ఈ దిలీప్‌ మిస్టర్‌ వాల్‌ | mr.wall of dileep | Sakshi
Sakshi News home page

ఈ దిలీప్‌ మిస్టర్‌ వాల్‌

Published Tue, Jul 18 2017 9:48 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

ఈ దిలీప్‌ మిస్టర్‌ వాల్‌ - Sakshi

ఈ దిలీప్‌ మిస్టర్‌ వాల్‌

qడిఫెన్స్‌లో తన జట్టుకు కోటగోడగా మారి ప్రత్యర్థి జట్టు గోల్స్‌ చేయకుండా అడ్డుకుంటాడు. జట్టు పాల్గొన్న ప్రతి పోటీలోనూ తన కంటూ ప్రత్యేకత నిలుపుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : పరిగి మండలం కాలువపల్లికి చెందిన సాధారణ రైతు కూలీ అశ్వర్థప్ప, అన్నపూర్ణమ్మ దంపతుల కుమారుడు దిలీప్‌. ప్రస్తుతం ఆర్డీటీ ఫుట్‌బాల్‌ అకాడమీలో ఉంటూ విన్సెంట్‌ డీ పాల్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. 2010లో ఆర్డీటీ అకాడమీ పరిగిలో పీఈటీ రామాంజనేయులు వద్ద తన ఫుట్‌బాల్‌ క్రీడకు సంబంధించిన ఓనమాలు దిద్దాడు. అనంతరం 2014లో స్కూల్‌ గేమ్స్‌ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొని రాష్ట్ర జట్టులో చోటు సాధించాడు. 2015లో ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి లీగ్‌ పోటీల్లో పరిగి జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. తన ఆటతీరును గుర్తించిన ఆర్డీటీ కోచ్‌ దాదా ఖలందర్, రియాజ్‌లు ఆర్డీటీ అకాడమీకి ఎంపిక చేశారు.

రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా
ఆర్డీటీ అకాడమీలో చేరిన ఆరు నెలల్లోనే దిలీప్‌ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాపోటీలకు ఎంపికై తన సత్తా చాటాడు. గతేడాది జాతీయస్థాయి పీఎం టోర్నీకి ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున పాల్గొనే అవకాశం దక్కింది. రైట్‌ సెంటర్‌ బ్యాక్‌ స్థానంలో ఉంటూ ప్రత్యర్థి జట్టు సంధించిన ఏ బంతినైనా అవలీలగా అవతలి గోల్‌ వైపునకు మళ్లించి ప్రత్యర్థి జట్టును గోల్‌ సాధించకుండా అడ్డుకుంటూ తన ప్రత్యేకత నిలుపుకుంటున్నాడు. అతని ఆటతీరును గమనించిన సెలెక్టర్లు అతనిని జాతీయ ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరానికి ఎంపిక చేశారు. ఫతేహ్‌ హైదరాబాద్‌ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఇండియన్‌ లీగ్‌ క్రీడా పోటీల్లోను ప్రతిభను కనబరిచాడు. గతేడాది అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అనంత జట్టును అండర్‌–14 విజేతగా నిలపడంలో తనే కీలకం. వీటితోపాటు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో 4 సార్లు, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో 3 సార్లు, ఖేలో ఇండియా పోటీల్లో 2 సార్లు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాడు.
    
ఇండియన్‌ ప్లేయర్‌ కావడమే లక్ష్యం
ఆర్డీటీ లేకుంటే నేను ఇంతటి గొప్ప క్రీడాకారుడిగా మారేవాడిని కాదు. ఇక్కడి కోచ్‌లు దాదా ఖలందర్, రియాజ్‌లు అందిస్తున్న శిక్షణ, వివిధ దేశాల నుంచి వస్తున్న ఆటగాళ్లు ఇచ్చే మెలకువల ద్వారా నా ఆటతీరును మార్చుకోగలిగాను. ఎప్పటికైనా ఇండియన్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నదే నా లక్ష్యం.
- దిలీప్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement