్రభుత్వం సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ యూనిట్లను ప్రారంభించింది. జిల్లాలో జనగామ, ములుగు, తొర్రూరు, వర్థన్నపేట, మహబూబూబాద్, పరకాలల్లో మెుత్తం 16 సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ యూనిట్లు ఉన్నాయి. ప్రతీ ఎస్పీహెచ్ఓ యూనిట్లో సీనియర్ వైద్యాధికారి, ఆప్థమాలజిస్ట్, సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, హెల్త్ ఎడ్యుకేటర్లు ఉంటారు. వీరి పరిధిలో కనీసం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలోని సబ్ సెంటర్లు ఉంటాయి. ఎస్పీహెచ్ఓ సిబ్బంది నిత్యం తమ పరిధిలో వైద్య సేవలు సక్రమంగా అందేలా పర్యవేక్షణ చేయాలి. అవసరాన్ని బట్టి అవగాహన సదస్సులు, శిక్షణ శిబిరాలు నిర్వహించాలి. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే 104 సర్వీసులు పర్యవేక్షించాలి. ఈ పనులు చేసేందుకు వీరికి ప్రభుత్వం వాహనం కూడా సమకూరుస్తుంది. తనిఖీల పేరుతో గైర్హాజరు.. తమ పరిధిలో ప్రాథమిక ఆర్యోగ కేంద్రాలను తనిఖీ చేయడానికి వెళ్తున్నామనే నెపంతో జిల్లాలో సగానికిపైగా ఎస్పీహెచ్ఓ యూనిట్ల సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత పనులు చూసుకుంటూ తనిఖీకి వెళ్లామని చెబుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్థన్నపేట ఎస్పీహెచ్ఓగా పని చేస్తున్న సాంబశివరావు పదోన్నతిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఈ ఎస్పీహెచ్ఓ పనితీరు గాడి తప్పింది. నెలలో ఎక్కువ రోజులు తాళం వేసే ఉంటోంది. సగం సొంత వాహనాలే.. ఎస్పీహెచ్ఓలు నిత్యం తనిఖీ చేయాల్సి ఉండటంతో ప్రతీ సెంటర్‌కు ఒక వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ వాహనాల అద్దెకు నెలకు రూ.25000 విడుదల చేసింది. సగం ఎస్పీహెచ్ఓలలో ఈ వాహనాల అద్దె అవినీతికి ఆస్కారం ఇస్తోంది. చాలా మంది సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు సొంత వాహనాలు వినియోగిస్తూ అద్దె వాహనాలుగా రికార్డుల్లో చూపుతూ ప్రభుత్వం చెల్లించే అద్దె డబ్బు జేబుల్లో వేసుకుంటున్నారు. ఇందుకు గాను జిల్లా కేంద్రంలో ఉండే పెద్దలకు ప్రతీ వాహనానికి రూ. 5000 చొప్పున ముడుపులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బడ్జెట్ లేదు ప్రభుత్వం ఎయిర్ వెహికిల్ కేటాయించింది. దీనికి బడ్జెట్ కేటాయించకపోవడంతో పది నెలలుగా ఆ వాహనం రాలేదు. దీంతో నా కారును ఉపయోగించుకోవాల్సి వస్తోంది. గతంలో మహబూబాబాద్‌లో తిరిగిన వాహనం ప్రస్తుతం తొర్రూరులో ఉంది. పి.వెంకటరమణ, మహబూబాబాద్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ సకాలంలో బడ్జెట్ రాకపోవడమే కారణం గత ఎనిమిది నెలల నుంచి అధికారుల వాహనాలకు ప్రభుత్వం నుంచి బడ్జెట్ మంజూరు కాకపోవడంతో ట్రావెల్స్ యజమానులు వాహనాలు అద్దెకు పెట్టడం లేదు. సకాలంలో బడ్జెట్ రాకపోవడం వల్ల కొంత మంది వైద్యాధికారులు సొంత వాహనాలు వాడుకుంటున్నారు ఏదేమైనా సొంత వాహనాలు వాడరాదని స్పష్టమైన అదేశాలు జారీ చేశాం. – డీఎంహెచ్ఓ సాంబశివరావు -
వసతిగృహాల్లో వైద్య శిబిరం
చిట్యాల : మండలంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల, బాలుర వసతి గృహాలు, బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం ఒడితల పీహెచ్సీ డాక్టర్ జడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ నెల 23న ‘హాస్టల్లో ప్రబలుతున్న జ్వరాలు’ అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. దీనికి స్పందించిన హాస్టల్ మ్యాట్రిన్ ప్రశాంతి చిట్యాల, జూకల్లులోని బాలికల హాస్టళ్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిం చారు. 99 మంది బాలికలకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 10 మంది జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు డాక్టర్ శ్రీనివాస్, మ్యాట్రి న్ ప్రశాంతి తెలిపారు. అలాగే మండల కేంద్రంలోని ఎస్సీ, బిసీ బాలుర హాస్టళ్లు, వెలు గు గురుకుల కళాశాలలో వైద్యశిబిరం నిర్వహించి 145 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామని డాక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయ శ్రీ, వార్డెన్లు రాంరెడ్డి, కిషన్‌రావు, ఏపీఎంఓ బుచ్చినర్సయ్య, హెచ్ఈఓ రాజు, హెల్త్ అసిస్టెంట్లు సాంబయ్య, సుభద్ర, ఆరోగ్యమిత్ర వంగ భిక్షపతి పాల్గొన్నారు. -
ఆర్టీసీలో ఎన్నికల కోలాహలం
ఇంటింటా ప్రచారం.. క్రాస్ ఓటింగ్‌పైనే దృష్టి సత్తుపల్లి టౌన్: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం కోలాహలంగా సాగుతోంది. ఎన్నికలకు ఇంకా ఒక్కరోజే గడువు ఉండటంతో నాయకులు, కార్మికులు ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. ఇప్పటికే డిపోల వారీగా జనరల్‌బాడీ సమావేశాలు, ఖమ్మం, మణుగూరులో బహిరంగ సభలు నిర్వహించారు. ఆ సభలకు స్థానిక డిపోల నుంచి ముఖ్య నాయకులను తరలించి తమ ఓటు బ్యాంక్ చెదిరిపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. జిల్లాలో కూటమి బలంగా ఉండటంతో రాష్ట్ర స్థాయిలో తమ సంఘాన్ని బలపరిచే విధంగా కార్మికులను క్రాస్ ఓటింగ్ చేయించే పనిలో నిమగ్నమయ్యారు. అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న టీఎంయూకు గత ఎన్నికల్లో ప్రస్తుత నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లాలో ప్రచారం నిర్వహించారు. కానీ ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు దూరంగానే ఉండటం ఆ కార్మిక వర్గంలో నైరాశ్యం కలిగిస్తోంది. కనీసం స్థానిక పార్టీ శ్రేణులైన తమకు సంఘీభావం తెలపక పోవటం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధినేత కేసీఆర్ అండ అన్ని విధాలా ఉంటుందని, భవిష్యత్‌తో కార్మికులకు తమ సంఘం వల్లే ప్రయోజనాలు చేకూరుతాయని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇతర సంఘాలలోని కార్మికులతో క్రాస్ ఓటింగ్ ద్వారా రాష్ట్ర స్థాయిలో సంఘాన్ని బలపరిచే విధంగా ఓటింగ్ కోసం ఇంటింటా ప్రచారాన్ని కూడా చేపట్టారు. పోటీలో ఉన్న సంఘాలు విందు రాజకీయాలతో కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు సన్నద్ధమౌతున్నారు. -
విషజ్వరంతో చిన్నారి మృతి
వైఎస్సార్ జిల్లా: వేంపల్లె పట్టణంలోని వైఎస్ మదీనాపురంలో విషజ్వరంతో మొబీనా అనే ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఆర్థిక స్తోమత లేకపోవటంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం 3 గంటలకు ఆ చిన్నారి మృతి చెందింది. మృతికి కారణం డెంగీనా లేక టైఫాయిడా అనేది డాక్టర్లు ధృవీకరించలేదు. (వేంపల్లె) -
'509 మందికి స్వైన్ ఫ్లూ'
హైదరాబాద్: ఈనెలలో మొత్తం 1398 మందిపై వైద్యపరీక్షలు నిర్వహిస్తే వారిలో 509 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు తేలిందని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. గురువారం రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ తీవ్రతపై ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడి 21 మంది మృతిచెందారన్నారు. బుధవారం జరిపిన పరీక్షల్లో మొత్తం 101 మందికి పరీక్షలు నిర్వహిస్తే వారిలో 42 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు ,నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ ప్రభావం తగ్గుముఖం పట్టిందన్నారు. స్వైన్ ఫ్లూ లక్షణాలను వివరిస్తూ..ఎవరికైనా జ్వరంతో కూడిన జలుబు, ఒళ్లు నొప్పులు ఉన్నట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. స్వైన్ ఫ్లూ నివారణకు హోమియో మందులు కూడా ఉపయోగించవచ్చని సూచించారు.