అన్నీ.. అమ్మే
- పిల్లల చదువుల వెనక తల్లి శ్రమే ఎక్కువ
- ఆలనాపాలనలో అగ్రభాగం
- హోం వర్క్‌లో పూర్తి భాగస్వామ్యం
సదాశివపేట రూరల్: పిల్లలు బడికి వెళ్లి ఇంటికి వచ్చే సరికి అలసిపోవడం, కొద్దిసేపు ఆడకుంటామని బయటికి వెళ్తుంటారు. సాయంత్రం అయ్యిందంటే చాలు తల్లులు తమ ఇంటి పనులు త్వరగా ముగించుకొని పిల్లలను ముందు కూర్చోబెట్టుకొని హోం వర్క్ చేయిస్తారు. ఈ రోజుల్లో కనీసం ఇంటర్మీడియెట్, డిగ్రీ వరకు చదువుకున్న వారు అమ్మలే ఉండడంతో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదువుతున్న తమ పిల్లలను ట్యూషన్లకు పంపించకుండా ఇంటి దగ్గరే కూర్చుని హోం వర్క్ చేయిస్తున్నారు.
చిన్న తనంలో తమ పిల్లలు హోం వర్క్ చేయడానికి కూడా సతాయిస్తున్నా సముదాయిస్తూ వారి చేయి పట్టుకొని హోం వర్క్ పూర్తయ్యేలా చూస్తారు. కొందరు పిల్లలు హోం వర్క్ పూర్తి చేసేందుకు అపసోపాలు పడి పూర్తవ్వగానే పుస్తకాలు, నోటు పుస్తకాలను చెల్లాచెదరుగా అలాగే వదిలేసి ఆడుకొనేందుకు బయటకు పరిగెత్తుతారు.
వాటన్నింటినీ సరిచేసి బ్యాగుల్లో పెట్టడం కూడా తల్లుల వంతే. ఇక పిల్లలు ప్రాథమిక, ఉన్నత స్థాయిల్లో చదువుతుంటే వారిని ట్యూషన్లకు పంపించడం, అక్కడి నుంచి రాగానే ఏమేమి చెప్పారని అడగడం, హోం వర్క్ పూర్తి చేశావా...? అని ఆరా తీయడం, మార్కెట్లో లభించే వివిధ కంపెనీల శక్తినిచ్చే పౌడర్లను పాలల్లో కలిపి తాగించడం ఒక్కటేమిటి వారిని నిద్రపుచ్చే వరకూ ప్రతి చిన్న పనికి పిల్లలు తల్లుల పైనే ఆధారపడతారు.
పిల్లల దుస్తులు శుభ్రం చేయడం దగ్గర నుంచి ఐరన్ చేసి మరీ పరిశుభ్రంగా కనిపించేలా చూడడం వరకు తల్లులు మరింత జాగ్రత్త తీసకుంటారు. అంతేకాదు పిల్లలకు ర్యాంకులు వస్తే ముందుగా మురిసిపోయేది తల్లులే. పిల్లల చదువుల్లో తల్లుల పాత్ర కూడా పెరగడంతో ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయిలో కూడా తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా తప్పకుండా దరఖాస్తు ఫారాల్లో రాయాల్సిందిగా నిబంధనలు పెట్టారు.
కొన్ని పాఠశాలల్లో తల్లుల పేర్లు, ఫోన్ నంబర్లను కూడా తీసుకుంటున్నారు. జన్మనిచ్చే మాతృమూర్తే ప్రథమ గురువు అని చెప్పడమే కాదు, అక్షర సత్యం కూడా... చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలోనే తమ పిల్లలకు తమ చుట్టాలు, ఇరుగు పొరుగు వారిని ఏ వరుసలు పెట్టి పిలవాలో నేర్పించేది తల్లే. పిల్లలకు ముందుగా వచ్చీరాని మాటల దగ్గర నుంచి మొదలుకొని సంస్కారవంతమైన చక్కటి అలవాట్లను నేర్పించడంలో తల్లి పాత్ర కీలకమైంది.
ఇక నేటి కంప్యూటర్ యుగంలో మూడేళ్ల వయసు వచ్చిందంటే చాలు పిల్లల్నీ ప్లే స్కూల్ అని, ఇతర ఆటలు ఆడించే పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. అక్కడ్నుంచి ప్రారంభమవుతుంది పిల్లల చదువే కాదు... తల్లుల చదువు కూడా. సాధారణంగా చిన్నారులకు పాఠశాలలు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతాయి. అంటే వారిని కనీసం 8 గంటలకు తయారుచేసి సిద్ధంగా ఉంచాలి.
అందుకు తల్లులు తెల్లవారు జామున మేల్కొనడంతో ప్రారంభమయ్యే ఇంటి పనులు త్వరగా పూర్తి చేసుకొని తమ పిల్లలకు నీళ్లు వేడి చేయడం దగ్గర నుంచి స్నానాలు చేయించడం, దుస్తులు వేయడం, టై, బెల్టు పెట్టడంతో పాటు పలక, బలపం, కొద్దిగా ప్రాథమిక స్థాయిలో అన్ని పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు బ్యాగులో ఉన్నాయా.. లేవా... పెన్సిల్, రబ్బర్లన్నింటినీ ఒక సారి సరిచూసి బ్యాగు సిద్ధం చేయడం వరకూ అన్నీ వారి వంతే. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచీ పిల్లలు బడికి వెళ్లే వరకూ కనీసం పది నిమిషాలు కూర్చోవడానికి కూడా సమయం లేకుండా పని చేయడం తల్లులకు తప్పని పరిస్థితి.
సుఖసంతోషాలతో ఉండాలనే తపన
మేం ఏం చేసినా మా పిల్లల గురించే. సమాజంలో ఆత్మగౌరవడంతో ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరిక. మా పిల్లల ముఖాల్లో కనబడే చిరునవ్వు ముందు బాధలు, కష్టాలన్నీ బలాదూరే. మా జీవితాల్లా కాకుండా మా కన్నా మంచి జీవితాలను గడపాలన్నదే మా తపన. వారి సంతోషమే మా సంతోషం. – మంజూదేవి, ఓ చిన్నారి తల్లి
పిల్లల భవిష్యత్తే ముఖ్యం
మా పిల్లలు మా లాగా కాకుండా వారి భవిష్యత్తు బాగుండాలి. భవిష్యత్తులో వారి ఉన్నత స్థానంలో చూడాలనే తపన, ప్రేరణ ఉంటుంది. వారు ఎంత ఇబ్బంది పెట్టినా... మారాం చేసినా కోపం రాదు. పిల్లల ఆనందమే మా ఆనందం. మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదనే తాపత్రయం. పిల్లలను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేం. – బి. శోభారాణి, ఓ చిన్నారి తల్లి