
పెసర.. ఎంతో ఆసర
- సాగు.. భలే బాగు
- సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
- తెగుళ్ల నివారణే ముఖ్యం
- సకాలంలో స్పందించకుంటే పంటకు తీవ్ర నష్టం
- : ఏడీఏ.వినోద్‌కుమార్
జహీరాబాద్ టౌన్: రైతులు ఈ సారి ఖరీఫ్ సీజన్‌లో సోయాబిన్, పత్తి, కంది తదితర పంటలతో పాటు పెసర పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అడపా దడపా వానలు కురుస్తుండటంతో పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కాత గట్టి పడుతోంది. అయితే తెగుళ్లు బెడద ఎక్కువైంది. పంట కాత దశలో ఉండగా తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గే అవకాశం ఉందని జహీరాబాద్ వ్యవసాయ డివిజన్ ఏడీఏ వినోద్‌కుమార్ (8886612477) తెలిపారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడుతే అధిక దిగుబడి వస్తుందన్నారు. పెసర పంటలో తెగుళ్ల నివారణ చర్యల గురించి ఆయన వివరించారు.
పెసరలో రకాలు:
* జహీరాబాద్ ప్రాంత నేలకు ఎల్‌జీజీ 407, ఎల్‌జీజీ 450, ఎల్‌జీజీ 460,టీఎం 92 రకాలు అనుకూలం
* వాన కాలం ప్రారంభంలో తొలకరి వర్షాలు కురిసిన తరువాత నేలలో తేమ చేరినప్పుడు విత్తనాలు నాటాలి.
* ఎకరాకు 10-12 కిలోల విత్తనాలు అవసరం.
* వరి పంట సాగుచేసిన పొలంలో పెసర పంట వేసుకోవచ్చు
* వరి పంటకు వేసిన ఎరువులు నేలల్లో నిలువ ఉంటాయి కాబట్టి పెసరకు ప్రత్యేకంగా ఎరువులు వేయాల్సిన అవసరం లేదు.
*పచ్చి రొట్టె దున్నిన పొలంలో పెసర పంట వేస్తే పెద్దగా ఎరువుల అవసరం ఉండదు.
* పెసర పైరు 25-30 రోజలు ఉన్నప్పుడు ఎకరాకు 10-15 కిలోల యూరియా వేయాలి.
*పెసర రకాన్ని బట్టి 60-70 రోజుల్లో అధిక శాతం కాత ఎండి కోతకు వస్తుంది.
తెగులు నివారణ:
* పెసర పంటకు తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది.
*మారుక మచ్చ పురుగును పూత పురుగు లేదా గూడ పురుగు, బూజు పురుగు కూడా పిలుస్తారు.
* మారుక మచ్చ పిల్ల పురుగులు మొగ్గలోకి చొచ్చుకపోయి లోపలిభాగాలను తింటాయి.తరువాత దశలో లేత ఆకులను, లేత పిందెలను, కాయలను కలిపి గూడుగా చేసుకుంటాయి.
* గూడు లోపలనే ఉంటూ లోపలి పదార్థాలను తినడ వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.
*కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి Ððవెళ్లి కాయలోని గింజలను తిని డొల్లగా మారుస్తుంది.
* అందుకని పూత దశలో పైరుకు ఐదుశాతం వేప గింజల కషాయం లేదా 5 మి.లీ. వేప నూనేను లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
*ఇలా చేయడం వల్ల తల్లి పురుగులు గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు.
* పిల్ల పురుగులు అధికంగా ఉంటే లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా థయోగికార్బ్ గ్రాము లేక ఎసిఫేట్ గ్రాము చొప్పున కలిపి పంటకు పిచికారి చేయాలి.
*పంటలో గూళ్లు కనిపిస్తే లీటరు నీటికి ఎసిఫెట్ 1.5 మి.లీ లేదా నోవాల్యురాన్ 75 మి.లీ. మందుతో మి.లీ డైక్లోరోవాస్‌ను కలిపి పైరుపై పిచికారి చేయాలి.
* పురుగు ఉధృతి అధికంగా ఉంటే స్పైనోసాడ్ 0.4 మి.లీ లేదా ఇమామిక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ప్లూబెండ్‌మైడ్ 0.3 మి.లీ చోప్పున లీటరు నీటిని కలిపి పంటపై పిచికారి చేయాలి.
పొగాకు లద్దె పురుగు:
*ఈ పురుగు పెసర పంట ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీకి తింటాయి.
* దీంతో ఆకులు జల్లడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రం చేసి పువ్వులను పిందెలాను తింటాయి.
* పొగాకు లద్దె పురుగు రాత్రి పూట ఆశిస్తాయి. పగలు మొక్కల మొదళ్లో, పొలం నెర్రల్లో ఉంటాయి.
*ఈ పురుగు నివారణకు మోనోక్రోటీపాస్ 1.5 మి.లీ లేదా క్లోరీపైరి ఫాస్ 2.5 మి.లీ నిటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
ఎల్లో మొజాయిక్ తెగులు:
* తెల్లదొమ నుంచి ఈ తెగులు ఆశిస్తుంది.ఈ తెగుల కారణంగా మొక్క ఆకులు, కాయల మీద పసుపు పచ్చ పొడలు ఏర్పాడుతాయి. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది.
*పెసర పంటకు ఈ తెగులు ఆశిస్తే లీటరు నీటిలో 1.6 మిలీ మెనోక్రాటోఫాస్, లేదా 2 మి.లీ డైమిథోయేట్ చొప్పున కలిపి పిచికారి చేయాలి