సదాశివపేటలోని ఓ విద్యుత్ స్తంభానికి అల్లుకున్న చెట్ల తీగలు
సదాశివపేట: పట్టణ పరిధిలోని విద్యుత్ స్తంభాలకు చెట్ల పొదలు అల్లుకున్నాయి. చెట్ల తీగలు స్తంభంపై వరకు అల్లుకోవడంతో వీటి వద్ద ప్రమాదం పొంచి ఉంది. మరమ్మతు కోసం స్తంభాలు ఎక్కే పరిస్థితి లేకుండా పోతోంది. పట్టణంలోని వికారాబాద్ రోడ్ సబ్‌రిజిష్టార్ కార్యాలయం వద్ద, పట్టణ మండలానికి విద్యుత్ సరఫరా చేసే సబ్‌స్టేషన్ ఆవరణలోగల స్తంభాలకు తీగలు పెద్ద ఎత్తున అల్లుకున్నాయి.
దీంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతాయం కలుగుతోంది. నిత్యం విద్యుత్ అధికారులు సిబ్బంది చూస్తున్నారే తప్ప తొలగించడం లేదు. స్తంభాలు, తీగలను చెట్ల పొదలు అల్లుకోవడంతో తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. కొన్నేళ్లుగా ఇదే సమస్యతో విద్యుత్ వినియోగదారులు ఇబ్బందులుపడుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.
ఫలితంగా వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ తీగలను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై విద్యుత్ ఏఈ శ్రీహరిని సంప్రదించగా స్తంభాలకు తీగలు అల్లుకున్న చెట్ల పొదలను తొలగిస్తామన్నారు. ఎక్కడెక్కడ ఇలాంటి స్తంభాలు ఉన్నాయో గుర్తించి చెట్ల పొదలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.