సదాశివపేట ఫయాజ్‌నగర్ కాలనీలో నిలిచిన మురుగు
- పట్టపగలే విజృంభణ
- పారిశుద్ధ్య లోపం, మురుగు నీరే కారణం
- నివారణ చర్యలు శూన్యం
- రోగాల బారిన పడుతున్న ప్రజలు
సదాశివపేట: నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పట్టణంలోని పలు కాలనీల్లో అపరిశుభ్రత వాతావరణం ఏర్పడింది. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టపగలే దోమలు ప్రజలపై దాడి చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా అవి జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపం డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంతో పలు కాలనీల్లో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. పిల్లలు, వృద్ధులు రోగాల బారినపడి ఆస్పత్రుల పాలవుతున్నారు.
పట్టణంలోని సిద్దాపూర్ కాలనీ, శంభులింగేశ్వరకాలనీ, నాగేశ్వర్‌నగర్, ఫయాజ్‌నగర్, గురునగర్, రవీంద్రనగర్, దత్తాత్రేయనగర్, శ్రీరాంనగర్, ప్రియదర్శిని కాలనీ, రాఘవేంద్రనగర్, హనుమాన్‌నగర్, కృష్ణనగర్, తదితర ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు నిలవ ఉండడంతో దోమలకు ఆవాసాలుగా మారాయి. దోమకాటుతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. చాలామంది మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధుల బారినపడి ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు కానీ వైద్య సిబ్బంది కానీ అయా కాలనీలపై కన్నెత్తి చూడడం లేదు. దోమల నివారణకు ఇళ్లలో కాయిల్స్, లిక్వీడ్ సీసాల వినియోగానికి ప్రతి కుటుంబం నేలకు వంద వరకు ఖర్చు చేస్తున్నారు. పట్టణంలో అధికారికంగా 10 వేల వరకు గృహాలు ఉండగా రికార్డుల్లో నమోదుకానీ గృహాలు మరో పదివేల వరకు ఉండవచ్చని అంచన.
పత్తాలేని ఫాగింగ్
పట్టణంలో పారిశుద్ధ్యంపై సంబంధిత అధికారులు ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పలు కాలనీల్లో పలు వ్యాధులు ప్రబలుతున్నాయి. డ్రైనేజీలు దోమలకు నిలయాలుగా మారినందువల్ల పిల్లలు, వృద్ధులు ఇబ్బందిపడతున్నారు. శానిటేషన్ సిబ్బంది దోమల నివారణకు ఫాగింగ్ చేయకపోవడం, చెత్తకుండీల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడంతో అపరిశుభ్రత రాజ్యమేలుతుంది. పలు కాలనీల్లో పిల్లలు,వృద్ధులు, యువత అనే తెడాలేకుండా విషజ్వారాల బారినపడుతున్నారు. ఇప్పటికైన మున్సిపల్ అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
దోమల నివారణకు చర్యలు తీసుకుంటాం
పట్టణ పరిధిలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ పరిధిలో ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నం. సిబ్బందిని అప్రమత్తంగ ఉంచుతూ అందుబాటులో ఉంచాం. కాలనీలో నీరు నీలువ ఉండకుండ ప్రత్యేక చర్యలు చేపడుతున్నం. పలు కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా పనులు చేపడుతున్నాం, ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. - ఇస్వాక్ ఆబ్‌ఖాన్, మున్సిపల్ కమిషనర్