‘అమ్మ’ శుభాలు కలుగచేస్తుంది
పోరుమామిళ్ల:
గతంలో ఒకసారి ఇక్కడకు వచ్చాను, మళ్లీ ఇప్పుడు పోరుమామిళ్లకు రావడం చాలా ఆనందంగా ఉందని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. పట్టణంలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించినా శ్రీ వాసవీకన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ పూజలు గత 5 రోజులుగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రోశయ్య శుక్రవారం పోరుమామిళ్ల వచ్చారు.
నిర్ణీత సమయం కన్నా గంట ఆలస్యంగా 12–45గం’’ హెలికాఫ్టర్‌లో కళాశాల మైదానంలో దిగారు. హెలిప్యాడ్ వద్ద రోశయ్యకు మాజీ శాసనసభ్యులు డాక్టర్ శివరామకృష్ణారావు, ఏపీపీఎస్‌సి మాజీసభ్యులు, నూతన ఆలయ నిర్మాణప్రధానకర్త గుబ్బా చంద్రశేఖర్, యోగివేమన వర్శిటీ పాలకమండలి సభ్యురాలు విజయజ్యోతి, జిల్లాఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, ఆర్డీఓ ప్రభాకర్‌పిళ్ళై తదితరులు స్వాగతం పలికారు. ఆయన నేరుగా పోలీస్‌స్టేషన్ అతిధిగృహానికి వెళ్లి, అక్కడ నుండి నేరుగా నూతన ఆలయానికి వచ్చారు. ఇక్కడ నిర్మించిన ఊంజలసేవ అద్దాలమందిరం, వన్యకాపరమేశ్వరి, రామాలయం, శివాలయాలతో పాటు నవగ్రహవేదికలను రోశయ్య సందర్శించారు. గుబ్బా చంద్రశేఖర్ ఆయన వెంట వుండి అన్ని వివరాలు చెప్పారు. ఆలయ నిర్మాణానికి రూ. 5 లక్షలు అంతకు పైబడి విరాళాలు ఇచ్చిన దాతలకు రోశయ్య జ్ఞాపికలు అందజేశారు.
అనంతరం ఆర్యవైశ్యకమిటీ పెద్దశ్రేష్ఠి, ధర్మకర్త, శాశ్వత గౌరవ అధ్యక్షులు రోశయ్యను సన్మానించారు. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన గుబ్బా చంద్రశేఖర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ పోరుమామిళ్లలో వాసవీమాతకు ఇంతచక్కని ఆలయం నిర్మించడం సంతోçషంగా వుందన్నారు. ప్రొద్దుటూరులో వాసవిమాత ఆలయం ప్రసిద్ది చెందిందన్నారు. ఇప్పుడు పోరుమామిళ్ల ఆలయం ప్రొద్దుటూరుకు పోటీగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ శివరామకృష్ణారావు, ఆర్యవైశ్యసంఘం జిల్లా, మండల నాయకులు, ఆర్యవైశ్యమహిళలు, యువకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.