ఆసర ఇవ్వని పెసర
- లభించని మద్దతు ధర
- పంట దళారుల పాలు
- ఆరుగాలం కష్టించినా ఫలితం శూన్యం
- సర్కారే కొనుగోలు చేయాలని రైతుల వేడుకోలు
పెద్దశంకరంపేట:ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు సరియైన మద్దతు ధర లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా పంటలను పండించి మార్కెట్‌కు తీసుకువస్తే.. ఇక్కడి ధరలను చూసి లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ ధరకు, మార్కెట్ ధరకు చాలా వ్యత్యాసం ఉండడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అసలే కరువు ఛాయలు, ఆపై అప్పుల వాళ్ల బెడదతో విధిలేక వచ్చిన ధరకే అమ్ముకుంటున్నారు. ఫలితంగా తీవ్రంగా నష్టపోతున్నారు.
జిల్లాలో ఎక్కడా పెసర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో దళారులకే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం మార్కెట్‌లో పప్పు కిలో ధర రూ.100కు తక్కువగా లేదు. కానీ రైతులు తెచ్చిన పంటకు మాత్రం కిలోకు రూ.45 కూడా రావడం లేదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. సరియైన మద్దతు ధర లేక పోవడమే కారణం. గత ఏడాది పెసర క్వింటాలుకు రూ. 9 వేల నుంచి 10 వేల వరకు పలికింది. ప్రస్తుతం పంటలు చేతికి వచ్చే సమయంలో మార్కెట్ ధరకు, రైతులు అమ్మే ధరకు ఎక్కడా పొంతనా లేదు. ప్రభుత్వం నిర్దేశిత ధరను ఏర్పాటు చేస్తే తప్ప రైతులకు లాభం చేకూరేపరిస్థితి లేదు.
ఆరుతడి పంటలపై చూపు
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల 23 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల జిల్లాలో 14 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇలా పేట మండలంలో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడా చెరువులు, కుంటలు నిండలేదు. దీని వల్ల రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలనే సాగు చేశారు. వచ్చిన ఈ అరకొర పంటలను కూడా అమ్ముకుందామంటే మద్దతు ధర రాక రైతులు విలవిలలాడుతున్నారు.
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
పెసర పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఆయా మండలాల్లో పంటల దిగుబడిని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.