అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లీ..!
కూడేరు : ’లేమ్మా నా చిట్టి తల్లి. మౌనిక.. నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా! లే..ఒక్కసారి అమ్మ అని పిలు తల్లీ’ అంటూ కుమార్తె మృతదేహంపై పడి తల్లి బోరున విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే ..ఆత్మకూరు మండలం శింగంపల్లి తండాకు చెందిన కంసల ఎర్రమ్మ, ,వెంకటేశులు దంపతుల రెండవ కూతురు మౌనిక(9) మూడో తరగతి చదువుతోంది. అవ్వకు ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆస్పత్రిలో చూపించేందుకని అమ్మానాన్నతో కలిసి మౌనిక కూడా ఆటోలో కూడేరుకు వెళ్లింది.
అక్కడి నుంచి 108 వాహనంలో అవ్వను తీసుకుని అమ్మానాన్న వెళ్లిపోయారు. బాలిక ఆటో డ్రైవర్ నారాయణస్వామితో కలసి స్వగ్రామానికి బయలుదేరింది. మార్గమధ్యంలో కుక్క అడ్డురావడంతో ఆటో బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన మౌనికను కూడేరు పీహెచ్‌సీకి తీసుకురాగా అప్పటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్ప్రతికి వచ్చి బోరును విలపించారు.