న్యాయం చేయండి
= కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ
= ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు
= ఓ తల్లి ఆవేదన
ఓడీ చెరువు : తన కూతుర్ని వేధింపులకు గురి చేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త, అత్తమామలను అరెస్టు చేసి న్యాయం చేయాలని ఓ తల్లి వాపోయింది. ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె వాపోయింది. స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయం ఎదుట శుక్రవారం ఓడీచెరువుకు చెందిన తుమ్మల శివమ్మ తన కుమార్తెలు స్వాతి, గాయత్రితో కలసి విలేకరుల ఎదుట వాపోయారు. ఆమె తెలిపిన వివరాలు.. ‘2013లో చిన్నకుమార్తె ఐశ్వర్యను ఓడీసీ మండలం ఆకుతోటపల్లికి చెందిన సద్దల రంగారెడ్డి కుమారుడు నారాయణరెడ్డికి ఇచ్చి వివాహం చేశాం.
రెండేళ్లు వారి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత కుమార్తెను భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చే సేవారు. పలుమార్లు పుట్టింటికి రావడంతో కుమార్తెకు సర్దిచెబుతూ కాపురానికి పంపించాం. ఈనేపథ్యంలో ఈ నెల 12న ఇంట్లో విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని వారు తెలిపారు. అయితే వారి వేధింపులకు తాళలేకే కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని, వారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని పోలీసులకు ఆరోజే ఫిర్యాదు చేశాం.
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పదిహేను రోజులు అవుతున్నా ఇప్పటి వరకు వారిని అరెస్ట్ చేయలేదు. పోలీసులు కేసును నీరు కారుస్తున్నారు. మాకు న్యాయం జరగటం లేదు’ అంటూ ఆమె కన్నీటి పర్యంతమయింది. తమ కూతురి చావుకు కారకులైన భర్త, అత్తమామలను వెంటనే అరెస్ట్ చేసి మాకు న్యాయం జరిగేలా చూడాలని ఉన్నతాధికారుల వద్దకు వెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. అమడగూరుకు వెళ్తున్న మంత్రి పల్లె రఘునాథరెడ్డికి తమ గోడును వినిపించానని ఆమె తెలిపింది.