ఆర్టీసీ డిపోలో ప్రచారం చేస్తున్న కార్మికులు
- ఇంటింటా ప్రచారం..
- క్రాస్ ఓటింగ్‌పైనే దృష్టి
సత్తుపల్లి టౌన్: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం కోలాహలంగా సాగుతోంది. ఎన్నికలకు ఇంకా ఒక్కరోజే గడువు ఉండటంతో నాయకులు, కార్మికులు ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. ఇప్పటికే డిపోల వారీగా జనరల్‌బాడీ సమావేశాలు, ఖమ్మం, మణుగూరులో బహిరంగ సభలు నిర్వహించారు. ఆ సభలకు స్థానిక డిపోల నుంచి ముఖ్య నాయకులను తరలించి తమ ఓటు బ్యాంక్ చెదిరిపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. జిల్లాలో కూటమి బలంగా ఉండటంతో రాష్ట్ర స్థాయిలో తమ సంఘాన్ని బలపరిచే విధంగా కార్మికులను క్రాస్ ఓటింగ్ చేయించే పనిలో నిమగ్నమయ్యారు. అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న టీఎంయూకు గత ఎన్నికల్లో ప్రస్తుత నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లాలో ప్రచారం నిర్వహించారు. కానీ ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు దూరంగానే ఉండటం ఆ కార్మిక వర్గంలో నైరాశ్యం కలిగిస్తోంది. కనీసం స్థానిక పార్టీ శ్రేణులైన తమకు సంఘీభావం తెలపక పోవటం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధినేత కేసీఆర్ అండ అన్ని విధాలా ఉంటుందని, భవిష్యత్‌తో కార్మికులకు తమ సంఘం వల్లే ప్రయోజనాలు చేకూరుతాయని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇతర సంఘాలలోని కార్మికులతో క్రాస్ ఓటింగ్ ద్వారా రాష్ట్ర స్థాయిలో సంఘాన్ని బలపరిచే విధంగా ఓటింగ్ కోసం ఇంటింటా ప్రచారాన్ని కూడా చేపట్టారు. పోటీలో ఉన్న సంఘాలు విందు రాజకీయాలతో కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు సన్నద్ధమౌతున్నారు.