మున్సి‘పోల్స్’ పోలీస్‌కు సవాల్
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు అన్ని చర్యలూ తీసుకున్నారు. మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి రావడంతో ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలను పోలీసులు సవాలుగా తీసుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ ఇప్పటికే పలుమార్లు వివిధ స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఎన్నికల్లో చేపట్టాల్సిన భద్రతపై సమీక్షించారు. జిల్లాకు చేరుకున్న పారా మిలిటరీ బలగాలతో పాటు అందుబాటులో ఉన్న పోలీసులు గత కొన్ని రోజులుగా మున్సిపల్ వార్డుల్లో నిఘాను తీవ్రతరం చేశారు. పోలింగ్‌బూత్‌లవారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసి ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేసేలా చర్యలు తీసుకున్నారు.
వందల మందితో భద్రత
సంగారెడ్డి, సదాశివపేట, మెదక్, జహీరాబాద్ మున్సిపాలిటీలతో పాటు గజ్వేల్, జోగిపేట నగర పంచాయతీల పరిధిలో మొత్తం 145 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం 192 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికలను సమర్థవంతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో ఒక ఎస్పీ, ముగ్గురు ఏఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 101 మంది ఎస్‌ఐలు, 268 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 1,040 మంది కానిస్టేబుళ్లు, 189 మంది మహిళా కానిస్టేబుళ్లు, 408 మంది హోంగార్డులు, ఇద్దరు రిజర్వు ఇన్‌స్పెక్టర్లు, 17 మంది రిజర్వు ఎస్‌ఐలు, 51 మంది ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు, 236 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు, 36 మొబైల్ పార్టీలు, 13 స్ట్రైకింగ్ ఫోర్స్, 6 ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్, 18 షాడో పార్టీలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.
ప్రత్యేక నిఘా
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 82 అతి సమస్యాత్మక ప్రాంతాలు, 98 సమస్యాత్మక, 11 సాధారణ ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి అరాచకాలకు పాల్పడే వారిపై పోలీసులు గట్టి నిఘా వేశారు. గతంలో వివిధ కారణాల వల్ల గొడవలకు పాల్పడి, గొడవలతో సంబంధం ఉన్న వారిని జిల్లా వ్యాప్తంగా 3,866 మందిని బైండోవర్ చేశారు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసే వారిని తమ అదుపులోకి తీసుకొనేలా ఏర్పాటు చేశారు.
జిల్లా వ్యాప్తంగా 59 మందికి ఆయుధాలకు (గన్) లెసైన్సులు ఉండగా వారి నుంచి ఆయా పోలీస్‌స్టేషన్‌లలో డిపాజిట్ చేయించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోకి కొత్త వ్యక్తులు రాకుండా చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల్లో గొడవలు పాల్పడతారని అనుమానం ఉన్న వారిపై షాడో పార్టీలు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంతరాలు, అక్రమాలు జరుగకుండా ఉండేందుకు వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. పోలింగ్ రోజున కేంద్రం సమీపంలో 30 పోలీసు యాక్టు, సెక్షన్ 144 అమలులో ఉంటుంది.