Sadasivapeta
-
డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదురవడంతో పిల్లలను పోషించలేక వారికి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి నవ్వుతూ తాగండర్రా అంటూ చెప్పి ఆపై ఆయన కూడా తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అయితే తాగిన వెంటనే తప్పు చేశామని భావించి వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పాడు. వాళ్లు వెంటనే ఆస్పతత్రికి తరలించడంతో ఇద్దరు ప్రాణాలు దక్కగా ఒకరి ప్రాణం పోయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో చోటుచేసుకుంది. ఆత్మకూర్ గ్రామానికి చెందిన శివకుమార్, లలిత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు నవ్యశ్రీ (4), సిరి (5) ఉన్నారు. వీరు హైదరాబాద్‌లో నివసిస్తుండేవారు. అయితే ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం మళ్లీ గొడవ జరగడంతో భర్త శివకుమార్ పిల్లలను తీసుకుని హైదరాబాద్ నుంచి స్వగగ్రామం ఆత్మకూర్‌కు వచ్చాడు. రాత్రి కూల్‌డ్రింక్స్‌లో విష గుళికలు కలిపేశాడు. పిల్లలకు తాగించిన అనంతరం ఆయన కూడా తాగాడు. అనంతరం బయటకు వెళ్లి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చి చూడగా పిల్లలు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. దీంతో ఆందోళన చెందిన శివకుమార్ వెంటనే తాను చేసిన పనిని కుటుంబసభ్యులకు చెప్పాడు. వెంటనే కుటుంబసభ్యులు పిల్లలను, అతడిని ఆస్పతత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే నవ్యశ్రీ మృతి చెందింది. సిరి, శివకుమార్ ప్రాణాపాయంతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోశ్‌కుమార్ తెలిపారు. చదవండి: సెల్ఫీ తీసుకుంటూ ఫోన్‌తో నీటిలోకి కొట్టుకుపోయిన బాలుడు -
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో దారుణం
-
మృత్యువులోనూ వీడని బంధం
సదాశివపేట: ఆ భార్యాభర్తలను మృత్యువు కబళించింది. హైదరాబాద్‌లో షాపింగ్ చేయడానికి సదాశివపేట నుంచి ఇద్దరు కొడుకులు, కోడలుతో కలిసి పయనమైన వారి వాహనాన్ని ప్రమాదం వెంటాడింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో క్లాస్‌వన్ కాంట్రాక్టర్ పిల్లిగుండ్ల నారాయణగౌడ్, ఆయన భార్య సత్యమ్మ దుర్మరణం పాలయ్యారు. వీరి మరణవార్త తెలియడంతో స్వగ్రామమైన సదాశివపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం వీరు వెళుతున్న వాహనం పల్టీకొట్టడంతోప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నారాయణగౌడ్, సత్యమ్మ దంపతుల పెద్ద కొడుకు భాస్కర్‌గౌడ్, అతడి భార్య హారిక, రెండో కొడుకు భరత్‌గౌడ్, వాహనం డ్రైవర్ మధుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు నారాయణగౌడ్, మృతురాలు సత్యమ్మ, కొడుకులు, కోడలు, మనవడు, మనవరాలితో కలిసి పార్చునర్ వాహనంలో ఆదివారం ఉదయం సదాశివపేట పట్టణంలోని స్వగృహం నుంచి బయలుదేరారు. సంగారెడ్డిలోని వైకుంఠ పురం శ్రీ గోదాసమేత లక్ష్మీ విరాట్ వెంకటేశ్వరస్వామి దర్శించుకుని అక్కడి నుంచి సంగారెడ్డిలోని నారాయణగౌడ్ తమ్ముడి ఇంటికి వెళ్లారు. అక్కడ నారాయణగౌడ్ మనవడు, మనవరాలిని దించేసి అదే వాహనంలో భార్య సత్యమ్మ, కొడుకులు భరత్‌గౌడ్, భాస్కర్‌గౌడ్, కోడలు హారికతో కలిసి షాపింగ్ చేసేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డుపై వీరు ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నారాయణగౌడ్, సత్యమ్మ దంపతులు దుర్మరణం పాలవ్వగా భరత్‌గౌడ్, భాస్కర్‌గౌడ్, హారిక, డ్రైవర్ మధులకు తీవ్రగాయాలయ్యాయి. క్లాస్ వన్ కాంట్రాక్టర్‌గా ఎదిగి.. మృతుడు నారాయణగౌడ్ బీఈ ఎలక్ట్రికల్ పూర్తి చేసి కాంట్రాక్టర్ పనులు చేపట్టాడు. ప్రస్తుత సంగారెడ్డి ఎమ్మెల్యే చిం తా ప్రభాకర్ సదాశివపేట మున్సిపల్ చైర్మన్‌గా పని చేసిన 1992 నుంచి 1995 వరకు నారాయణగౌడ్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. అనంతరం కాంట్రాక్టు పనులు చేస్తూ క్లాస్‌వన్ కాంట్రాక్టర్ స్థాయికి ఎదిగాడు. నారాయణగౌడ్, సత్యమ్మ దంపతుల దుర్మరణంతో సదాశివపేట పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న తోటి కాంట్రాక్టర్లు, ఆయన వద్ద పని చేస్తున్న కార్మికులు, డ్రైవర్లు విషాదంలో మునిగిపోయారు. నారాయణగౌడ్ ఇంటి వద్ద బంధువులు, స్నేహితులు గుమిగూడారు. నారాయణగౌడ్ దుర్మరణం చెందడంతో పట్టణ, మండల పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు సంతాప సూచకంగా నిలిపివేశారు. -
సదాశివపేటలో కూలిన పురాతన భవనం
సురక్షితంగా బయటపడిన కుటుంబ సభ్యులు తప్పిన ప్రమాదం.. పరిశీలించిన ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి సదాశివపేట: ఎడ తెరిపిలేకుండా కురిసిన వర్షాలకు బాగా తడిసిపోయిన అతి పురాతన భవనం అకస్మాత్తుగా కూలిపోయిన సంఘటన గురువారం పట్టణంలోని గడిమైసమ్మ మందిరం సమీపంలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం భవనంలో ఉంటున్న అల్లాదుర్గం సురేశ్, భార్య విశాల, నానమ్మ నాగమణి, ఏడాది వయస్సున్న కుమారుడు ప్రద్వీక్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు భవనం పూర్తిగా తడిసిపోయింది. దీంతో గురువారం అకస్మాత్తుగా పగుళ్లు రావడం గమనించిన సురేశ్ వెంటనే తేరుకుని భవనంలో ఉన్న నానమ్మ, నాగమణి, భార్య విశాల, కుమారుడు ప్రద్వీక్లను చాకచక్యంగా తప్పించారు. భవనం ముఖద్వారం పూర్తిగా కూలిపోయింది. దీంతో సురేశ్ మున్సిపల్ కమిషనర్ ఇస్వాక్ ఆబ్ఖాన్కు, తహసీల్దార్ గిరికి భవనం కూలిన విషయమై ఫోన్లో సమాచారం చేరవేశాడు. కమిషనర్ హైదరాబాద్‌లో సమావేశంలో ఉండడంతో మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేసి శానిటరీ ఇన్స్పెక్టర్ మధు, టీపీఓ శ్రీనివాస్, అదనపు టీపీఓ ఝాన్సీలను సంఘటన స్థలానికి పంపించారు. కూలిపోయిన పురాతన భవనంలోని వారిని నిచ్చెన సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ గిరితో కలిసి పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తగిన ఆర్థిక సహాయం మంజూరు చేస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు. పురాతన భవనాల్లో ప్రజలెవరూ నివసించవద్దని ప్రజలకు పిలపునిచ్చారు. అనంతరం కమిషనర్ ఇస్వాక్‌ఆబ్‌ఖాన్ ఆ భవనాన్ని వెంటనే కూల్చివేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించడంతో జేసీబీ సహాయంతో కూల్చివేశారు. -
దోమల స్వైర విహారం
పట్టపగలే విజృంభణ పారిశుద్ధ్య లోపం, మురుగు నీరే కారణం నివారణ చర్యలు శూన్యం రోగాల బారిన పడుతున్న ప్రజలు సదాశివపేట: నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పట్టణంలోని పలు కాలనీల్లో అపరిశుభ్రత వాతావరణం ఏర్పడింది. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టపగలే దోమలు ప్రజలపై దాడి చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా అవి జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపం డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంతో పలు కాలనీల్లో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. పిల్లలు, వృద్ధులు రోగాల బారినపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. పట్టణంలోని సిద్దాపూర్ కాలనీ, శంభులింగేశ్వరకాలనీ, నాగేశ్వర్నగర్, ఫయాజ్‌నగర్, గురునగర్, రవీంద్రనగర్, దత్తాత్రేయనగర్, శ్రీరాంనగర్, ప్రియదర్శిని కాలనీ, రాఘవేంద్రనగర్, హనుమాన్‌నగర్, కృష్ణనగర్, తదితర ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు నిలవ ఉండడంతో దోమలకు ఆవాసాలుగా మారాయి. దోమకాటుతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. చాలామంది మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధుల బారినపడి ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు కానీ వైద్య సిబ్బంది కానీ అయా కాలనీలపై కన్నెత్తి చూడడం లేదు. దోమల నివారణకు ఇళ్లలో కాయిల్స్, లిక్వీడ్ సీసాల వినియోగానికి ప్రతి కుటుంబం నేలకు వంద వరకు ఖర్చు చేస్తున్నారు. పట్టణంలో అధికారికంగా 10 వేల వరకు గృహాలు ఉండగా రికార్డుల్లో నమోదుకానీ గృహాలు మరో పదివేల వరకు ఉండవచ్చని అంచన. పత్తాలేని ఫాగింగ్ పట్టణంలో పారిశుద్ధ్యంపై సంబంధిత అధికారులు ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పలు కాలనీల్లో పలు వ్యాధులు ప్రబలుతున్నాయి. డ్రైనేజీలు దోమలకు నిలయాలుగా మారినందువల్ల పిల్లలు, వృద్ధులు ఇబ్బందిపడతున్నారు. శానిటేషన్ సిబ్బంది దోమల నివారణకు ఫాగింగ్ చేయకపోవడం, చెత్తకుండీల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడంతో అపరిశుభ్రత రాజ్యమేలుతుంది. పలు కాలనీల్లో పిల్లలు,వృద్ధులు, యువత అనే తెడాలేకుండా విషజ్వారాల బారినపడుతున్నారు. ఇప్పటికైన మున్సిపల్ అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటాం పట్టణ పరిధిలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ పరిధిలో ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నం. సిబ్బందిని అప్రమత్తంగ ఉంచుతూ అందుబాటులో ఉంచాం. కాలనీలో నీరు నీలువ ఉండకుండ ప్రత్యేక చర్యలు చేపడుతున్నం. పలు కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా పనులు చేపడుతున్నాం, ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. - ఇస్వాక్ ఆబ్‌ఖాన్, మున్సిపల్ కమిషనర్ -
వైభవంగా విశ్వకర్మ విగ్రహ నిమజ్జనం
సదాశివపేట: సదాశివపట్టణం హనుమాన్ నగర్ కాలనీలోని వీరబ్రహ్మం మందిరంలో ఈ నెల 17న ప్రతిష్టించిన విశ్వకర్మ విగ్రహాన్ని బుధవారం నిమజ్జనం చేశారు. స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో మందిరం నుంచి ప్రారంభమైన నిమజ్జన ఊరేగింపు వికారాబాద్ రోడ్డు, 65వ నంబర్ జాతీయ రహదారి, తిలక్‌రోడ్డు, గాంధీరోడ్డు మీదుగా శంభులింగేశ్వర మందిరం వరకు ఊరేగింపు నిర్వహించారు, సాయంత్రం శంభులింగేశ్వర మందిరం ఎదుట విశ్వకర్మ విగ్రహానికి చివరగా పూజలు నిర్వహించి బావిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా కార్యదర్శి, పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మెదక్ శ్రీనివాస్‌చారి, జిల్లా ఉపాధ్యక్షుడు మామిడిరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి పట్టణ యువత అధ్యక్షుడు మెదక్ సందీప్‌చారి, పట్టణ ప్రధాన కార్యదర్శి అంబదాస్, పట్టణ యువత ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌చారి, నాయకులు సంగమేశ్వర్, భోగేశ్, నర్సింగ్‌రావు, సురేశ్‌చారి, పట్టణ స్వర్ణకార సంఘం నాయకులు తదితరులు నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. -
పొదలు కాదు.. విద్యుత్తు స్తంభాలు
సదాశివపేట: పట్టణ పరిధిలోని విద్యుత్ స్తంభాలకు చెట్ల పొదలు అల్లుకున్నాయి. చెట్ల తీగలు స్తంభంపై వరకు అల్లుకోవడంతో వీటి వద్ద ప్రమాదం పొంచి ఉంది. మరమ్మతు కోసం స్తంభాలు ఎక్కే పరిస్థితి లేకుండా పోతోంది. పట్టణంలోని వికారాబాద్ రోడ్ సబ్‌రిజిష్టార్ కార్యాలయం వద్ద, పట్టణ మండలానికి విద్యుత్ సరఫరా చేసే సబ్‌స్టేషన్ ఆవరణలోగల స్తంభాలకు తీగలు పెద్ద ఎత్తున అల్లుకున్నాయి. దీంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతాయం కలుగుతోంది. నిత్యం విద్యుత్ అధికారులు సిబ్బంది చూస్తున్నారే తప్ప తొలగించడం లేదు. స్తంభాలు, తీగలను చెట్ల పొదలు అల్లుకోవడంతో తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. కొన్నేళ్లుగా ఇదే సమస్యతో విద్యుత్ వినియోగదారులు ఇబ్బందులుపడుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ తీగలను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై విద్యుత్ ఏఈ శ్రీహరిని సంప్రదించగా స్తంభాలకు తీగలు అల్లుకున్న చెట్ల పొదలను తొలగిస్తామన్నారు. ఎక్కడెక్కడ ఇలాంటి స్తంభాలు ఉన్నాయో గుర్తించి చెట్ల పొదలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. -
మైనారిటీ గురుకులాల తనిఖీ
సదాశివపేట: పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం ఏసీబీ డీజీ ఏకే ఖాన్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరక్టర్ షఫీ ఉల్లా, జిల్లా మెనార్టీ వెల్ఫేర్ అధికారి విక్రమ్‌రెడ్డి, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల ఇన్చార్జీ సయ్యద్, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. విద్యార్ధులు నివసించే గదులు, భోజన శాల వంట గదులను పరిశీలించారు. ఏసీబీ డీజీ ఏకే ఖాన్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, రాష్ట్రమైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరక్టర్ షఫీ కొద్దిసేపు ఉల్లాసంగా బ్యాడ్మింటన్ ఆట అడారు. అనంతరం సదాశివపేట మండలం సిద్దాపూర్ గ్రామ శివారులోని 262 సర్వే నంబర్లో నూతన మైనార్టీ రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి కేటాయించిన 5 ఎకరాల భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మాయిలపై దాడులు అరికట్టాలి
సదాశివపేట: నీకు నేను రక్ష- నాకు నీవు రక్ష, మనం అందరం కలిసి దేశానికి ధర్మానికి, సంస్కృతికి రక్ష అని ఏబీవీపీ ఎస్ఎఫ్డీ జిల్లా కన్వీనర్ మహేశ్‌స్వామి పేర్కొన్నారు. ఏబీవీపీ పట్టణశాఖ అధ్వర్యంలో శనివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్ష బంధన్ నిర్వహించారు. కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఏబీవీపీ నాయకులకు రాఖీలు కట్టి రక్ష బంధన్ నిర్వహించారు. అనంతరం కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఒకరినోకరులు రాఖీలు కట్టుకుని అనందించారు. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి ప్రత్యేకతను మహేశ్‌స్వామి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు జగదీశ్వర్, లచ్చయ్య, పవన్‌కుమార్, విద్యాసాగర్ పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో.. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ దస్తగిరికి విద్యార్థులు రాఖీలు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్, కళాశాల కమిటీ నాయకులు నవీన్, నర్సింలుకు విద్యార్థులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఐక్యత, స్నేహభావాలను పెంపొందించడం కోసం తాము నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. కులమత బేధం లేకుండా అందరు సంతోషంగా జరుపుకునే పండుగ రక్షాబంధన్ అని తెలిపారు. రక్షాబంధన్ స్ఫూర్తితో అమ్మాయిలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం ఆరికట్టాలని, ఎస్ఎఫ్ఐ కళాశాల కమిటీలు వారికి రక్షణగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ దస్తగిరి, కళాశాల కమిటీ నాయకులు కళావతి, ముబిన, నవీన్, శ్రీను, నర్సింలు, శ్యామలా, మాధవి,మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ ఆరోగ్య మిషన్ సభ్యుల పర్యటన
సదాశివపేట: పట్టణంలోని వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రిని శనివారం జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్ సభ్యులు గిరిశ్, వెంకటేశ్, సుశిల్, రాధోడ్‌లు పరిశీలించారు. ఆసుపత్రిలోని మందులు నిలువచేసే స్టోర్‌గది, ల్యాబ్, అపరేషన్ థియెటర్, జనరల్ వార్డు, ఇంజక్షన్ ఇచ్చే గది, మందులు ఇచ్చె గది, ఓపి గదితో పాటు ప్రసూతి వార్డు, మూత్రశాలలు, మరుగుదొడ్లను వారు క్షణ్ణంగా పరిశీలించారు.కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ బాల్‌రాజ్, పార్మాసిస్ట్ భీంరావ్‌పాటిల్, వైద్యులు వైద్య సిబ్బంది అందరు అందుబాటులో ఉండడంతో సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. -
జంతుబలిపై విచారణ
సదాశివపేట: పట్టణంలో దుర్గభావాని జాతర సందర్భంగా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన జంతు బలిపై శనివారం సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న, ఆర్టీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏడి పశువైద్య అధికారి సత్యనారాయణలు దుర్గభవాని మందిరం వద్ద విచారణ జరిపారు. కొందరు వక్తులు జాతరలో జంతుబలి జరిగిందని ఫిర్యాదు చేసినందు వల్ల విచారణ చేపట్టారు. జాతర సందర్భంగా జంతు బలి జరిగిందా? లేదా? జంతు బలిని ఎవరు చేశారు? జంతువులను ఇక్కడే బలి చేశారా లేక మరోచోట బలిచేసి ఇక్కడకు తీసుకువచ్చార అని మందిరం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జంతు బలి జరిగినట్లు అధికారుల విచారణలో రుజువైంది. జంతువులను బలి చేసిన వ్యక్తులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇస్వాక్ ఆబ్‌ఖాన్, సదాశివపేట ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ గిరి, ఆర్ఐ. వీరేశం, వీఆర్ఓ నాగరాజులు పాల్గొన్నారు. -
అన్నీ.. అమ్మే
పిల్లల చదువుల వెనక తల్లి శ్రమే ఎక్కువ ఆలనాపాలనలో అగ్రభాగం హోం వర్క్‌లో పూర్తి భాగస్వామ్యం సదాశివపేట రూరల్: పిల్లలు బడికి వెళ్లి ఇంటికి వచ్చే సరికి అలసిపోవడం, కొద్దిసేపు ఆడకుంటామని బయటికి వెళ్తుంటారు. సాయంత్రం అయ్యిందంటే చాలు తల్లులు తమ ఇంటి పనులు త్వరగా ముగించుకొని పిల్లలను ముందు కూర్చోబెట్టుకొని హోం వర్క్ చేయిస్తారు. ఈ రోజుల్లో కనీసం ఇంటర్మీడియెట్, డిగ్రీ వరకు చదువుకున్న వారు అమ్మలే ఉండడంతో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న తమ పిల్లలను ట్యూషన్లకు పంపించకుండా ఇంటి దగ్గరే కూర్చుని హోం వర్క్ చేయిస్తున్నారు. చిన్న తనంలో తమ పిల్లలు హోం వర్క్ చేయడానికి కూడా సతాయిస్తున్నా సముదాయిస్తూ వారి చేయి పట్టుకొని హోం వర్క్ పూర్తయ్యేలా చూస్తారు. కొందరు పిల్లలు హోం వర్క్ పూర్తి చేసేందుకు అపసోపాలు పడి పూర్తవ్వగానే పుస్తకాలు, నోటు పుస్తకాలను చెల్లాచెదరుగా అలాగే వదిలేసి ఆడుకొనేందుకు బయటకు పరిగెత్తుతారు. వాటన్నింటినీ సరిచేసి బ్యాగుల్లో పెట్టడం కూడా తల్లుల వంతే. ఇక పిల్లలు ప్రాథమిక, ఉన్నత స్థాయిల్లో చదువుతుంటే వారిని ట్యూషన్లకు పంపించడం, అక్కడి నుంచి రాగానే ఏమేమి చెప్పారని అడగడం, హోం వర్క్ పూర్తి చేశావా...? అని ఆరా తీయడం, మార్కెట్లో లభించే వివిధ కంపెనీల శక్తినిచ్చే పౌడర్లను పాలల్లో కలిపి తాగించడం ఒక్కటేమిటి వారిని నిద్రపుచ్చే వరకూ ప్రతి చిన్న పనికి పిల్లలు తల్లుల పైనే ఆధారపడతారు. పిల్లల దుస్తులు శుభ్రం చేయడం దగ్గర నుంచి ఐరన్ చేసి మరీ పరిశుభ్రంగా కనిపించేలా చూడడం వరకు తల్లులు మరింత జాగ్రత్త తీసకుంటారు. అంతేకాదు పిల్లలకు ర్యాంకులు వస్తే ముందుగా మురిసిపోయేది తల్లులే. పిల్లల చదువుల్లో తల్లుల పాత్ర కూడా పెరగడంతో ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయిలో కూడా తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా తప్పకుండా దరఖాస్తు ఫారాల్లో రాయాల్సిందిగా నిబంధనలు పెట్టారు. కొన్ని పాఠశాలల్లో తల్లుల పేర్లు, ఫోన్ నంబర్లను కూడా తీసుకుంటున్నారు. జన్మనిచ్చే మాతృమూర్తే ప్రథమ గురువు అని చెప్పడమే కాదు, అక్షర సత్యం కూడా... చిన్నప్పుడు బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలోనే తమ పిల్లలకు తమ చుట్టాలు, ఇరుగు పొరుగు వారిని ఏ వరుసలు పెట్టి పిలవాలో నేర్పించేది తల్లే. పిల్లలకు ముందుగా వచ్చీరాని మాటల దగ్గర నుంచి మొదలుకొని సంస్కారవంతమైన చక్కటి అలవాట్లను నేర్పించడంలో తల్లి పాత్ర కీలకమైంది. ఇక నేటి కంప్యూటర్ యుగంలో మూడేళ్ల వయసు వచ్చిందంటే చాలు పిల్లల్నీ ప్లే స్కూల్ అని, ఇతర ఆటలు ఆడించే పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. అక్కడ్నుంచి ప్రారంభమవుతుంది పిల్లల చదువే కాదు... తల్లుల చదువు కూడా. సాధారణంగా చిన్నారులకు పాఠశాలలు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతాయి. అంటే వారిని కనీసం 8 గంటలకు తయారుచేసి సిద్ధంగా ఉంచాలి. అందుకు తల్లులు తెల్లవారు జామున మేల్కొనడంతో ప్రారంభమయ్యే ఇంటి పనులు త్వరగా పూర్తి చేసుకొని తమ పిల్లలకు నీళ్లు వేడి చేయడం దగ్గర నుంచి స్నానాలు చేయించడం, దుస్తులు వేయడం, టై, బెల్టు పెట్టడంతో పాటు పలక, బలపం, కొద్దిగా ప్రాథమిక స్థాయిలో అన్ని పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు బ్యాగులో ఉన్నాయా.. లేవా... పెన్సిల్, రబ్బర్లన్నింటినీ ఒక సారి సరిచూసి బ్యాగు సిద్ధం చేయడం వరకూ అన్నీ వారి వంతే. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచీ పిల్లలు బడికి వెళ్లే వరకూ కనీసం పది నిమిషాలు కూర్చోవడానికి కూడా సమయం లేకుండా పని చేయడం తల్లులకు తప్పని పరిస్థితి. సుఖసంతోషాలతో ఉండాలనే తపన మేం ఏం చేసినా మా పిల్లల గురించే. సమాజంలో ఆత్మగౌరవడంతో ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరిక. మా పిల్లల ముఖాల్లో కనబడే చిరునవ్వు ముందు బాధలు, కష్టాలన్నీ బలాదూరే. మా జీవితాల్లా కాకుండా మా కన్నా మంచి జీవితాలను గడపాలన్నదే మా తపన. వారి సంతోషమే మా సంతోషం. – మంజూదేవి, ఓ చిన్నారి తల్లి పిల్లల భవిష్యత్తే ముఖ్యం మా పిల్లలు మా లాగా కాకుండా వారి భవిష్యత్తు బాగుండాలి. భవిష్యత్తులో వారి ఉన్నత స్థానంలో చూడాలనే తపన, ప్రేరణ ఉంటుంది. వారు ఎంత ఇబ్బంది పెట్టినా... మారాం చేసినా కోపం రాదు. పిల్లల ఆనందమే మా ఆనందం. మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదనే తాపత్రయం. పిల్లలను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేం. – బి. శోభారాణి, ఓ చిన్నారి తల్లి -
చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులపైనే దృష్టి
పావులు కదుపుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సదాశివపేట, న్యూస్‌లైన్: మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దృష్టిసారించాయి. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. మెజార్టీ కౌన్సిలర్ స్థానాలు తమకే వస్తాయని రెండు పార్టీలు ధీమాతో ఉన్నాయి. టీఆర్ఎస్కు చైర్మన్ వైస్ చైర్మన్ స్ధానాలు దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఏది ఏమైనా చెర్మైన్, వైస్ చెర్మైన్ పదవులు తమవేనని ఆ రెండు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ రెండు వరకు ఆగాల్సిందే! మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈనెల 12 ప్రకటించినా చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక మాత్రం జరిగే అవకాశాలు లేవని చేప్పవచ్చు. వీరి ఎంపిక జూన్ రెండో తేదీ తరువాతనే చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఏ ముహుర్తాన నిర్వహించారోగాని అడుగడుగునా ఉత్కంఠ తప్పడం లేదు. ఎన్నికలైన తరువాత ఫలితాలు రెండు సార్లు వాయిదా పడ్డాయి. ఫలితాలు ఎప్పుడెప్పుడాఅని అభ్యర్థులు కళ్లల్లో వత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. ఫలితాలు విడుదలైతే మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ల పదవుల ఎన్నిక ఎప్పుడో అనే సందేహం తలెత్తుతోంది. ఈ పదవుల ఎన్నికపై ఎన్నికల కమిషన్ ఇంత వరకు అధికారిక ప్రకటన చేయలేదు. జూన్ 2న అపాయింటెడ్ డే ఉన్నందువల్ల ైచైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో అయోమయం నెలకొంది. సదాశివపేట మున్సిపల్లో 23 వార్డులు ఉన్నాయి. ఇందులో 12 వార్డుల్లో మెజార్టీ ఉన్న పార్టీకి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించే అవకాశాలు లేనందువల్ల ఎంఐఎం, బీజేపీ పార్టీలతో పాటు ముగ్గురు స్వతంత్రులు గెలిచే అవకశాలు ఉన్నందువ్లల వారి మద్దతు తప్పనిసరి. సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని జనరల్ మహిళకు రిజర్వుచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏరాజకీయ పార్టీకూడా చెర్మైన్ అభ్యర్థులను ప్రకటించే సాహసం చేయలేదు. రెండు పార్టీల్లోను చైర్మన్ పేరు ప్రకటించనందువల్ల ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుందామని చెర్మైన్ అభ్యర్థి ఏవరో ఫలితాలు వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోనున్నప్పటికీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను అశిస్తున్న ఆశావహులు పార్టీ ముఖ్యులతో కలిసి ముందుగా మెజార్టీ సభ్యులను తమ అదుపులో పెట్టుకునేందుకు ఇప్పటి నుంచి గెలిచే అవకాశాలు ఉన్న కౌన్సిలర్లకు ప్రలోభాలు పెడుతున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేయాలని వీరు బేరసారాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. మరో పక్క 12న కౌంటింగ్ పుర్తయి ఫలితాలు వెలువడినా తరువాత గెలిచిన కౌన్సిలర్లను క్యాంపుకు తరలించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను జూన్ రెండు తర్వాతనే చేపట్టేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ అప్పటి వరకు క్యాంపులు నిర్వహించే అలోచనలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఎప్పుడుంటుందో తెలియని పక్షంలో క్యాంపులు నిర్వహించడం చాల ఖర్చుతో కూడుకున్న పనే. అయినా క్యాంపులు నిర్వహించకపోతే రోజు టెన్షన్ పడాల్సి వస్తుందని మెజార్టీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించడమే ఉత్తమమని రెండు పార్టీల నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో పక్క ఎమ్మెల్యే, ఎంపీ ఓటు మున్సిపల్ చెర్మైన్ ఎన్నికల్లో కీలకం కావడంతో వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపడతారు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి సంగారెడ్డిలోగాని సదాశివపేట మున్సిపల్ పరిధిలో గాని తన ఓటు హక్కును వినియోగించుకునే వీలుంది. మెదక్ ఎంపీ విషయానికి వస్తే అయన మెదక్, సంగారెడ్డి, సదాశివపేట, సిద్దిపేట మున్సిపాలిటీల్లో ఎక్కడో ఒకచోట ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. -
మున్సి‘పోల్స్’ పోలీస్‌కు సవాల్
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు అన్ని చర్యలూ తీసుకున్నారు. మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి రావడంతో ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలను పోలీసులు సవాలుగా తీసుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ ఇప్పటికే పలుమార్లు వివిధ స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఎన్నికల్లో చేపట్టాల్సిన భద్రతపై సమీక్షించారు. జిల్లాకు చేరుకున్న పారా మిలిటరీ బలగాలతో పాటు అందుబాటులో ఉన్న పోలీసులు గత కొన్ని రోజులుగా మున్సిపల్ వార్డుల్లో నిఘాను తీవ్రతరం చేశారు. పోలింగ్‌బూత్‌లవారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసి ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేసేలా చర్యలు తీసుకున్నారు. వందల మందితో భద్రత సంగారెడ్డి, సదాశివపేట, మెదక్, జహీరాబాద్ మున్సిపాలిటీలతో పాటు గజ్వేల్, జోగిపేట నగర పంచాయతీల పరిధిలో మొత్తం 145 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం 192 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలను సమర్థవంతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో ఒక ఎస్పీ, ముగ్గురు ఏఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 101 మంది ఎస్ఐలు, 268 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 1,040 మంది కానిస్టేబుళ్లు, 189 మంది మహిళా కానిస్టేబుళ్లు, 408 మంది హోంగార్డులు, ఇద్దరు రిజర్వు ఇన్స్పెక్టర్లు, 17 మంది రిజర్వు ఎస్ఐలు, 51 మంది ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు, 236 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు, 36 మొబైల్ పార్టీలు, 13 స్ట్రైకింగ్ ఫోర్స్, 6 ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్, 18 షాడో పార్టీలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ప్రత్యేక నిఘా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 82 అతి సమస్యాత్మక ప్రాంతాలు, 98 సమస్యాత్మక, 11 సాధారణ ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి అరాచకాలకు పాల్పడే వారిపై పోలీసులు గట్టి నిఘా వేశారు. గతంలో వివిధ కారణాల వల్ల గొడవలకు పాల్పడి, గొడవలతో సంబంధం ఉన్న వారిని జిల్లా వ్యాప్తంగా 3,866 మందిని బైండోవర్ చేశారు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసే వారిని తమ అదుపులోకి తీసుకొనేలా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 59 మందికి ఆయుధాలకు (గన్) లెసైన్సులు ఉండగా వారి నుంచి ఆయా పోలీస్స్టేషన్లలో డిపాజిట్ చేయించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోకి కొత్త వ్యక్తులు రాకుండా చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల్లో గొడవలు పాల్పడతారని అనుమానం ఉన్న వారిపై షాడో పార్టీలు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంతరాలు, అక్రమాలు జరుగకుండా ఉండేందుకు వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. పోలింగ్ రోజున కేంద్రం సమీపంలో 30 పోలీసు యాక్టు, సెక్షన్ 144 అమలులో ఉంటుంది. -
మాజీ సైనికుడి దారుణ హత్య
సదాశివపేట, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన మాజీ సైనికుడు మహ్మద్ రఫీక్ బాబా (65) సదాశివపేట మండలం కోనాపూర్ సమీపంలో శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ దామోదర్‌రెడ్డి కథనం మేరకు.. హఫీజ్‌పేటకు చెందిన సోఫీ, మాజీ సైనికుడు రఫీక్ కలిసి కోనాపూర్ గ్రామ సమీపంలో వ్యవసాయ భూమిని ఇటీవలె కొనుగోలు చేశారు. అయితే సదరు భూమిని తనకు చూపాలని సోఫీ కుమారుడు హఫాన్ మూడు రోజుల క్రితం రఫీక్‌ను కోరాడు. ఇందుకు రఫీక్ శుక్రవారం ఉదయం వెళదామని తెలిపాడు. అందులో భాగంగానే శుక్రవారం ఉదయం రఫీక్ ఇంటి నుంచి ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కారులో డ్రైవర్ గఫార్‌తో కలిసి సదాశివపేటకు బయలు దేరారు. హఫీజ్‌పేట వద్ద హఫాన్ను కారులో ఎక్కించుకున్నాడు. కోనాపూర్‌లోని బసవలింగ ఆశ్రమం వద్ద కారు ఆపారు. అనంతరం ఇటీవల కొనుగోలు చేసిన భూమిని హఫాన్కు చూపేందుకు రఫీక్ ముందుకు కదిలాడు. కొద్ది దూరం వెళ్లాక హఫాన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రఫీక్ మెడపై బలంగా పొడిచి పరారయ్యాడు. దీనిని గమనించిన సమీప పంట పొలాలకు చెందిన రైతులు పలువురు విషయాన్ని కారు డ్రైవర్ గఫార్‌కు తెలిపారు. దీంతో గఫార్.. రఫీక్ వద్దకు చేరుకున్నాడు. అప్పటికే రఫీక్ మృతి చెందడంతో సమాచారాన్ని సెల్‌ఫోన్ ద్వారా మృతుడి కుమారుడు హతిక్ వివరించారు. తమకూ సమాచారం అందడంతో సంఘటనా స్థలాన్ని చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించినట్లు సీఐ తెలిపారు. అనంతరం సంగారెడ్డి డీఎస్పీ వెంకటేష్‌కు సమాచారాన్ని చేరవే సినట్లు ఆయన వివరించారు. డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు హతిక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు హఫాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. -
విద్యార్థి గణేష్ మృతిపై విచారణ
సదాశివపేట/సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : పట్టణంలోని కృష్ణవేణి టెక్నో స్కూల్లో సోమవారం ఎల్కేజీ విద్యార్థి గణేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనపై బుధవారం విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. కలెక్టర్ స్వితా సబర్వాల్, డీఈఓ రమేష్‌ల ఆదేశాల మేరకు బుధవారం డిప్యూటీ ఈఓ శోభరాణి, ఎంఈఓ సురేష్‌లు కృష్ణవేణి టెక్కో స్కూల్‌ను సందర్శించారు. మొదట పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్‌ను విచారించారు. ఎల్కేజీకి తరగతులు చెప్పే ఉపాధ్యాయులు ఎవరూ గణేష్‌ను కొట్టలేదని తెలిపారు. గణేష్ తల్లిదండ్రులు బీదవారు కావడంతో గతేడాది కూడా ఫీజు చెల్లించలేదని, ఈ ఏడాది కూడా ఫీజు అడగలేదని విచారణ అధికారులకు వెల్లడించారు. సోమవారం భోజనానంతరం ఉదయం 11.30 గంటలకు టిఫెన్ బాక్స్‌ను పెట్టడానికి వెళుతూ కింద పడ్డాడని సిబ్బంది తెలిపారన్నారు. తాను వెంటనే గణేష్‌ను స్థానిక సూర్య నర్సింగ్ హోంకు తీసుకెళ్లినట్లు చెప్పారు. అక్కడి వైద్యులు చిన్న పిల్లల డాక్టరైన బాలాజీ పవార్ వద్దకు తీసుకెళ్లాలని సూచించారన్నారు. దీంతో తాము డాక్టర్ బాలాజీ పవార్ వద్దకు తీసుకెళ్లగా ఆయన బాలుడిని పరీక్షించి పల్స్‌రేటు బాగానే ఉందని తన వద్ద ఆక్సిజన్ లేనందు వల్ల ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ బాల్‌రాజ్ వద్దకు తీసుకువెళ్లగా సూచించారని తెలిపారు. అనంతరం ఎల్కేజీ తరగతి గదిలోకి వెళ్లి ఉపాధ్యాయురాలు సౌజన్యను విచారించగా గణేష్‌ను తాము ఎవరం కొట్టలేదని తెలిపారు. అనంతరం ఎల్కేజీ చదువుతున్న చిన్నారులను విచారణ అధికారులు విచారించగా.. గణేష్‌ను టీచర్లు కొట్టలేదని, అన్నం తిన్న తరువాత టిఫెన్ బాక్స్‌ను పెట్టడానికి వెళ్లి కింద పడ్డాడని వివరించారు. పాఠశాలలో విచారణ అనంతరం డిప్యూటీ ఈఓ శోభరాణి, ఎంఈఓ సురేష్‌లు సిద్దాపూర్ కాలనీలోని మృతుడు గణేష్ ఇంటికి వెళ్లారు. ఉపాధ్యాయులు కొట్టినందు వల్లనే తమ కుమారుడు గణేష్ మృతి చెందాడని తల్లిదండ్రులు కృష్ణ మాధవీలు రోదిస్తూ తెలిపారు. గణేష్ గతేడాది నుంచి పాఠశాలకు రెగ్యులర్‌గా వస్తాడని, హాజరు పట్టికను పరిశీలించడం వల్ల తనకీ విషయం వెల్లడైందని డిప్యూటీ డీఈఓ శోభ తెలిపారు. విద్యార్థి గణేష్‌కు ఎప్పుడూ మూర్ఛ (ఫిట్స్) రాలేదని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారన్నారు. పాఠశాల యాజమాన్యం, విద్యార్థి సంఘాలు, విద్యార్థి తల్లిదండ్రులతో పాటు వా రి బంధువుల ద్వారా వచ్చిన ఫిర్యాదులను నివేదిక రూపంలో సమర్పించడం జరిగిందని డిప్యూటీ డీఈఓ శోభ తెలిపారు. విద్యార్థి గణేష్ మృతిపై విచారణ వివరాలను తాను డీఈఓ రమేష్‌కు నివేదిక అందజేస్తానన్నారు. పాఠశాలలో విచారణ సమయంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు అనిల్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రహమాన్ తదితరులు ఉన్నారు. -
ఎల్కేజీ విద్యార్థి అనుమానాస్పద మృతి
సదాశివపేట, న్యూస్‌లైన్ : పట్టణ పరిధిలోని పిట్టలకేరిలో గల శ్రీకృష్ణవేణి టెక్నో పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న గణేష్ అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. సిదాపూర్ కాలనీకి చెందిన కృష్ణ, మాధవి దంపతుల కుమారుడు గణేష్ శ్రీకృష్ణవేణి టెక్నో పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో టిఫిన్ బాక్స్ తీసుకుని భోజనం చేయడానికి వెళుతుండగా అకస్మాతుగా కింద పడి పోయాడు. దీంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన పట్టణంలోని సూర్య నర్సింగ్ హోంకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్సల అనంతరం పరిస్థితి విషమించడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సలు చేస్తుండగా మృతి చెందాడు. విషయాన్ని ప్రిన్సిపాల్ రవీందర్రావు స్థానిక పోలీసులకు తెలిపి పాఠశాలకు చేరుకున్నాడు. ఇదిలా ఉండగా.. విద్యార్థి గణేష్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. ఉపాధ్యాయుడు కొట్టినందు వల్లే గణేష్ మృతి చెందాడని ఆరోపించారు. అయితే జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరిస్తుండగా బాధిత తరఫు బంధువులు ప్రిన్సిపాల్ రవీందర్‌రావుపై దాడికి పాల్పడ్డారు. సీఐ దామోదర్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్‌రావుతో పాటు సీఐటీ యూ డివిజన్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతి చెందిన విద్యార్థి మృతదేహానికి పంచనామా నిర్వహించామన్నారు. గణేష్ తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ దామోదర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థి మృతిపై విచారణకు ఆదేశం సంగారెడ్డి మున్సిపాలిటీ : సదాశివపేట పట్టణంలోని కృష్ణవేణి టెక్నో స్కూల్లో ఎల్కేజీ విద్యార్థి మృతి చెందిన సంఘటనపై విచారణకు డిప్యూటీ ఈఓను ఆదేశించినట్లు డీఈఓ రమేష్ తెలిపారు. సోమవారం పాఠశాలలో విద్యార్థి గణేష్ ఆకస్మికంగా మృతి చెందడంపై విద్యార్థి సంఘాలు, బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి నివేదిక ఆధారంగా పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. కొట్టడం వల్లే గణేష్ మృతి ఉపాధ్యాయులు కొట్టడం వల్లనే గణేష్ మృతి చెందాడు. కొట్టిన తరువాత సరైన సమయంలో వైద్య చికిత్సలు చేయించలేదు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే గణేష్ చనిపోయాడు. - తల్లిదండ్రులు కృష్ణ, మాధవి ఉపాధ్యాయులు కొట్టలేదు ఎల్కేజీ చదువుతున్న విద్యార్థి గణేష్‌ను తమ ఉపాధ్యాయులు ఎవరు కొట్టలేదు. టిఫిన్ బాక్స్ తీసుకుని భోజనం చేయడానికి వెళుతూ కిందపడి గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్సలు పొందుతూ మృతి చెందాడు. - ప్రిన్సిపాల్ రవీందర్రావు పాఠశాల గుర్తింపు రద్దుచేయాలి ఎల్కేజీ చదువుతున్న గణేష్ విద్యార్ధి మృుతికి కారణమైన కృష్ణవేణి టెక్నో పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి. విద్యార్థి కుటుంబానికి పాఠశాల యాజమాన్యం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. - అనిల్, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు