మాదిగలు ఆగ్రహిస్తే టీడీపీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూస్థాపితం కాక తప్పదని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మాదిగ హెచ్చరించారు.
18 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మాణిక్యరావు మాదిగ
తెనాలి అర్బన్ (గుంటూరు): మాదిగలు ఆగ్రహిస్తే టీడీపీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూస్థాపితం కాక తప్పదని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మాదిగ హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాదిగల సంఖ్య ఎక్కువ ఉండడంతో చంద్రబాబునాయుడు మాదిగల జపాన్ని చేశారని, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మాలల సంఖ్య ఎక్కువగా ఉండడంతో.. హామీలను విస్మరించి, మాదిగల ఉద్యమాన్ని అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనిలో భాగంగానే టీడీపీకి అండగా ఉన్న మాదిగలకు అన్యాయం చేస్తూ.. కొందరు మాలసోదరులను అందలం ఎక్కిస్తున్నాడని విమర్శించారు. జరుగుతున్న పరిణామాలను మాదిగలు గమనిస్తూ ఆవేదన చెందుతున్నారని, ఆ ఆవేదన ఏదో ఒకరోజు ఆగ్రహంలా మారి టీడీపీని, చంద్రబాబును భూస్థాపితం చేస్తుందని హెచ్చరించారు.
మాలలకు, దళితులకు నాయకుడు కాని కారెం శివాజీని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించి చంద్రబాబు పెద్ద తప్పుచేశారని విమర్శించారు. శివాజీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 18, 19, 20 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మండల కార్యాలయాల వద్ద నిరసనలు, రాస్తారోకోలు, 21న ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలు, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మల దహనాలు, 23న కలెక్టరేట్‌ల వద్ద అందోళన, సీఎం దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, జిల్లా అధ్యక్షుడు ఉన్నం ధర్మారావు మాదిగ, జిల్లా ఇన్‌చార్జి షాలెంరాజు మాదిగ, రాష్ట్ర కమిటీ సభ్యుడు చిలకా కిరణ్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.