the farmers
-
‘మూడ్రోజుల్లో ఇస్తామని మూడు నెలలైనా ఇవ్వరా?’
సాక్షి, హైదరాబాద్: మూడు రోజుల్లో డబ్బులు వస్తాయన్న ఆశతో 6.25 లక్షల మంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే మూడు నెలలవుతున్నా ఇంతవరకు చెల్లింపులు చేయకపోవడం దారుణమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రబీ ధాన్యం కొనుగోళ్ల కింద 3.5 లక్షల మంది రైతులకు రూ.1,900 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఈ డబ్బులు ప్రభుత్వం ఇవ్వకపోతే రైతులు ఖరీఫ్ ఎలా సాగుచేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. పెట్టుబడుల కింద వాడుకునేందుకు 4 రోజుల్లో ఆ డబ్బులు ప్రభుత్వం విడుదల చేయాలని కోమటిరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
‘బీమా’ బాసట
సాక్షి, హైదరాబాద్: వివిధ కారణాలతో అకాల మరణం పొందే రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతుబీమా’ పథకం ఇప్పటివరకు పది వేలకు పైగా కుటుంబాలకు భరోసా కల్పించింది. బీమా పథకం కింద లబ్ది పొందిన వారిలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులే ఉండగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 10,012 కుటుంబాలకు రైతు బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరగా, క్లెయిమ్‌ల రూపంలో 500.60 కోట్లు నామినీల ఖాతాలకు జమ చేశారు. రైతు బీమా పథకం కింద లబ్ధిపొందిన రైతు కుటుంబాల్లో 91శాతం మేర కేవలం ఐదు ఎకరాలలోపు భూ విస్తీర్ణం కలిగినవారే ఉండటం గమనార్హం. లబ్ధిపొందిన కుటుంబాల్లో అత్యధికంగా బీసీలు 51శాతం మంది ఉన్నారు. దళారీల ప్రమేయం లేకుండా బీమా పరిహారంకోసం దరఖాస్తు చేయడం మొదలుకుని, బీమా సొమ్మును నేరుగా నామినీ ఖాతాకు ఆన్లైన్ విధానంలో బదిలీ చేస్తున్నారు. రైతు బీమా సొమ్మును బాధిత కుటుంబాలు భవిష్యత్తు అవసరాలు, జీవనోపాధి కోసం వినియోగించుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. 29.58 లక్షల కుటుంబాలకు బీమా రాష్ట్రంలో 90 శాతానికి పైగా రైతులకు ఐదు ఎకరాలలోపు భూ విస్తీర్ణం ఉండగా, వీరికి ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం. ప్రమాదవశాత్తూ లేదా అనారోగ్యంతో రైతు మరణిస్తే.. అతనిపై ఆధారపడిన కుటుంబం రోజువారీ జీవనానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 29.58 లక్షల మంది 18–59 సంవత్సరాల వయసు కలిగిన రైతుల కోసం ప్రభుత్వం ‘రైతు బీమా’ పథకాన్ని 2018 ఆగస్టులో ప్రారంభించింది. ఈ పథకం అమలుకోసం ఒక్కో రైతుకు రూ.2,271.50 చొప్పున రూ.672 కోట్ల ప్రీమియంను జీవిత బీమా సంస్థ ఎల్ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. బాధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారాన్ని చెల్లిస్తోంది. -
ఆసర ఇవ్వని పెసర
లభించని మద్దతు ధర పంట దళారుల పాలు ఆరుగాలం కష్టించినా ఫలితం శూన్యం సర్కారే కొనుగోలు చేయాలని రైతుల వేడుకోలు పెద్దశంకరంపేట:ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు సరియైన మద్దతు ధర లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా పంటలను పండించి మార్కెట్‌కు తీసుకువస్తే.. ఇక్కడి ధరలను చూసి లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ ధరకు, మార్కెట్ ధరకు చాలా వ్యత్యాసం ఉండడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అసలే కరువు ఛాయలు, ఆపై అప్పుల వాళ్ల బెడదతో విధిలేక వచ్చిన ధరకే అమ్ముకుంటున్నారు. ఫలితంగా తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో ఎక్కడా పెసర కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో దళారులకే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం మార్కెట్లో పప్పు కిలో ధర రూ.100కు తక్కువగా లేదు. కానీ రైతులు తెచ్చిన పంటకు మాత్రం కిలోకు రూ.45 కూడా రావడం లేదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. సరియైన మద్దతు ధర లేక పోవడమే కారణం. గత ఏడాది పెసర క్వింటాలుకు రూ. 9 వేల నుంచి 10 వేల వరకు పలికింది. ప్రస్తుతం పంటలు చేతికి వచ్చే సమయంలో మార్కెట్ ధరకు, రైతులు అమ్మే ధరకు ఎక్కడా పొంతనా లేదు. ప్రభుత్వం నిర్దేశిత ధరను ఏర్పాటు చేస్తే తప్ప రైతులకు లాభం చేకూరేపరిస్థితి లేదు. ఆరుతడి పంటలపై చూపు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల 23 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల జిల్లాలో 14 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇలా పేట మండలంలో కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడా చెరువులు, కుంటలు నిండలేదు. దీని వల్ల రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలనే సాగు చేశారు. వచ్చిన ఈ అరకొర పంటలను కూడా అమ్ముకుందామంటే మద్దతు ధర రాక రైతులు విలవిలలాడుతున్నారు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి పెసర పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఆయా మండలాల్లో పంటల దిగుబడిని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. -
అవే కడ‘గండ్లు’
మరమ్మతులకు నోచుకోని గండ్లు పడ్డ నదుల గట్లు ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు, పాలకులు నిలిచిపోయిన నిధులు : పట్టించుకోని కొత్త సర్కారు తుపానుతో ఆందోళన చెందుతున్న పరివాహక ప్రాంత ప్రజలు చోడవరం: గతంలో వచ్చిన తుపానులకు గండ్లు పడిన నదుల గట్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఏర్పడిన హుదూద్ తుపానుకు రైతులు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మూడేళ్లుగా లైలా, జల్, నీలం, పైలీన్ తుపాన్లకు పెద్దేరు, బొడ్డేరు, శారద నదులతోపాటు పలు కొండ గెడ్డలకు గండ్లు పడిన విషయం తెలిసిందే. ఈ గండ్లు నేటికీ పూడ్చకపోవడంతో ఇప్పుడు హుదూద్ తుపాను ఎక్కడ గ్రామాలను, పొలాలను ముంచేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. గత తుపాన్లకు పీఎస్‌పేట, వడ్డాది, జన్నవరం, రామజోగిపాలెం, చాకిపల్లి, భోగాపురం, బోయిలకింతాడ, గవరవరం, విజెపురం, కెజెపురం, జంపెన ప్రాంతాల్లో నదీగట్లు కోతకు గురయ్యాయి. దీంతో చాకిపల్లి, రామజోగిపాలెం, కన్నంపాలెం, జన్నవరం గ్రామాల్లోకి నీరు వచ్చింది. వేలాది ఎకరాల పొలాలు, ఆయా గ్రామాలు కూడా ముంపునకు గురయ్యాయి. నది గట్ల మరమ్మతులకు సుమారు రూ.100 కోట్లు మంజూరు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఆ నిధుల ఎన్నికలు కారణంగా నిలిచిపోగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం విడుదల చేయలేదు. దీనితో ఇప్పటి వరకు దెబ్బతిన్న గ్రోయిన్లు, గండ్లు పడ్డ గట్లు పటిష్ట పరిచే పనులు జరగలేదు. ఇప్పుడు తాజాగా ముంచుకొస్తున్న హుదూద్ తుపాను మరింత బలపడితే మళ్లీ గ్రామాలు, పంటపొలాలు మునిగిపోయే ప్రమాదం ఉందని నదీ పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతాలను చోడవరం తహశీల్దార్ శేషశైలజ శనివారం పరిశీలించారు. గండ్లు పడ్డ ప్రదేశాల్లో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆమె సూచించారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అధికారులు, రాజకీయ నాయకులు రావడం సూచనలు ఇవ్వడం వెళ్లిపోవడం తప్ప పూర్తిస్థాయిలో గట్లు పటిష ్టపరిచే పనులు చేపట్టలే దంటూ ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులను వెంటనే విడుదల చేసి పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. -
చెరువులో రోడ్డు పనులను అడ్డుకున్న రైతులు
రైల్వేకోడూరురూరల్ : రైల్వేకోడూరు మండల పరిధిలోని బొజ్జవారిపల్లె సమీపంలోని జమ్మికుంట చెరువులో చేస్తున్న రోడ్డు పనులను రైతులు అడ్డుకున్నారు. ఇక్కడ రాజకీయంగా ఎదుగుతున్న ఓ నాయకుడు జేసీబీ ద్వారా ఫార్మేషన్ రోడ్డును వేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు రోడ్డు పనులు పూర్తికాకుండా అడ్డుకున్నారు. చెరువు మధ్యలో రోడ్డు వేసేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారని ఓ ఇంజనీర్‌ను అడిగారు. తనకు సంబంధం లేదని ఆయన చెప్పారు. దీంతో ఆ గ్రామానికి చెందిన రైతులు సూర్యనారాయణ, గోపాల్, ఎన్.వెంకటేష్, కొమ్మా యానాదయ్య, పుల్లయ్య, బీ.చిన్నయ్య తదితర రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వారు విలేకరులకు జరిగిన విషయాన్ని వివరించారు. బొజ్జవారిపల్లె పంచాయితీలోని జమ్మికుంట చెరువులో వేసిన రోడ్డును చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చెరువు సుమారు 90 ఎకరాల విస్తీర్ణం ఉందన్నారు. దీని కింద వ్యవసాయ భూములు సాగులో ఉన్నాయన్నారు. చెరువు నిండితే నీళ్లు పుష్కలంగా ఉండి పంటలు బాగా పండుతాయన్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి చెరువు నిండిన పాపాన పోలేదన్నారు. ఉన్న చెరువును దాదాపు సగం వరకు కొందరు రైతులు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారన్నారు. ఇదిలా ఉండగా స్థానిక నాయకుడు ఒకరు రైతులు ఆక్రమించుకున్న భూమిని వదిలి దానికి పక్కనే రోడ్డు వేసేందుకు చదును చేశారని తెలిపారు. ఇలా చేయడం వలన రోడ్డుకు ఇటు వైపు ఉన్న భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు పూర్తిగా వేస్తే చెరువులో సగభాగం భూమి కబ్జాకు గురై చెరువు విస్తీర్ణం తగ్గి నీళ్లు నిలబడే అవకాశం ఉండదన్నారు. దాని వలన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అధికారులు స్పందించి చెరువుకు కొలతలు వేయించి న్యాయం చేయాలని కోరారు.