సాగునీటికి ఉద్యమం
చాపాడు:
శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 854 అడుగులు అమలు చేసి, కేసీ కాలువకు సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ ఉద్యమాలు చేపట్టనున్నట్లు ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏవీ రమణ పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న ఉద్యమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను గురువారం మండల కేంద్రమైన చాపాడులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఇప్పటికే శ్రీశైలానికి నీరందించే ఆల్మట్టి, ఇతర ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయిలో నిండాయని, వీటి నుంచి శ్రీశైలానికి భారీ వరదనీటి ప్రవాహం చేరుకుంటోందన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటి మట్టాన్ని నిలువ చేయాలన్నారు. ఇలా చేయటం వలన జిల్లాలోని 92వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు.
నిరసన కార్యక్రమాలు ఇలా
కేసీ కెనాల్‌కు సాగునీటì ని అందించాలని కోరుతూ ఈ నెల 8వ తేది నుంచి 17వ తేది వరకూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పలు రకాలైన నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 8న తహసీల్దారు కార్యాలయాల వద్ద ఆందోళనలు, 15న మైదుకూరులోని కేసీ కెనాల్ డీఈ కార్యాలయం ముట్టడి, 17న మైదుకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టి 36 గంటల పాటు దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి పి.శ్రీరాములు, సీనియర్ నాయకులు జి.బాలచెండ్రాయుడు, పల్లవోలు రమణ, ఏపీ రైతు సంఘం నాయకులు కె.రామాంజనేయులు, టి.పి నరసింహులు, రమేష్‌రెడ్డి, వెంకటేశు, శివశంకర్‌రెడ్డి, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు.