ఆ భార్యాభర్తలను మృత్యువు కబళించింది. హైదరాబాద్‌లో షాపింగ్ చేయడానికి సదాశివపేట నుంచి ఇద్దరు కొడుకులు, కోడలుతో కలిసి పయనమైన వారి వాహనాన్ని ప్రమాదం వెంటాడింది.
సదాశివపేట: ఆ భార్యాభర్తలను మృత్యువు కబళించింది. హైదరాబాద్‌లో షాపింగ్ చేయడానికి సదాశివపేట నుంచి ఇద్దరు కొడుకులు, కోడలుతో కలిసి పయనమైన వారి వాహనాన్ని ప్రమాదం వెంటాడింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో క్లాస్‌వన్ కాంట్రాక్టర్ పిల్లిగుండ్ల నారాయణగౌడ్, ఆయన భార్య సత్యమ్మ దుర్మరణం పాలయ్యారు. వీరి మరణవార్త తెలియడంతో స్వగ్రామమైన సదాశివపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం వీరు వెళుతున్న వాహనం పల్టీకొట్టడంతోప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నారాయణగౌడ్, సత్యమ్మ దంపతుల పెద్ద కొడుకు భాస్కర్‌గౌడ్, అతడి భార్య హారిక, రెండో కొడుకు భరత్‌గౌడ్, వాహనం డ్రైవర్ మధుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు నారాయణగౌడ్, మృతురాలు సత్యమ్మ, కొడుకులు, కోడలు, మనవడు, మనవరాలితో కలిసి పార్చునర్ వాహనంలో ఆదివారం ఉదయం సదాశివపేట పట్టణంలోని స్వగృహం నుంచి బయలుదేరారు. సంగారెడ్డిలోని వైకుంఠ పురం శ్రీ గోదాసమేత లక్ష్మీ విరాట్ వెంకటేశ్వరస్వామి దర్శించుకుని అక్కడి నుంచి సంగారెడ్డిలోని నారాయణగౌడ్ తమ్ముడి ఇంటికి వెళ్లారు. అక్కడ నారాయణగౌడ్ మనవడు, మనవరాలిని దించేసి అదే వాహనంలో భార్య సత్యమ్మ, కొడుకులు భరత్‌గౌడ్, భాస్కర్‌గౌడ్, కోడలు హారికతో కలిసి షాపింగ్ చేసేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డుపై వీరు ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నారాయణగౌడ్, సత్యమ్మ దంపతులు దుర్మరణం పాలవ్వగా భరత్‌గౌడ్, భాస్కర్‌గౌడ్, హారిక, డ్రైవర్ మధులకు తీవ్రగాయాలయ్యాయి.
క్లాస్ వన్ కాంట్రాక్టర్‌గా ఎదిగి..
మృతుడు నారాయణగౌడ్ బీఈ ఎలక్ట్రికల్ పూర్తి చేసి కాంట్రాక్టర్ పనులు చేపట్టాడు. ప్రస్తుత సంగారెడ్డి ఎమ్మెల్యే చిం తా ప్రభాకర్ సదాశివపేట మున్సిపల్ చైర్మన్‌గా పని చేసిన 1992 నుంచి 1995 వరకు నారాయణగౌడ్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. అనంతరం కాంట్రాక్టు పనులు చేస్తూ క్లాస్‌వన్ కాంట్రాక్టర్ స్థాయికి ఎదిగాడు. నారాయణగౌడ్, సత్యమ్మ దంపతుల దుర్మరణంతో సదాశివపేట పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న తోటి కాంట్రాక్టర్లు, ఆయన వద్ద పని చేస్తున్న కార్మికులు, డ్రైవర్లు విషాదంలో మునిగిపోయారు. నారాయణగౌడ్ ఇంటి వద్ద బంధువులు, స్నేహితులు గుమిగూడారు. నారాయణగౌడ్ దుర్మరణం చెందడంతో పట్టణ, మండల పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు సంతాప సూచకంగా నిలిపివేశారు.