చెరువులో రోడ్డు పనులను అడ్డుకున్న రైతులు
రైల్వేకోడూరురూరల్ : రైల్వేకోడూరు మండల పరిధిలోని బొజ్జవారిపల్లె సమీపంలోని జమ్మికుంట చెరువులో చేస్తున్న రోడ్డు పనులను రైతులు అడ్డుకున్నారు. ఇక్కడ రాజకీయంగా ఎదుగుతున్న ఓ నాయకుడు జేసీబీ ద్వారా ఫార్మేషన్ రోడ్డును వేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు రోడ్డు పనులు పూర్తికాకుండా అడ్డుకున్నారు. చెరువు మధ్యలో రోడ్డు వేసేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారని ఓ ఇంజనీర్‌ను అడిగారు. తనకు సంబంధం లేదని ఆయన చెప్పారు. దీంతో ఆ గ్రామానికి చెందిన రైతులు సూర్యనారాయణ, గోపాల్, ఎన్.వెంకటేష్, కొమ్మా యానాదయ్య, పుల్లయ్య, బీ.చిన్నయ్య తదితర రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వారు విలేకరులకు జరిగిన విషయాన్ని వివరించారు. బొజ్జవారిపల్లె పంచాయితీలోని జమ్మికుంట చెరువులో వేసిన రోడ్డును చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చెరువు సుమారు 90 ఎకరాల విస్తీర్ణం ఉందన్నారు. దీని కింద వ్యవసాయ భూములు సాగులో ఉన్నాయన్నారు. చెరువు నిండితే నీళ్లు పుష్కలంగా ఉండి పంటలు బాగా పండుతాయన్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి చెరువు నిండిన పాపాన పోలేదన్నారు. ఉన్న చెరువును దాదాపు సగం వరకు కొందరు రైతులు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారన్నారు. ఇదిలా ఉండగా స్థానిక నాయకుడు ఒకరు రైతులు ఆక్రమించుకున్న భూమిని వదిలి దానికి పక్కనే రోడ్డు వేసేందుకు చదును చేశారని తెలిపారు. ఇలా చేయడం వలన రోడ్డుకు ఇటు వైపు ఉన్న భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు పూర్తిగా వేస్తే చెరువులో సగభాగం భూమి కబ్జాకు గురై చెరువు విస్తీర్ణం తగ్గి నీళ్లు నిలబడే అవకాశం ఉండదన్నారు. దాని వలన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అధికారులు స్పందించి చెరువుకు కొలతలు వేయించి న్యాయం చేయాలని కోరారు.