యుద్ధానికి ’తెర’లె
యుద్ధానికి ’తెర’లె
Published Mon, Jan 9 2017 10:57 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM
ఖైదీ నంబర్ 150, శాతకర్ణి సినిమాలకు థియేటర్ల కేటాయింపులో రాజకీయం
ఇతర సినిమాలకు స్క్రీన్ కష్టాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
సినిమాల్లో హీరోలు చేసే ఫైట్లు చూసి అభిమానులు ఈలలు వేసి కేరింతలు కొట్టడం చూశాం. మా హీరో సినిమా హిట్ అంటే.. కాదు మా వాడి సినిమా హిట్ అంటూ అభిమానులు మాటల యుద్ధం చేసుకోవడమూ చూశాం. తాజాగా మరో రకం యుద్ధం జరుగుతోంది. అదే థియేటర్ల యుద్ధం. గత ఏడాది హీరో బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమాను ఎక్కువ థియేటర్లలో ప్రదర్శింపచేసేందుకు.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా ప్రదర్శనకు థియేటర్లు దొరక్కుండా చేశారనే విమర్శలొచ్చాయి. ఈ ఏడాది కూడా సంక్రాంతి రోజుల్లో సంస్కృతి కొనసాగుతోంది. చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ నటించిన గౌతమీపుద్ర శాతకర్ణి సినిమాల విషయంలో థియేటర్ల యుద్ధం జరుగుతోంది.
ఏలూరులో ఇదీ పరిస్థితి
ఏలూరు నగరంలోని అంబికా థియేటర్ కాంప్లెక్స్‌లో మూడు, సత్యనారాయణ కాంప్లెక్స్‌లో మూడు, విజయలక్ష్మి థియేటర్‌లో రెండు, బాలాజీ థియేటర్‌లో రెండు స్క్రీన్‌లు కలిపి మొత్తం 10 స్క్రీన్‌లు ఉన్నాయి. ఈ నెల 11న ఖైదీ నంబర్ 150 విడుదల అవుతుండగా, 12న గౌతమీ పుత్ర శాతకర్ణి విడుదల కాబోతోంది. వీటితోపాటు దిల్ రాజు నిర్మణ భాగస్వామ్యంతో నిర్మితమైన శతమానం భవతి చిత్రం 14వ తేదీన విడుదలవుతూ సంక్రాంతి బరిలో నిలిచింది. 11వ తేదీన ఖైదీ నంబర్ 150 సినిమాను నగరంలోని అన్ని స్క్రీన్లపైనా ప్రదర్శించేందుకు రంగం సిద్ధం చేశారు. 12వ తేదీన విడుదలయ్యే శాతకర్ణి విడుదల తరువాత కూడా అన్ని థియేటర్ కాంప్లెక్స్‌ల్లో ఈ రెండు చిత్రాలను ఏదో ఒక తెరపై ప్రదర్శించనున్నారు. కాగా శతమానం భవతి చిత్రంపై కొద్దిగా అంచనాలు ఉన్నప్పటికీ ఇద్దరు అగ్రనటుల మధ్య పోటీలో ఈ చిత్రానికి తెరలు కరువయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అంబికా కాంప్లెక్స్ ఒకదానిలో మాత్రమే ఈ చిత్రం ప్రదర్శించనున్నట్టు చెబుతున్నారు. కాగా విప్లవ కథానాయకుడు ఆర్.నారాయణమూర్తి నటించిన కానిస్టేబుల్ వెంకట్రామయ్య, భారతీయ నటి దీపికా పడుకొనే నటించిన ఇంగ్లిష్ చిత్రం ట్రిపుల్ ఎక్స్ రిటర్న్‌ఆ ఫ్ జాండర్ కేజ్ చిత్రం ఈనెల 14న విడుదల కానున్నాయి. ఇవి ఏ థియేటర్‌లో విడుదలయ్యేది ప్రశ్నార్థకంగానే ఉంది. వీటికి తెరలు దొరికేదీ లేనిదీ చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల జయాపజయాలపై ఆధారపడి ఉంటుంది.
చింతలపూడిలో..
చింతలపూడి నియోజకవర్గంలో చిరంజీవి సినిమాను మొదటి రోజున రెండు బెనిఫిట్ షోలు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రమే వెళ్ళే ఈ షోలకు టికెట్ ధర రూ.500 నిర్ణయించారు. మొదటి రోజున పట్టణంలోని ఎక్కువ థియేటర్లలో ఇదే సినిమా వేయడానికి సిద్ధం చేశారు. పండగ మూడు, నాలుగు రోజులు రత్నా కాంప్లెక్స్‌లో చిరు 150 సినిమా మాత్రమే వేసే అవకాశం ఉంది. బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి కూడా ముందుగానే బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మడానికి రెడీ అవుతున్నారు. ఈ పండగకు రెండు చిత్రాల మధ్య చిన్న చిత్రాలకు థియేటర్లు దొరికే పరిస్థితి లేదు.
నరసాపురంలో..
నరసాపురం పట్టణంలో మూడు, మొగల్తూరులో రెండు థియేటర్లు ఉన్నాయి. వీటిలో పెద్ద సినిమాలనే బుక్ చేశారు. చిన్న సినిమాలకు ప్రస్తుతానికి చాన్స్ కనబడటం లేదు. నరసాపురంలో మొదటి రోజున మూడు థియేటర్లలోనూ ఖైదీ నంబర్ 150 సినిమా ప్రదర్శిస్తున్నారు. ఈనెల 12 నుంచి ఓ థియేటర్‌లో చిరంజీవి సినిమా, మరో థియేటర్‌లో బాలకృష్ణ సినిమా ప్రదర్శిస్తున్నారు. మొగల్తూరులో ఒక దాంట్లో చిరంజీవి సినిమా, మరొక థియేటర్‌లో బాలకృష్ణ సినిమా ప్రదర్శిస్తున్నారు. చిరంజీవి సినిమా స్పెషల్ షో టికెట్ ధర ప్రస్తుం రూ.500 ఉంది. రూ.1000కి పెరిగే అవకాశం ఉందంటున్నారు.
Advertisement